అనారోగ్యాలను దూరం చేసే నేతి బీరకాయ

16 Nov, 2019 03:14 IST|Sakshi

ఆయుర్వేదం

ఏ రకమైన ఔషధ విలువలు లేని ద్రవ్యం (పదార్థం) ఈ జగత్తులో లేదని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. అదే విషయాన్ని పరిశోధనాత్మకంగా నిర్ధారించింది. అందుకు ఉదాహరణ నేతి బీరకాయ. శాకాహారంలో మనం నిత్యం తినే బీరకాయ అందరికీ తెలిసిందే. దీనినే రాజకోశాతకీ ( (luffa accutangula, లప్ఫా ఎక్యూటాంగిలా) అని భావమిశ్రుడు అభివర్ణించాడు. అంతేకాకుండా మహాకోశాతకీ అని ఇంకొక రకం కూడా చెప్పాడు. ఇదే నేతి బీర (లప్ఫాసిలిండ్రికా/ఎజిప్టియాకా). దీనినే చరకుడు ఘృతకోశాతకీ అని వివరించాడు. ‘హస్తి ఘోషా, హస్తి పర్ణ, హస్తి కోశాతకీ, మహాఫలా అని నేతిబీరకు పర్యాయపదాలు ఉన్నాయి.

గుణాలు:
‘మహాకోశాతకీ స్నిగ్థా రక్తపిత్తానిలాపహా’ ఇది మెత్తగా, జిగురు కలిగి మృదువుగా ఉంటుంది (స్నిగ్ధ). అంటే నెయ్యి వలె చిక్కగా ఉంటుంది. అందుకే దీనికి నేతిబీర అని పేరు వచ్చింది. ఇది రక్తదోషాలను, పిత్తవికారాలనూ, వాత వ్యాధులనూ పోగొడుతుంది. అంటే అనేక చర్మరోగాలలోనూ, అధిక రక్త పీడనం (హై బీపీ), హృద్రోగాలలోనూ, నరాలకు సంబంధించిన వ్యాధులలోనూ గుణకారి.

ఔషధ రూపాలు: పచ్చి దాని నుండి తీసిన రసం (స్వరసం), గుజ్జు (కల్కం), చూర్ణం (ఎండబెట్టి చేసిన పొడి). కాయ మాత్రమే కాకుండా, పండు (లేతదైనా, బాగా పక్వమైనదైనా) కూడా ఉపయుక్తమే. కషాయం చేసి కూడా వాడుకోవచ్చు. దీనికి గల ఇతర విలువలలో విషహరం, కృమిహరం ముఖ్యమైనవి. కొవ్వును కరిగించి శరీరపు బరువుని తగ్గిస్తుంది. పైల్స్‌ (మూలశంక) సమస్యను తొలగిస్తుంది. మధుమేహ నియంత్రణకు దోహదకారి.

ఆధునిక శాస్త్ర విశ్లేషణ...
నూరు గ్రాములకి 660 మి.గ్రా. మాంసకృత్తులు, 13. 38 కేలరీలు ఉంటాయి. శాకాహారంగా వాడుకోవచ్చు. పచ్చిగా కాని, వండుకొని కాని, పానీయంగా గాని సేవించవచ్చు. మరీ లేత కాయగా ఉన్నప్పుడు తొక్క తీయనవసరం లేదు. ముదిరితే మాత్రం తొక్క చేదుగా ఉంటుంది. అప్పుడే పండుగా మార్పు చెందిన దానిని తింటే జలుబు, ముక్కుదిబ్బడ, సైనస్‌ సమస్యలు తొలగిపోతాయి. తాజాఫలంలో లెవొనాయిడ్స్, ఓలియాలోనిక్‌ యాసిడ్, ఎస్కార్బిక్‌ యాసిడ్, కెరోటినాయిడ్సు, క్లోరోఫిల్స్‌ మొదలైనవి ఉంటాయి. వ్యాధినిరోధకశక్తిని అభివృద్ధి చేస్తుంది. ఎలర్జీలను, వాపులను, నొప్పుల్ని దూరం చేస్తుంది. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచానికి దోహదకారిౖయె సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. కంతుల్ని, సూక్ష్మ క్రిముల్ని హరిస్తుంది.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు