చీకట్లో తోడేలు

13 Feb, 2018 01:40 IST|Sakshi

చీకట్లో కుక్క గతికిన చప్పుడు వినిపించింది. కుక్కేనా?కంగారుపడి కళ్లు తెరిచాడు. నల్లటి నలుపు. కారు చీకటి. గదిలో ఏమీ కనిపించడం లేదు. తల దగ్గర పెట్టుకుని ఉన్న టార్చ్‌లైట్‌ను టప్‌మంటూ వెలిగించాడు. ఒక మనిషి నిలబడి ఉన్నాడు– ఆ అమ్మాయి కాళ్ల దగ్గర. ఆ అమ్మాయి విసుక్కుంటూ అటు తిరిగి పడుకోబోతూ అంది– ‘ఏం సార్‌. నిద్ర పట్టట్లేదా. నన్నుగానీ మీ పెళ్లాం అనుకుంటున్నారా ఏంది?’ లైట్‌ ఫోకస్‌ ఆ మనిషి వైపు తిరిగింది. ‘అదీ... దారి ఎటో కనిపించలేదు. నిద్ర పట్టక సిగరెట్‌ తాగుదామనుకుని లేస్తే ఈ అమ్మాయి కాలు తగిలింది’ నసిగాడు.

ఆ అమ్మాయి ఈవైపు పడుకుని ఉంది. తలుపు ఆ వైపు ఉంది. తలుపు వైపు వెళితే అమ్మాయికి కాలెందుకు తగులుతుంది? టార్చ్‌ వేసి దారి చూపించాడు. అతడు పిల్లిలా బయటకు వెళ్లి అయిదు నిమిషాల సేపు తాత్సారం చేసి తిరిగి వచ్చి గుట్టుగా బెంచీ మీద సర్దుకున్నాడు. పాతకాలపునాటి గవర్నమెంట్‌ స్కూల్‌ గది అది. తెల్లవారితే పోలింగ్‌. ఆ డ్యూటీ మీద సాయంత్రం వచ్చి ఊరివాళ్లు ఇచ్చిన భోజనం చేసి నిద్రపోయారు. పోలింగ్‌ ఆఫీసరు, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసరు, హోంగార్డ్‌గా వచ్చిన ఆ అమ్మాయి. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ నుంచి అందరూ లారీలో బయలుదేరినప్పటి నుంచి గమనిస్తున్నాడు.

పోలింగ్‌ ఆఫీసరు ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. గొప్పలు చెబుతున్నాడు.గొప్పతనం తనకే ఉన్నట్టుగా దర్పాలు పోతున్నాడు. అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌కి ఆ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది. తనకు అంత వయసు కూతురు ఉంది. తన కూతురు చదువుకుంటోంది. ఈ అమ్మాయి హోమ్‌గార్డ్‌గా పని చేస్తోంది. తన కూతురు ఈ సమయంలో ఇంట్లో సురక్షితంగా నిద్రపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఈ పాతకాలం నాటి స్కూల్లో కాళ్ల దగ్గర కుక్కలాగా ఒక మగాడు తారాట్లాడుతుండగా.... చీకటి అలాగే ఉంది. మళ్లీ నిద్ర పట్టేసింది. బోరింగ్‌ శబ్దం వినవస్తుంటే మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూశాడు. చీకటిగానే ఉంది. టార్చి వేసి టైమ్‌ చూసుకున్నాడు. ఐదుంపావు. గదిలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి గొంతు వినిపించింది– ‘పీవో సారూ... ఇటువైపు రావద్దు. స్నానం చేస్తున్నా. కాసేపు ఆగి రండి. ఇటువైపు రావద్దన్నానా’ లేచి కూర్చున్నాడు.

పీవో బూడిదరంగు నీడలాగా గదిలోకి వచ్చాడు. ‘అదీ కడుపులో బాగలేకపోతే లేచానండీ’ నసిగాడు. తెల్లవారిపోయింది. పోలింగ్‌ మొదలైపోయింది. పీవో ధుమధుమలాడుతూ డ్యూటీ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఓపిగ్గా డోర్‌ దగ్గర నిలబడి వచ్చే జనాన్ని అదుపుచేస్తూ లోపలికి పంపుతూ ఉంది. నవ్వు ముఖం. లొంగని నవ్వు ముఖం. ఆ నవ్వు చూస్తుంటే పీవోకి ధుమధుమ పెరిగిపోతోంది. డ్యూటీ ముగించుకుని ఆ రాత్రి తిరుగుప్రయాణంలో లారీ ఎక్కారు. పీవో, ఏపీవో, ఆ హోమ్‌గార్డు అమ్మాయి. ఉన్నట్టుండి పీవో వాగాడు– ‘పోలీసులు రేపులు చేశారని వార్తలు వస్తుంటాయి. ఏం... వాళ్లకు ఆడపోలీసులు సరిపోకనా? ఆడపోలీసులు ఉంటారుగా వాళ్లకు’ కచ్చ తీరింది. ఆ అమ్మాయి చురుగ్గా చూసింది.

‘ఏం నోరు సార్‌ మీది. ఈ మాట అన్న నోటితో మీరు అన్నం ఎలా తింటారు?’ అంది. డిస్ట్రిక్‌ హెడ్‌క్వార్టర్స్‌ వచ్చాక పీవో మాటవరుసకు వెళ్లొస్తానని కూడా అనకుండా వెళ్లిపోయాడు. ఏపీవో దగ్గరకు ఆ అమ్మాయి వచ్చింది సెలవు తీసుకోవడానికి. ‘ఎలా చేస్తున్నావమ్మా ఈ ఉద్యోగం’ ‘తప్పదు సార్‌. బతకాలంటే చేయకతప్పదు కదా.’ ‘మరి ఈ ఇబ్బందులు’ ‘ఇబ్బందులకు బయపడతామా సార్‌. ఎక్కడకు వెళ్లినా ఇలాంటి కుక్కలు ఉండనే ఉంటాయి’ మళ్లీ అంది– ‘ఆడదంటే నడుమూ వీపూ కండ అని మగాళ్లు అనుకునే వాతావరణం ఉన్నంతకాలం ఇది తప్పదు సార్‌’ ఆ మాట అంటున్నప్పుడు ఆ అమ్మాయి గొంతులో జీర కదలాడింది. ఏపీవో గుండెలో కూతురుని తలుచుకుని చిన్న భయం తారాట్లాడింది.

తన కూతురు సురక్షితంగా తన రెక్కల కింద పెరుగుతోంది అనుకుంటున్నాడు గానీ ఆ రెక్కల బలమెంత... బయట గాలివాన ఎంత? పెద్ద ప్రశ్న. కథ ముగిసింది. కేతు విశ్వనాథ రెడ్డి రాసిన ‘రెక్కలు’ కథ ఇది. లోకం ఇలాగే ఉంటుందా... లోకం ఇలా ఇంకా ఎంతకాలం ఉంటుంది. సంఘంలో ఎందరో మగవాళ్లు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉద్యోగులు, నాయకులు, సంస్థాధిపతులు, లెక్చరర్లు, టీచర్లు.... పగటి వేళ వాళ్లు మనుషులు కావచ్చు. చీకటి పడితే తోడేళ్లు కావచ్చు. స్త్రీల మాంసం కోసం కాచుకుని ఉండే ఇలాంటి తోడేళ్లను లొంగని ఆత్మబలం అనే చెప్పుతో కొట్టాలి. అలా కొట్టమని చెప్పే పైలం చెప్పే కథ, ఈ కథ– రెక్కలు.

- కేతు విశ్వనాథరెడ్డి

మరిన్ని వార్తలు