కొత్త పుస్తకాలు

11 Jan, 2016 03:20 IST|Sakshi
కొత్త పుస్తకాలు

మట్టిమనసు
తన కథలకు బహుమతులు కూడా అందుకున్న రామదుర్గం, వృత్తిరీత్యా పాత్రికేయుడు. భాష మీద మక్కువ గలవాడు. పదేళ్ల పైచిలుకు కాలంలో రాసిన 18 కథల్ని సంకలనంగా తెచ్చారు. ‘జీవితమే ముడిపదార్థం’గా ‘మంచి యన్నది పెంచడానికి’ రాసిన కథలివి. ఇందులో వెల్లడయ్యే స్త్రీ సాధికారత, సీమ రైతుల కష్టాలు రచయిత దృక్పథాన్ని పట్టిస్తాయి. పాత్రోచిత రాయలసీమ మాండలికం అదనపు అందం.
రచన: రామదుర్గం మధుసూదనరావు; పేజీలు: 176; వెల: 120; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, ఆర్.జయలక్ష్మి, ప్లాట్ నం. 304, కౌస్తుభ టవర్స్, మోహన్‌నగర్, కొత్తపేట, హైదరాబాద్-36; ఫోన్: 9912199557

రెండు దోసిళ్ళ కాలం
కవి: (శ్రీరామోజు) హరగోపాల్; పేజీలు: 168; వెల: 100; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. కవి ఫోన్: 9949498698
ఇది హరగోపాల్ మూడో కవితాసంపుటి. ‘ఒక వస్తువుని కవిత చేసేటప్పుడు- హరగోపాల్ పద్ధతి వేరు. తనది మనమీద ఇంపోజ్ చేయడు. ఆత్మగతం. స్వగతంగా మాట్లాడుకుంటూ కవితా నిర్మాణం జరుగుతుంది’. ‘చాల మామూలు ఘటనల గురించే, చాల మామూలు పదచిత్రాలతోనే చెపుతున్నప్పటికీ, అంతర్గతంగా దాగిన ప్రగాఢమైన, సాంద్రమైన తాత్విక దృక్పథం’ ఆలోచనలు రగిలిస్తుంది.
 
శబ్దభేది
కవి: ఎమ్మెస్ సూర్యనారాయణ; పేజీలు: 184; వెల: 100; ప్రతులకు: ఎం.రత్నమాల, ఆదిత్య కుటీర్, పొదలాడ - 533242, రాజోలు, తూర్పు గోదావరి; ఫోన్: 08862-220408
 ఐదు కవిత్వ, మూడు కథా సంపుటాల ఎమ్మెస్ తాజా సంపుటి ఇది. కాలాన్ని తవ్వుతూ రాత్రుళ్లుగా, పగళ్లుగా... దాచిపెట్టిన కలల్ని ధారపోస్తున్నాడు. కాఫ్కా మూలుగుల్నీ, కోకిలని పొదిగిన హృదయాన్నీ వినిపిస్తున్నాడు. ‘తాత్వికునితో సర్దుబాటంటే/ తనలాగా తర్జుమా కావడం/ మన లోపల/ తామరాకు పుట్టడం’ అని ప్రేమగా హెచ్చరిస్తున్నాడు.
 
అలౌకికం
లలితానంద్ కవిత; పేజీలు: 304; వెల: 200; ప్రతులకు: బి.లలితానంద ప్రసాద్, 12-24, ‘సృజన’ రాధశాల వీధి, దుగ్గిరాల- 522330; ఫోన్: 08644-277559
‘హృదయ మూలంలో జీవం పోసుకుని, మేధో మథనంతో రాటు తేలి అక్షర చిత్రాలుగా రూపు దిద్దుకున్న కవితలివన్నీ’. ‘భూమి పొరల మాటున లోతుగా చెలమ త్రవ్వి అందుకోవలసిన కవితా గంగ ఇది. మనసు పెట్టి ఆ గంగను చేదుకోవాలేకాని, ఆ తర్వాత మనకు అందేదంతా అపురూపమైన భావ సంచయమే’.

>
మరిన్ని వార్తలు