టూకీగా ప్రపంచ చరిత్ర 72

26 Mar, 2015 23:24 IST|Sakshi
టూకీగా ప్రపంచ చరిత్ర 72

లిపి
 
సంఖ్యకు సంకేతంగా అంకెల రూపంతో ఉనికిలోకి వచ్చిన లిపి, అనతికాలంలోనే పదార్థాలను గుర్తించేందుకు ప్రాకులాండింది. ఒక వృత్తం గీస్తే పున్నమి చంద్రుడు; ఆ వృత్తం వెలుపలిగా చుట్టూరా చిన్న చిన్న గీతలు గీస్తే సూర్యుడు; గీతలులేని అర్ధవృత్తం కొసలను వంకర చాపంతో కలిపితే మిగతా రోజులు చంద్రుడు; వృత్తాన్ని నలుపుతో నింపితే అమావాస్య! ఈ విద్యకు రాతియుగం నాటి నేపథ్యం ఉండనే ఉంది. చెట్టూ గుట్టూ పిట్టల వంటి ఇతర పదార్థాలకు రూపం సమకూర్చుకోవడం పెద్ద విశేషం గాదు కూడా. ఆలోచన తట్టగానే కసరత్తు మొదలయింది. సమృద్ధిగా రాయి దొరికే ఈజిప్టు వంటి ప్రాంతాల్లో శిల్పం, చిత్రలేఖనంతో ప్రయోగాలు ఊపందుకున్నాయి. లోహపు పనిముట్లు అందుబాటైన మీదట శిల్పంతో రూపొందించే చిత్రలిపికి నాణ్యత ఏర్పడింది. ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం నాటికి ఈ ‘చిత్రలిపి’ గొప్పగా ప్రాచుర్యం సంపాదించుకుంది. పిరమిడ్ల అంతర్భాగంలో గోడలమీద మలచిన శిల్పాలు అలంకారప్రాయమైనవి మాత్రమే గాదు; కొన్ని సంఘటనలను గుర్తుజేసే చిత్రలిపి సంకేతాలు కూడా. దక్షిణ అమెరికాలో నివసిస్తున్న ‘అమెరిండియన్ల’లోనూ, దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న కొన్ని ఆటవిక జాతుల్లోనూ వ్యవహారాలు ఇప్పటికీ చిత్రలిపిలోనే సాగుతున్నాయి. అంతెందుకు - అక్షరజ్ఞానం లేనివాళ్లు సౌకర్యం కోసం రహదారుల వెంట కనిపించే గుర్తులకు ఉపయోగించేది చిత్రలిపే. రోడ్డు వంకరను తెలిపేందుకు వంకరగీత, రైల్వేగేటును తెలిపేందుకు గేటు గుర్తు, స్పీడ్‌బ్రేకర్‌ను తెలిపేందుకు మధ్యలో మూపురమున్న అడ్డగీత మొదలైనవి నిత్యం మన చూస్తూనే ఉన్నాం. వేరువేరు భాషలకు చెందిన ప్రయాణీకులకు ఆలవాలమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో - ‘కప్పు సాపరు’ గుర్తు అల్పాహారశాలనూ, ‘నైఫ్ అండ్ ఫోర్క్’ గుర్తు భోజనశాలనూ, అనేక తదితర సదుపాయాలు ఇతర గుర్తులతోనూ సూచిస్తూ, ఇప్పటికీ తన సేవలను చిత్రలిపి మనకు అందిస్తూనే ఉంది.

రాయి దొరకని మెసపొటేమియా, సింధుస్థాన్ వంటి ప్రదేశాల్లో లేఖనానికి అనువైన ఉపరితలంగా ప్రత్యామ్నాయాలు అవసరమయ్యాయి. ఆ ప్రాంతాల్లో అచ్చులుగా పోసేందుకు వీలయ్యే బంకమట్టి సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి, మట్టిపలక-మొనదేరిన పుడకలు లేఖనా సామగ్రీ ఉపయోగంలో కొచ్చాయి. అయితే, పచ్చిగా ఉండే పలకమీద కర్రములికితో వంపుగీతలు తొలచడం తేలికైన పనిగాదు. పైగా, వేగం పుంజుకుంటున్న వర్తకం తీరుబాటుగా నొక్కులు తీర్చేంత అవకాశం కల్పించదు. అందువల్ల, పచ్చిపలకమీద కర్రములికి తొలిచే నిలువు గీతలూ అడ్డగీతలూ వాళ్ల లేఖనానికి ఆధారాలయ్యాయి. ములికి విసురు (స్ట్రోక్)తో తొలిచే గీత, మొదటగా ములికి మోసిన తావులో కాసింత వెడల్పుగానూ, పైకి లేచిన చోట కోసుగానూ ఏర్పడటం సహజం. దరిమిలా ఆ లేఖనానికి అడ్డదిడ్డంగా పేర్చిన పొడవాటి మేకుల ఆకారం ఏర్పడటంతో, ‘క్యూనిఫాం లిపి’గా శాస్త్రజ్ఞులు నామకరణం చేశారు.

తూకమైన రాతిపలకలూ, మట్టిపలకలకు మారుగా, దూరప్రాంతాలకు వర్తమానం చేరవేసేందుకు వీలయ్యే తేలికపాటి పరికరాలకోసం మరోవైపు అన్వేషణ మొదలయింది. పలుచటి చర్మం మీదనో, దళసరి బట్ట మీదనో రంగు మట్టి నుండీ, ఆకుల రసం నుండి లభ్యమయ్యే చిక్కటి ద్రవంలో మొనదేరిన లేఖిని ముంచి, సంకేతాలను పొందుపరచడం అమలులోకొచ్చింది. ఇలాంటి ఉపరితలం మీద వంకర తీగలకు అవరోధం తక్కువ. అద్ది రాసేందుకు తయారు చేసిన రంగు ద్రవం ‘సిరా’ (ఇంక్). సిరాను ఉపరితలం మీదికి బదిలీ చేసే లేఖినిగా చాలాకాలం ఉపయోగపడిన సాధనాలు - కుంచె, పక్షి ఈక, ఎన్నో దశలుగా ఎదిగి, నిన్నామొన్నటి దాకా లేఖినిగా ఉపయోగపడిన సాధనం ‘పాళీ’ (నిబ్). లోహ పరిశ్రమ నైపుణ్యం పెరిగిన తరువాత, ఇత్తడి పలకలూ, రాగి రేకులు కూడా వ్రాతపరికరాలుగా ప్రవేశించాయి. వీటి మన్నిక దీర్ఘమైనదే కానీ, లభ్యత ఖరీదులు అందరికీ అందుబాటయ్యే పరిమితిలో ఉండవు.

రచన: ఎం.వి.రమణారెడ్డి

మరిన్ని వార్తలు