నవజాత శిశువుకు కామెర్లు... ఏం చేయాలి?

26 Nov, 2013 00:22 IST|Sakshi
నవజాత శిశువుకు కామెర్లు... ఏం చేయాలి?

నాకు పదిరోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. మూడు కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది. పుట్టిన మూడో రోజున పాపకు జాండిస్ కనిపించింది. అదే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. దీనికేమైనా ఆయుర్వేద మందులు అవసరమా? నాకు పాదాల మీద కొద్దిగా వాపులున్నాయి. వీటికి సరియైన సలహాలను సూచింప ప్రార్థన.
 -మీనాక్షి, బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్.

 
జాండిస్‌ను ఆయుర్వేదంలో ‘కామల’ అంటారు. వాడక భాషలో పచ్చకామెర్లు అని  అంటారు. నవజాత శిశువునకు పుట్టిన రెండో రోజుల తర్వాత వచ్చే కామలను ప్రాకృతంగానే పరిగణిస్తారు. కాలేయం క్రియాసామర్థ్యం పరిపక్వతకు చేరుకునే సమయంలో శిశువు బాహ్యవాతావరణానికి సర్దుబాటు కావలసిన పరిస్థితిలో కనిపించే తాత్కాలికమైన మార్పు మాత్రమే ఈ కామల. ఒకటి రెండు వారాల్లో క్రమేణా తగ్గిపోతుంది. ప్రత్యేకమైన మందులేమీ అవసరం లేదు.

అదేగాని పుట్టిన 48 గంటలలోపు కామల కనబడితే దాన్ని వ్యాధిగా గుర్తించి పరీక్షలు జరిపి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని జన్మగత వైకల్యాలు కారణం కావచ్చు. ఉదాహరణకు, కాలేయం నుంచి ‘బైలురుబిన్’ బయటకు వచ్చే నాళం మూసుకుని ఉండటం లేదా అధికస్థాయిలో ఎర్రరక్తకణాల విధ్వంసం మొదలైనవి. కాబట్టి మీరేమీ గాబరా పడవద్దు. శిశువునకు మీ పాలను తాపిస్తూ ఉండటం, సాధారణంగా చేసే శిశురక్షణ ప్రక్రియలను పాటిస్తే సరిపోతుంది. ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీబిడ్డలకు ఇన్ఫెక్షన్‌లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, ధాత్రి (నర్సు) తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి.
 
 సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠోర పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మొదలైనవి మంచివి కావు. తాజాగా వండిన వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీ నీళ్లు, ఆవు మజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, తగురీతిలో తినడం మంచిది.
 
 అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి.
     
 పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1
      
 బాలింత కాఢ నెం. 1 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత...   
     
 బాలింత కాఢ నెం. 2 (ద్రావకం) : ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి.
 
 శిశువునకు :
అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో).
     
 వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదునిమిషాలు ఉంచితే మంచిది.
 
 ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి.
 
 గమనిక : శిశువుతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా సున్నితంగా, నాజూకుగా వ్యవహరించాలని ఆయుర్వేద ప్రాచీన శిశువైద్యనిపుణుడు ‘కశ్యపుడు’ స్పష్టీకరించాడు. కొంతమంది మంత్రసానులు, నాటువైద్యులు, శిశువుల కాళ్ళు, చేతులు అతిగా వంకరలు తిప్పుతూ వ్యాయామాలు చేయిస్తుంటారు. అది ప్రమాదకరమని గుర్తుంచుకోండి. అలాంటివి చేయించి శిశువును క్షోభకు గురిచేయవద్దు.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు