న్యూరాలజీ కౌన్సెలింగ్

13 Jul, 2015 23:28 IST|Sakshi
న్యూరాలజీ కౌన్సెలింగ్

మైగ్రేన్ తలనొప్పిని గుర్తించడం ఎలా?

 నా వయసు 16 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పి వస్తోంది. ఇలా వస్తోందంటే మైగ్రేన్ కావచ్చని  అంటున్నారు. మైగ్రేన్‌ను గుర్తించడం ఎలా? దీనికి చికిత్స ఏమిటి?
 - సుదీప, నెల్లూరు

 మైగ్రేన్ అనేది నరాలకు సంబంధించిన ఒక రకం తలనొప్పి జబ్బు. నొప్పి ముఖ్యంగా తలకు ఒకవైపున మొదలై, రెండోవైపునకు వ్యాపిస్తుంది. తలనొప్పితో పాటు కళ్లు తిరగడం, వాంతి వచ్చినట్లుగా ఉండటం, వెలుతురు ఉన్న వైపు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో వాంతి అయ్యాక తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మైగ్రేన్ నొప్పి నెలకో, వారానికో ఒకసారి వచ్చి ఒకటి లేదా రెండు రోజులు బాధించి తగ్గుతుంది. ఇలా పూర్తిగా తగ్గిన నొప్పి ఒక నిర్ణీత సమయానికే తిరిగిరావడం దీని ప్రత్యేకత. దీనిని తెలుగులో పార్శ్వపు తలనొప్పి లేదా ఒంటి చెంపపోటు అని పిలుస్తారు.

 తలలోని రక్తనాళాలు అకస్మాత్తుగా సంకోచించి, వెంటనే వ్యాకోచించడం వల్ల అధిక రక్తప్రవాహం జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఉపవాసం ఉండటం వల్ల ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు నాలుగురెట్లు అధికంగా ఈ వ్యాధిబారిన పడతారు. వ్యాధి లక్షణాల తీవ్రతలో వ్యక్తి వ్యక్తికీ వ్యత్యాసం ఉంటుంది. సాధారణ స్థాయి నొప్పి ఉంటూ, రోజువారీ పనులకు ఇబ్బంది లేకపోతే అసలు ఈ వ్యాధికి మందులే వాడాల్సిన అవసరమే లేదు. కానీ తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నెలల నుంచి ఏడాది పాటు మందులు వాడితే నొప్పి తగ్గిపోతుంది. చాలామందిలో 40 నుంచి 50 ఏళ్ల వయసు తర్వాత మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోతుంది. మైగ్రేన్ అనేది చాలా సాధారణమైన జబ్బు. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగినంత నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం వంటి  జీవనశైలిలో మార్పులతో దీన్ని నివారించుకోవచ్చు. ఇదేమీ ప్రమాదకరమైనది కాదు కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 

మరిన్ని వార్తలు