మట్టినిల్లు

13 Feb, 2018 00:36 IST|Sakshi
పదహారేళ్లు ప్రతిరోజూ పొలం పనిచేసిన రాజేశ్వరికి మిగిలింది హక్కు కాదు. మట్టి.

పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన అమ్మాయికి మిగిలింది మట్టే! జీవితాన్నంతా పిండి ఆ మట్టిలో పోసినా.. ఆ పంట ఎప్పటికీ మెట్టినింటిదే. మట్టిని నమ్ముకున్న మహిళకు.. మెట్టినిల్లు ఏమౌతుంది? మట్టినిల్లే!

సరిగ్గా గుర్తులేదు కానీ, పెళ్లయ్యేనాటికి పదమూడో పధ్నాలుగో రాజేశ్వరికి! ఇంకా చెప్పాలంటే గవర్నమెంటు స్కూల్లో ఎయిత్‌ క్లాస్‌ బోర్డు మీదకు ఆమె పేరు ఎక్కినప్పుడు! అప్పుడు తనతో పాటు మరో ముప్ఫయ్‌ మంది అమ్మాయిలు కూడా అదే ఊర్లో బడిమానేసినట్లు రాజేశ్వరికి గుర్తు. టెన్త్‌ క్లాస్‌ కష్టపడి చదివి పాసైతే పక్కనే ఉన్న సిద్ధిపేట కాలేజీలో చేరొచ్చని తనూ తన ఫ్రెండ్సంతా ఎన్ని కలలుగన్నారు?! ఎలాగోలా టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇక ఇంట్లో కూడా.. చదువు మాన్పించమని నాన్న అడగరు.

ఆ తరువాత నర్స్‌ ట్రైనింగ్‌కి వెళితే హైదరాబాద్‌లో ఏ ఆసుపత్రిలో నైనా జాబ్‌ చేయొచ్చు. తనకోసం, తన చెల్లెళ్లిద్దరికోసం ఎండనకా వాననకా అమ్మపడే కష్టం చూడలేకపోతోంది. పుస్తకాలకీ, పెన్నులకీ ఏ అవసరానికైనా అమ్మేగా డబ్బులివ్వాల్సింది. ఆమె కూలికెళ్లి దాచిన డబ్బుతో కష్టపడి చదువుకుంది కనుకనే అమ్మ కష్టం తీర్చాలనుకుంది. అసలు అమ్మ పోరు పడలేకే కదా నాన్న రాజేశ్వరిని బళ్లో చేర్చింది. ఆయనకైతే ఎప్పుడూ తనకు పెళ్లి చేసి పంపించేయాలన్న తొందరే ఉండేది. అయితే తను మాత్రం అంత త్వరగా బడి మానేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు రాజేశ్వరి. ఆ రోజు ఆ సంఘటన జరగకపోతే ఆమె కచ్చితంగా ఆ గొడ్డుచాకిరీ నుంచి తప్పించుకోగలిగి ఉండేది.

చదువుకు అదే చివరి రోజు!
అప్పటికే గుసగుసగా అంతా చెప్పుకుంటున్నారు. రాజేశ్వరిని హెడ్‌మాస్టర్‌ పిలిచారని. క్లాస్‌లోకి వెళ్లకుండానే మధ్యలోనే క్లాస్‌ టీచర్‌ ఎదురయ్యి చెప్పారు చాలా కోపంగా.. హెడ్‌మాస్టర్‌ రమ్మంటున్నారని. భయం భయంగానే హెడ్‌మాస్టర్‌ సుధాకర్‌ సార్‌ దగ్గరికి వెళ్లింది రాజేశ్వరి. ఏం జరిగిందో చెప్పకుండా చెడామడా తిట్టారాయన. ‘‘ఎందుకొస్తారు బడికి? ఏ ఇంట్లోనో నాలుగు అంట్లు తోముకోకుండా? ఇలా మగపిల్లల్ని చెడగొట్టడానికా? కనీసం పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులుండవు కానీ ప్రేమాదోమా అంటూ ఊరేగుతున్నారు? ఇంకెప్పుడైనా ఇలా జరిగితే ఊర్కునేది లేదు.

