జాతిపితా... నన్ను దీవించండి

22 Jan, 2018 00:53 IST|Sakshi

‘ఎవరిది వాళ్లకుంటుంది’.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని డైలాగ్‌ ఇది. ఎవరిది వాళ్లకు ఉన్నప్పుడు అడాల్ఫ్‌ హిట్లర్‌కి, నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌కి ఇంకెంతుండాలి? హిట్లర్‌ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్‌ లైన్స్‌ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్‌ తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించినవాడు నేతాజీ.

అలాంటి వాడు జర్మనీతో టై–అప్‌ అయి, బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్‌ వేసుకుని హిట్లర్‌ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చుకోవడం’ అనే డీల్‌ కోసం వెళ్లాడు. హిట్లర్‌ కూడా బ్రిటన్‌పై పోరాడుతున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్‌కు, హిట్లర్‌ సైన్యం నేతాజీకి హెల్ప్‌ చేస్తుంది. అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్‌ లాజిక్‌తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు. ఎవరిది వాళ్లకు ఉంటుంది.. అనుకుని వెళ్లాడు.

హిట్లర్‌ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్‌ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్‌ లోపల ఇంపార్టెంట్‌ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్‌ అంటే లీడర్‌ అని.నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్‌ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్‌! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్‌ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్‌ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది.

తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్‌. నేతాజీ పట్టించుకోలేదు. పేపర్‌ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్‌.. నేతాజీ వెనక్కు Ðð ళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్‌!’’ అన్నాడు. హిట్లర్‌ నవ్వాడు. ‘‘హిట్లర్‌నని నువ్వెలా చెప్పగలవ్‌?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్‌ చంద్రబోస్‌ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. అంతేగా. ఎవరిది వాళ్లకుంటుంది. హిట్లర్‌కి చాలామంది డూప్‌లు ఉండేవాళ్లు. డూప్‌లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ.

ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్‌ హింద్‌’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు. (రేపు.. జనవరి 23.. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జయంతి).

– మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు