నీటి కాలుష్యానికి  కొత్త విరుగుడు! 

26 Sep, 2018 01:16 IST|Sakshi

నీటికాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఇనుముకు కొన్ని ఇతర లోహాలను మిశ్రమం చేసి ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసిన లోహపు పట్టీలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నీటిలో కలిసిన రంగులు, భారలోహాలను తొలగిస్తాయని వీరు అంటున్నారు. వస్త్ర పరిశ్రమతోపాటు గనుల ద్వారా కూడా భారీ ఎత్తున భారలోహాలు, రంగులు నీటిలో కలుస్తున్న విషయం తెలిసిందే. వీటిని తొలగించేందుకు ఇప్పటికే కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ఎడిత్‌ కోవన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మెటాలిక్‌ గ్లాసెస్‌ తయారీకి ఉపయోగించే పద్ధతితో లోహపు పట్టీలను తయారు చేశారు.

ఈ పట్టీల్లోని పరమాణువులు అన్నీ ఒక క్రమపద్ధతిలో అమరి ఉండటం వల్ల వీటిమధ్య ఎలక్ట్రాన్ల ఆదాన ప్రదానాలు సులువుగా జరిగిపోతాయని.. ఫలితంగా ఇవి కాలుష్యాలను నేరుగా ఆకర్షించగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లైచాంగ్‌ ఝాంగ్‌ అంటున్నారు. టన్ను నీటిలోని కాలుష్యాలను తొలగించేందుకు కేవలం 700 రూపాయల విలువ చేసే పట్టీలు సరిపోతాయని.. ఒక పట్టీని కనీసం ఐదుసార్లు వాడుకునే అవకాశం ఉందని వివరించారు. కేవలం మంచినీరు, కార్బన్‌డయాక్సైడ్‌లు మినహా మిగిలిన ఏకాలుష్యం కూడా ఈ పద్ధతి ద్వారా వెలువడదని చెప్పారు.  

మరిన్ని వార్తలు