మెడకు బదులుగా...మనిషే తిరగాల్సి వస్తే!

6 Oct, 2014 23:21 IST|Sakshi
మెడకు బదులుగా...మనిషే తిరగాల్సి వస్తే!

బహుశా మనలో చాలామందికి తలకు- దేహానికి మధ్య మెడ అనే కీలకమైన భాగం ఉందనే విషయం పెద్దగా గుర్తుండదు. మెడకు ప్రాధాన్యత కూడా తక్కువే. సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్య ఏదో వచ్చి, తల తిప్పాల్సి వచ్చినప్పుడు ఆ పని సాధ్యం కాక మనిషి తిరగాల్సి వచ్చినప్పుడు మెడ ఎంత కీలకమైనదో తెలిసి వస్తుంది. దీనికి చికిత్స సులభమే కానీ దానికి ముందు ఒక నిర్ధారణకు రావడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.
     
ప్రాథమికంగా ఎక్స్-రే తీస్తారు. ఇందులో మెడ ఎముక ఒక చోట ములుకులా పొడుచుకురావడం, లేదా ఎముకకు సంబంధించి ఇతర అపసవ్యతలు తలెత్తినా తెలుసుకోవచ్చు.

ఎక్స్-రే ద్వారా కచ్చితంగా నిర్ధారించలేని సందర్భాలలో కంప్యూటరైజ్‌డ్ టోమోగ్రఫీ స్కాన్ (సి.టి. స్కాన్) ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు  మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా నరాల స్థానాల్లో వెంట్రుక వాసి తేడా వచ్చినా కూడా స్పష్టంగా తెలుస్తుంది  మైలోగ్రామ్ పరీక్షలో ఇంజక్షన్ ద్వారా రంగును వెన్నులోకి పంపించి ఆ తర్వాత సి.టి స్కాన్ లేదా ఎక్స్-రే పరీక్షలు చేస్తారు. రంగు విస్తరించడంతో ఏర్పడిన ఆకారాన్ని బట్టి వెన్నుపూసలలో వచ్చిన తేడాను తెలుసుకుంటారు. మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వస్తే నరాల పనితీరును కూడా పరీక్షిస్తారు.

వీటిలో...
ఎలక్ట్రో మయోగ్రామ్ (ఇఎమ్‌జి) పరీక్ష ద్వారా కండరాలకు కొన్ని సంకేతాలను పంపించి నరాల స్పందనను అధ్యయనం చేస్తారు. దాంతో నరాల పనితీరు సాధారణంగానే ఉందా, తేడా ఉందా అనే వివరాలు తెలుస్తాయి.

చికిత్స: నొప్పి నివారణకు, నరాలు శక్తిమంతం కావడానికి మందులు వాడుతూ ఫిజియోథెరపీ (మెడకు వ్యాయామం) చేస్తే సమస్య తగ్గిపోతుంది. చాలా కొద్ది సందర్భాలలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

మరిన్ని వార్తలు