నవార వరి భేష్‌!

23 Oct, 2018 00:43 IST|Sakshi
మాధవరెడ్డి సాగు చేసిన నవార రకం వరి పంట

ఉచితంగా నవార విత్తనాలు ఇస్తానంటున్న రైతు

రసాయనిక వ్యవసాయం నష్టదాయకమని తెలుసుకున్న రామాల మాధవరెడ్డి, సుభాషిణి రైతు దంపతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మామిడి, వరి సాగు ప్రారంభించి సంతృప్తికరమైన దిగుబడి పొందుతున్నారు. ఈ సీజన్‌లో మధుమేహరోగులకు ఉపయోగపడే దేశవాళీ నవార రకం ధాన్యం సాగు చేశారు.

కందుకూరు మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన రామాల మాధవరెడ్డి. కౌలుకు ఎకరా పొలం తీసుకొని వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది రబీలో శ్రీవరి పద్దతిలో ఎన్‌ఎల్‌ఆర్‌–33972 రకం వరిని పూర్తి సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేశారు. ఎకరానికి 30 బస్తాలు దిగుబడి సాధించారు. తర్వాత తనకున్న మూడెకరాలలో మామిడి తోటలో సేంద్రియ ఎరువులను వాడటం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా నిలిపివేసి ప్రకృతి వ్యవసాయం వైపే మొగ్గుచూపాడు.

మామిడి తోటలో వ్యవసాయం చేస్తున్న సమయంలో మామిడి పిందెలను పరిశీలించేందుకు మామిడి చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తు మామిడి చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోయాడు. దీంతో మాధవరెడ్డికి నడుము, కాలు ప్రమాదానికి గురై పూర్తిగా బెడ్‌ రెస్ట్‌లో ఉన్నారు. ఆ దశలో మాధవరెడ్డి భార్య సుభాషిణి, కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవసాయంపై దృష్టి సారించటం విశేషం. ఒంగోలులో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటి దగ్గర నుంచే కాలేజ్‌కి వెళ్లి వస్తూ వ్యవసాయ పనుల్లో తల్లికి చేదోడుగా ఉంటున్నారు.

ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ధనుంజయ త్రిపురాంతకం నుంచి రెండు కిలోల దేశవాళీ నవార రకం వరి విత్తనాలు తెచ్చి ఇచ్చారు. వ్యవసాయాధికారులు, ప్రకృతి వ్యవసాయ నిపుణుల సూచనల ప్రకారం బీజామృతంతో «విత్తన శుద్ధి చేసి, జీవామృతం, ఘన జీవామృతం వాడారు. తెగుళ్ల నివారణకు పుల్లని మజ్జిగ, వావిలాకు కషాయం, ఇంగువ ద్రావణం వాడారు. శ్రీవరి పద్ధతిలో మొక్కకు మొక్కకు 25“25 సెంటీమీటర్ల దూరంలో నాటారు. గింజ గట్టి పడడానికి ఏడు రకాల పప్పు ధాన్యాలతో తయారు చేసుకున్న టానిక్‌ను వాడారు. మూడున్నర నెలల పంటకాలంలో 14 ఆరుతడులు ఇచ్చి, ఇటీవలే నూర్పిడి చేశారు.  
ఇలా రెండు కిలోల విత్తనాలను ఎకరంలో సాగు చేసి రూ. 12,150 ఖర్చుతో వెయ్యి కేజీల నవార ధాన్యం దిగుబడి సాధించారు. నవారి రకం వరి వడ్లు నలుపు రంగులో బియ్యం బ్రౌన్‌ రంగులో ఉంటాయి. ఈ బియ్యం డయోబెటిక్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వాడతారు. మార్కెట్‌లో ఈ బియ్యానికి గిరాకీ ఉంది. 75 కేజీల బస్తా రూ. 3,500లకు విక్రయిస్తానని రైతు మాధవరెడ్డి చెప్తున్నారు. బియ్యం తిన్నవారు రసాయనిక మందులతో పండించిన బియ్యం తినలేరని ఆయన అంటున్నారు. నవార రకం వరిని సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తానని మాధవరెడ్డి తెలిపారు.  
– విజయ్, కందుకూరు రూరల్, ప్రకాశం జిల్లా


రైతు మాధవరెడ్డి, నవార రకం బియ్యం

మరిన్ని వార్తలు