నీ ప్రమేయం లేకుండా వాడెవడో అలా ఎందుకు రాస్తాడు? మానేస్తే బడిమానేసెయ్‌! రేపు మీ నాన్నని తీసుకొని బడికిరా’’ కఠినంగా ఉంది హెడ్మాస్టర్‌ గొంతు! రాజేశ్వరికేం అర్థం కాలేదు. దుఃఖం పొంగుకొస్తోంటే పరుగుపరుగున క్లాసులోకి అడుగుపెట్టింది. ఇంకా సార్‌ రాలేదు. తన ప్లేస్‌లో కూర్చోగానే ఫ్రెండ్సంతా చుట్టుముట్టారు. ఏమైందంటూ. అనుకోకుండా బోర్డువైపు చూసాక కానీ అర్థం కాలేదు. ఏం జరిగిందో. చక్కగా చెక్కినట్టు ఉన్నాయి అక్షరాలు ‘ఐలవ్‌ రాజేశ్వరి’ అని! అదే ఆమె చదువుకు ఆఖరు. రాజేశ్వరిని చదువు మాన్పించి పెళ్లి చేసేసారు మేనమామకిచ్చి. ఆ తరువాత తెలిసింది.. ఆ భయంతో.. అదే స్కూల్లో చదువుతోన్న మరో ముప్ఫయ్‌ మంది అమ్మాయిలు వరుసగా మానేసారని!

‘‘ఏ లోకంలో ఉన్నవమ్మా? ఎన్ని రోజులేడుస్తవ్‌? ఎన్ని రోజులేడిసినా పోయినోడు తిరిగొస్తడా.. సక్కనైన కొడుకునిచ్చిండు. అత్తమామ ఉండనే ఉన్నరు. ఒళ్లు దాసుకోకుండా కష్టం జేసి ఇంటికి సరిపోయే నాలుగు గింజలు పండిస్తున్నవ్‌. ఆడున్నా గానీ బాయికాడ కష్టమంత నీదే గదనే పోరి. పో.. పో..’’ పక్కింటి శాంతక్క మాటలకు ఉలిక్కిపడి ఈలోకంలోకొచ్చింది రాజేశ్వరి. వ్యవసాయాన్ని ఇష్టంగా చేసినోడు తన భర్త. తిన్నడా తినలేదా? ఎవరికిదెలుసు? పొద్దున లేస్తే పొలంలనే ఉండెటోడు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, ధర బల్కక ఉన్న పొలంలనే ఉరిబెట్టుకుండు.

భర్త పోయాక చేనే తోడయ్యింది
ఒక్కసారి శాంతక్క అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే భర్త, తండ్రి, మామ మాటలు కూడా గుర్తొచ్చాయి రాజేశ్వరికి. ‘‘ఆడున్న గానీ బాయికాడి కష్టమంత నీదేగదనే’’ అన్నది శాంతక్క. అరుగుమీద కూర్చున్న మామకి చురకెయ్యాలని అన్నదో, లేక తన కష్టాన్ని చూసింది కనుకనో మాటైతే అన్నది. ఒక్కసారి తనని తేరిపార చూసుకుంది రాజేశ్వరి. మట్టిముద్దలా ఉంది. బళ్లో తనెలా ఉండేది? సీన్మాయాక్టర్లెందుకు పనికొస్తరే నీదగ్గర అనేటోళ్లు ఫ్రెండ్సంతా.

30 ఏళ్లు కూడా నిండలేదు.. ముగ్గురు బిడ్డలతో భర్తను పోగొట్టుకొని ఏకాకిగా మిగిలింది. చేలో చేసిన చాకిరికి చిక్కి శల్యమైంది. ఈ మట్టిలోనే కదా తన పధ్నాలుగో ఏటినుంచి పనిచేసింది. భర్తన్నా ఏదో ఒక రోజు ఇంట్లో ఉండేవాడు. పొలంలోకి అడుగుపెట్టకుండా ఏ రోజూ గడవలేదు. మట్టివాసన  చూడని రోజు తనకి ముద్ద దిగదు గదా! భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ అనుకునేవారు.. ఛస్తే ఈ మట్టిలోనే చావాలి. అంతేగానీ వ్యవసాయం మాత్రం మానొద్దని. కానీ అలాంటిది రాత్రి ఎంత మాటన్నాడు మామ. తాను, తన భర్త ఎంతో ప్రేమించిన ఈ భూమి తన భర్త తరువాత తనకి రాదట. ఆడదాని పేరుమీ§ð ట్ల బెడతరు పొలం అన్నడు. ఆడదాని కష్టమైతే తింటరుగానీ పొలం మాత్రం ఉండదట.

అప్పుడు చదువు.. ఇప్పుడు భూమి
ఆలోచిస్తోంటే అర్థమౌతోంది రాజేశ్వరికి. అమ్మ పేరు మీద భూమి లేదు. అత్త పేరునా లేదు. ఇప్పుడు తన పేరున కూడా ఉండదు. పొద్దున లేస్తే పొలంలో కాయకష్టం జేసే తనకి  భూమిని రాసివ్వనని కరాఖండీగా చెప్పిన మామ తన మూడేళ్ల కొడుక్కిస్తానన్నాడు.

అదికూడా వాడికి పద్ధెనిమిదేళ్లొచ్చాక! అంటే ఇంతకాలం ఒక పశువులా పొలంలో పనిచేసిన తన కష్టం ఏమయ్యింది? ఇప్పడు తనకి కాకుండా ఎప్పుడో పదిహేనేళ్ల తరువాత తనకొడుక్కి పొలం రాయడం ఏమిటి? ఆడవాళ్లకు భూములుండొద్దా? రేపు తన కొడుకు తనకి అన్నం పెట్టకపోతే... ఆ భూమి అమ్ముకుని తాగేస్తే... అప్పుడు చదువు, ఇప్పుడు భూమి ఏదీ తనకు సంబంధం లేకుండానే తనకు దూరమవుతాయి. అవి తనకెంత ప్రియమైనవైనా! ఆలోచిస్తూనే నడుస్తోంది. రాజేశ్వరికి తనకు తెలియకుండానే పొలంవైపు అడుగులు పడుతున్నాయి. బడి మాన్పించారు. పెళ్లి చేసేశారు. పొలంలోనే భర్త ఉరివేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో ఏకాకి అయింది. తన భూమికే తను కూలీగా మిగిలింది.

మళ్లీ స్త్రీల చేతికి రావాలి
ఎక్కడైనా చూడండి స్త్రీల పేరున భూమి ఉండదు. ఉండనివ్వదు ఈ పురుషాధిపత్య సమాజం. ఎవరికైనా ఉంటే అది హింసకి కారణమౌతుంది. మరీ ముఖ్యంగా ఒంటరి స్త్రీల పేరున భూమి ఉన్నచోట స్త్రీలపై దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే దానికి ఆస్తి అనే కారణం పైకి కనిపించదు. చేతబడులు చేస్తోందనో, లేకపోతే ఆమెకు మంత్రాలూ, తంత్రాలూ వచ్చనో, అదీ కాకపోతే ఇంకేదో కారణం చూపుతారు తప్ప ఆస్తి కారణంగా దాడి జరిగిన గుర్తులు బయటకు పొక్కనివ్వరు.

అందుకే  సంపదపై పురుషుడి పెత్తనం మాత్రమే ఉండాలి అనే ఆధిపత్య భావజాలాన్ని అంతమొందించాలి. ఉత్పత్తి సాధనాలపై పురుషులు ఆధిపత్యం సంపాదించిన నాటినుంచే స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా తయారయ్యారు. అవి మళ్లీ తిరిగి స్త్రీల చేతికి వస్తేనే స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసల నుంచీ వారికి విముక్తి లభిస్తుంది. ఆ మార్పు రావాలి. అది ప్రభుత్వాల నుంచే మొదలు కావాలి.

– ఉషా సీతాలక్ష్మి, సామాజిక కార్యకర్త, రచయిత

మరిన్ని వార్తలు