న్యూ బ్రాండ్ ఇంగ్లండ్

17 Apr, 2016 23:28 IST|Sakshi
న్యూ బ్రాండ్ ఇంగ్లండ్

తొలిసారిగా కేట్ మిడిల్టన్‌ను చూసిన క్వీన్ ఎలిజబెత్ తన ప్రజల మనసును దోచుకోగలిగిన అమ్మాయే అని మురిసిపోయారు. అది నిజమైంది. తన స్వర్గీయ అత్తగారు లేడీ డయానాలా ఒక్క బ్రిటన్ ప్రజల మనసులనే కాదు, యావత్ ప్రపంచ దృష్టినీ తనదైన స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఆకర్షిస్తున్నారు కేట్.

 

కేట్ మిడిల్టన్ (34), ఇంగ్లండ్ యువరాణి
పూర్తి పేరు      :      కేథరీన్ ఎలిజబెత్ మిడిల్టన్
జన్మదినం       :      9 జనవరి 1982
భర్త                 :      {పిన్స్ విలియమ్
తల్లిదండ్రులు   :      మైఖేల్, కరోల్
పెళ్లి రోజు         :      29 ఏప్రిల్ 2011
సంతానం       :     కొడుకు జార్జి, కూతురు చార్లెట్


అట్లతద్ది ఆడుకుంటూ అవేవో పాటలు పాడుకునే అల్లరి మల్లి కోసం రాణివాసం పల్లకీ వచ్చి నిలుచుంది.  ఆమెను అంతఃపురంలోకి తీసుకెళ్లింది. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. అడుగడుగునా ఆంక్షలు.  నిషేధాలు.... మల్లికి క్షణం యుగమైంది. బతుకు బందీఖానా అయింది. ఇది మల్లీశ్వరి కథ!


ఇంకో మల్లీశ్వరి కథ! కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఒక బెర్క్‌షైర్. బెర్క్‌షైర్‌లో న్యూబరీ. న్యూబరీ పక్కన చాపెల్ రో అనే చిన్న ఊరు. అక్కడ కేట్ మిడిల్టన్ అనే  అమ్మాయి. 2011లో ఆమె కూడా రాయల్ బగ్గీని ఎక్కింది. రాచభవంతిలోకి వెళ్లింది. కానీ ఆమె బతుకు బందీఖానా కాలేదు. ఆమె రాచకుటుంబానికి, రాచభవంతికే కాదు. ఏకంగా ఆధునిక బ్రిటన్‌కే అసలైన బ్రాండ్‌గా మారింది.


ఆమె మార్క్ స్పెన్సర్ షూస్ వేసుకుంటే దుకాణాల్లోంచి ఆ కంపెనీ షూలు నిమిషాల్లో అందరూ కొనేశారు. ఆమె జె బ్రాండ్ జీన్లు వేసుకుంటే ఆ జీన్ల ధర అమాంతం ఆకాశాన్నంటింది. అలెగ్జ్జాండర్ మెక్వీన్ తయారుచేసిన వెడ్డింగ్ గౌన్ వేసుకుంటే ఆ డిజైనర్ అమ్మకాలు 72 శాతం పెరిగిపోయాయి. ఆమె చెప్పుల నుంచి వ్యానిటీ బ్యాగ్ దాకా, చెవి రింగుల నుంచి చేతి గడియారం దాకా అన్నీ స్టైల్ స్టేట్‌మెంట్లయి పోయాయి. అప్పుడెప్పుడో లేడీ డయానా యుగంలో అంతరించి పోయిన బ్రాండ్ బ్రిటన్ మళ్లీ నిద్ర లేచింది. ఆమే డచ్చెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్, డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రిన్స్ విలియమ్స్ భార్య క్యాథరీన్ ఎలిజబెత్ మిడిల్టన్. పొడిగా చెప్పాలంటే బ్రిటిష్ యువరాణి కేట్ మిడిల్టన్.

 
బ్రిటిష్ రాచరికానిది అదో రకమైన అందం. ఎందుకో తెలియదు గానీ ప్రపంచాన్ని అది అబ్బురపరుస్తూనే ఉంటుంది. విక్టోరియా మనల్ని పాలించిన రోజుల్లో మనవాళ్లు ఆమెను మన మహారాణిగానే భావించి వికటేశ్వరీ దేవి అన్నారు. ఝాన్సీకి చెందిన అబ్దుల్ కరీం అనే వంటవాడు బ్రిటిష్ రాణి విక్టోరియా హృదయాన్ని దోచేసుకుంటే, ఆమె ప్రేమాతిరేకంలో అతనికి లవ్ లెటర్లు రాస్తే మనం మురిసిపోయాం. ఎలిజబెత్ రాణి పెద్దరికం, గాంభీర్యం ప్రపంచంలో బ్రిటిష్ పాలనకు, ఇంగ్లీష్ సంస్కృతికి అద్దం పట్టాయి. లేడీ డయానా కూడా బ్రిటన్‌కి ఒక బ్రాండింగ్ ఇచ్చింది. బ్రిటిష్ రాచమహిళ డయానా ఈజిప్షియన్ లవర్ డోడీ అల్ ఫాయెద్‌తో జర్మన్ కారులో ఫ్రెంచ్ రాజధాని పారిస్ సబ్ వేలో యాక్సిడెంట్‌కి గురై చనిపోతే ఫోటో తీసిన ఇటాలియన్ పాపరాజ్జీని ప్రపంచం శాపనార్థాలు పెట్టింది. కన్నీరు పెట్టుకుంది. రాచరికం ముసలిదైపోయి, స్కాటిష్, ఐరిష్ వేర్పాటువాదంతో బలహీనపడిపోయి, అమెరికా తోకగా బ్రిటన్ మిగిలిపోయిన ఈ సమయంలో బ్రిటన్‌ను మళ్లీ ఒక ఫ్యాషనల్ బ్రాండ్‌గా చేసే శక్తి మళ్లీ ఒక్క యువరాణి కేట్ మిడిల్టన్‌కే ఉంది. అందుకే కేట్ ఒక హాట్ బ్రాండ్.

 
కేట్, ఆమె భర్త ప్రిన్స్ విలియమ్స్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కెమెరాలన్నీ కేట్ పైనే. ముంబాయి తాజ్‌హోటల్ దాడిలో చనిపోయిన వారికి పుష్పాంజలి ఘటించేటప్పుడు అలెగ్జాండర్ మెక్వీన్ రూపొందించిన పెప్లమ్ డీటెయిల్స్ ఉన్న రెడ్ డ్రెస్  వేసుకుంది. ముంబాయి మురికివాడల పిల్లలతో రివర్స్ లగాన్ క్రికెట్టాట ఆడినప్పుడు అనితా డోంగ్రే తయారు చేసిన ప్రింటెడ్ డ్రస్ వేసుకుంది. బాలీవుడ్ బాద్షా, బేగంలతో డిన్నర్ చేసినప్పుడు జెన్నీ పాక్ హామ్ గౌన్ వేసుకుంది. మరుసటి రోజు వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామిక వేత్తలను కలిసినప్పుడు ఆమె ఎమీలియా విక్ స్టెడ్ వూల్ కీప్ డ్రస్సు వేసుకున్నారు. అయితే వీటన్నిటికన్నా ఆమె ఆధునిక బ్రిటన్ గ్లోబల్ ఎంబాసిడర్‌లా నిలిచిందన్నదే అసలు విషయం.

 
నిజానికి అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో హార్డ్ పవర్ కన్నా సాఫ్ట్ పవర్‌దే పైచేయి. అందుకే ఒబామాతో పాటు మిషెల్ ఒబామా వెంట రావాల్సిందే. కార్లా బ్రూనీ లేని సర్కోజీని ఊహించుకోలేం. కేట్ మిడిల్టన్ అత్తగా లేడీ డయానా భారత్‌కి వచ్చినప్పుడు తాజ్‌మహల్ ముందున్న మార్బుల్ బెంచ్‌పై ఒకరే కూర్చుని ఫోటో దిగారు. ప్రిన్స్ ఛార్ల్స్ వెంట లేరు. రాచదంపతుల మధ్య అగాధం ఎంతుందో ఆ ఒక్క ఫోటోనే చెప్పింది. ఆ తరువాతే యువరాజు చార్ల్స్, డయానా వేరైపోయారు. ఈ ఒక్క ఫోటో బ్రిటిష్ ఇమేజీని కేక్‌ను కత్తితో కోసేసినట్టు ముక్కముక్కలు చేసేసింది.

 
ఈ పర్యటనలో కేట్ మిడిల్టన్ సాఫ్ట్ డిప్లొమసీకి నిలువెత్తు నిదర్శనం. భర్త దోశె మిషన్‌పై చేసిన వంట ‘‘బాబోయ్... నేను తినను’’ అని చిలిపిగా తిరస్కరించినా, కళ్లకు గంత కట్టుకుని బ్రెయిల్ టైపింగ్ మెషిన్‌పై కొడుకు జార్జ్ పేరును టైప్ చేసినా, పిల్లలతో పరుగులు తీయడం వల్లే నేను లావెక్కకుండా ఉన్నాను అని నవ్వుతూ చెప్పినా ఆమె సంపూర్ణ మహిళను ఆవిష్కరించేందుకే ప్రయత్నించారు. అది ఆమె బ్రాండ్ వాల్యూను పెంచింది. కాదు కాదు.... బ్రిటన్ బ్రాండ్ వాల్యూను పెంచింది.

