తలనొప్పి తగ్గేదెలా..?

26 Apr, 2016 22:54 IST|Sakshi

న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 23 ఏళ్లు. నేను గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించడం లేదు. తలనొప్పితోబాటు వాంతులు కూడా అవుతున్నాయి. ఏ చిన్న శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మగారికి కూడా ఇలాగే తలనొప్పి వస్తుండేది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి.            
-హారిక, వరంగల్

 
మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా యుక్తవయస్కులలో ఎక్కువగా వస్తుంటుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఉన్నవారు వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. ఈ వ్యాధి ఉన్నవారు టీవీ ఎక్కువ చూడటం, బాగా ఎండలోగానీ / చలిలోగాని బయటకు వెళ్లడం చేయకూడదు.

పని ఒత్తిడి ఎక్కువైనా ఈ తలనొప్పి రావచ్చు. సరైన పొజిషన్‌లో కూర్చొని పనిచేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా దీన్ని అదుపు చేయవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని మందులు వాడటం వల్ల జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి
 
నాకు 26 ఏళ్లు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా ఉంటుంది. పరిష్కారం చెప్పండి.                               - తుషార్, హైదరాబాద్
 
మీరు చెప్పినదాన్ని బట్టి మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువైనా, మానవ సంబంధాలలో మార్పుల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒత్తిడి తగ్గించే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటి ద్వారా  కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే మీ  తలనొప్పికి ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్‌కు చూపించండి.

- డా.మురళీధర్ రెడ్డి
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్,హైదరాబాద్

మరిన్ని వార్తలు