 

 

ఆమె ఏం వేసుకుంది?
కేట్ మిడిల్‌టన్ ఏం దుస్తులు వేసుకుంది? బ్లాక్ అండ్ వైట్ లేస్ స్కర్టు నుంచి క్రాప్ టాప్ దాకా గియాన్విటో రోసి సాండల్స్ నుంచి పోలారిస్ ఇయర్ రింగ్స్ దాకా ఆమె ధరించిన ప్రతి డ్రస్సు, ప్రతి జ్యూలరీని వివరించి, విశ్లేషించేందుకు ఏకంగా వెబ్ సైటే ఉంది. whatkatewore.com చూస్తే చాలు ఆమె డ్రస్ సెన్స్ గురించి అంతా తెలుసుకోవచ్చు.

 

ఆమె స్టయిల్ ఏమిటి?
కేట్ డ్రస్సు ఎలా ఉంది? ఆమె ఆహార్యం ఆంతర్యం ఏమిటి? బ్యాగ్స్ నుంచి వాలెట్ దాకా ఆమె చాయిస్ ఏమిటి? ఏ రోజు ఏం డ్రస్సు వేసుకుంది? దాని వెనుక ప్లానింగ్ ఏమిటి? ఫిలాసఫీ ఏమిటి? ఇవన్నీ టీకా తాత్పర్య సహితంగా చెబుతుంది http://katemiddletonstyle.org

 

ఆమె వార్డ్ రోబ్‌లో ఏముంది?
యువరాణి వార్డ్ రోబ్‌లో ఏముందో చూడాలకుంటున్నారా? అలాంటి వార్డ్ రోబ్ మీకూ కావాలని ఉందా? అని కవ్వించే వెబ్ సైట్ కేట్స్ క్లోజెట్. తమాషా ఏమిటంటే ఇది బిటిష్ సైట్ కాదు. ఆస్ట్రేలియన్ సైట్. అంటే డౌన్ అండర్ లోనూ ఆమె అందర్నీ ‘‘అందర్ కర్ దియా’’ అన్న మాట. కావాలంటే www.katescloset.com.au చూడండి.

 

అ ఆ ఇ ఈల్లో కేట్ బ్రాండ్ బిల్డింగ్
అద్భుతం... సామాన్య కుటుంబపు సిండ్రెల్లాని తెల్ల గుర్రంపై తేలాడి వచ్చే రాకుమారుడు వరించే కథ గిలిగింత, చక్కిలిగింత పెడుతుంది. కేట్ కథ ఇదే. ఆమె కథలో ఆ అద్భుతమే అసలు ఎలిమెంట్. అందుకే ఆమె అంటే అంత కుతూహలం. ఆమె కథంటే అంత ఆసక్తి.  ఆంతరంగికులు... అసలు కేట్ ఎవరో ఎవరికీ అంతుపట్టదు. కుటుంబ సభ్యులే ఆమె ఆంతరంగికులు. అనవసరంగా పెదవి విప్పదు. రాయల్ ఒత్తిడులను చిరునవ్వుల పరదాలో దాచేయగలగడం ఆమెను బ్రాండ్‌గా మార్చేసింది.

 

ఇమేజీ ... నడకే కాదు. నడత కూడా ఆమె ఒక బ్రాండ్‌గా చేసింది. పదేళ్ల పాటు ప్రిన్స్ విలియమ్‌కి కాబోయే భార్యగా కెమెరా కళ్లన్నీ ఆమెపైనే దృష్టిపెట్టాయి. 2007లో ప్రిన్స్ విలియమ్, ఆమె విడిపోయారు. కానీ మీడియా ఒళ్లంతా కళ్లుగా, నోళ్ళుగా ఎంత ప్రయత్నించినా ఆమె సంతులనం కోల్పోలేదు. చిరునవ్వు అనే చిన్న పెట్టెలో రాచకుటుంబ రహస్యాల ను దాచింది. దాంతో ఆమె బ్రాండ్ ఆకాశమంత ఎత్తెదిగింది.

 

ఈ క్షణమే జీవితం... ఘనమైన గతం ఉన్న బ్రిటిష్ రాచరికానికి ఆధునికపు అందాలు అద్దింది. చిరపురాతనాన్ని, నిత్యనూతనంతో కలిపింది ఆమె. హెయిర్ స్టయిల్ నుంచి డ్రస్ సెన్స్ దాకా, చిరునవ్వు నుంచి, నిలుచునే పద్ధతి దాకా ...  ఆమె వ్యవహారశైలే ఆమెను ఒక బ్రాండ్‌గా మలిచాయి.



 - కె. రాకా సుధాకరరావు

>
మరిన్ని వార్తలు