చెయ్‌రా ఛాలెంజ్‌

1 Jul, 2019 06:33 IST|Sakshi

ఐస్‌ని నెత్తిమీద వేసుకోగలవా? (ఐస్‌ బకెట్‌) డ్రైవ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేయగలవా? (కీకీ) నీ ఫొటో చూపించగలవా? (అప్పుడు–ఇప్పుడు) సవాల్‌ని స్వీకరిస్తాం. నెట్‌లో పెట్టేస్తాం. అయితే లైఫ్‌లో తీసుకోవలసిన చాలెంజెస్‌..వేరే ఉన్నాయని యూత్‌ అంటోంది. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వగలవా? చాలెంజ్‌! లైంగిక దాడుల్ని నిరోధించగలవా? చాలెంజ్‌! నెట్‌లో పోర్నోగ్రఫీని ఆపగలవా? చాలెంజ్‌! ఇలాంటి చాలెంజ్‌లు మొదలవ్వాలి. సమాజానికి పట్టిన చీడపీడల్ని వదిలించాలి.

జస్సికాలాల్‌.. గుర్తుండే ఉంటుంది. మోడల్‌. ఢిల్లీలో.. ఒక సోషలైట్స్‌ పార్టీలో బార్‌మెయిడ్‌గా డ్రింక్‌ సర్వ్‌ చేస్తూ టైమ్‌ అయిపోయిందని.. డ్రింక్స్‌ క్లోజ్‌ చేయసాగింది. అప్పటికి టైమ్‌ రాత్రి.. రెండు గంటలు. హర్యానా ఎంపీ (అప్పటి) వినోద్‌ శర్మ కొడుకు సిద్ధార్థ వశిష్ట్‌ ఉరఫ్‌ మనూ శర్మ వచ్చి ఒక డ్రింక్‌ ఇవ్వమని అడిగాడు ఆమెను. ‘‘సారీ.. టైమ్‌ అయిపోయింది’’ అని చాలా పొలైట్‌గా ఆన్సర్‌ చేసింది. ఆ సమాధానాన్ని లెక్క చేయకుండా డ్రింక్‌ కోసం పట్టుబట్టాడు. జెస్సికా చాలా మర్యాదగా కుదరదని చెప్పింది. అతని అహం దెబ్బతిన్నది.. తుపాకీ తీసి పేల్చాడు. ఆమె చనిపోయింది. 1999 నాటి సంగతి ఇది. మనుశర్మ కోరుకున్న మద్యం ఖరీదు.. జెస్సికా ప్రాణం!అందుకే ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ సినిమాలో జెస్సికా అక్క సబ్రీనా పాత్రధారణి అంటుంది ‘‘ఈ దేశంలో ఆడపిల్ల ప్రాణం లిక్కర్‌ కంటే చీప్‌’’ అని. ఒక్క మద్యానికే కాదు.. ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవాలనుకున్నా  చావును ఆహ్వానించాల్సిందే. కనీసం సదుపాయాలు  కావాలనుకున్నా అమ్మాయిలు తమ మానప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సిందే! దీనికి ఉదాహరణ.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో ముగ్గురు అమ్మాయిల మీద జరిగిన లైంగిక దాడి, హత్యలే! బస్సు సౌకర్యలేమికి వాళ్ల జీవితాలు బలి!

ఇలాంటివి జరిగినప్పుడే గజిని సినిమాలోని.. ‘‘ఒరేయ్‌ ఇప్పుడిప్పుడే మేం గడపదాటి బయటకు వస్తున్నాం రా.. ఇలాంటి వాటితో మళ్లీ మమ్మల్ని వంటిళ్లకే పరిమితం చేయకండిరా’’ అనే డైలాగ్‌ గుర్తొస్తుంటుంది.
అంతేనా? దేశంలో ఏ మూలన పురుషాహంకారం దాడికి తెగబడినా అమ్మాయిలు వేసుకుంటున్న ఆధునిక దుస్తులను, నడతను తప్పుబడుతున్న  ‘సంస్కృతి– సంప్రదాయం– సంస్కారం’ కాలర్‌ పుచ్చుకొని నిలదీయాలనిపిస్తుంది.. వరంగల్‌లో జరిగిన  తొమ్మిది నెలల పసిబిడ్డ రేప్, హత్య గురించి! దేశంలో మంచినీళ్లుండవ్‌.. మద్యానికి మాత్రం భరోసా! కనీస సౌకర్యాలుండవ్‌.. ఫ్రీగా వైఫై దొరుకుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్నా.. సారా దుకాణాలు ఎక్కువ. అంబులెన్స్‌ల కన్నా ఫ్రీ ఇంటర్నెట్‌ సెంటర్స్‌ అందుబాటులో ఉంటాయి.  రిటైర్డ్‌ పర్సన్స్‌ మొదలు.. ఏడో తరగతి చదివే పిల్లల దాకా.. అందరికీ పోర్న్‌ కనిపిస్తుంది. వీటన్నిటి ప్రభావం ఎవరి మీద? పిల్లల మీద.. ఆడవాళ్ల మీద! వంద శాతం అక్షరాస్యత, సెక్స్‌ ఎడ్యుకేషన్, చైతన్యం ఉన్న దేశాలే సోషల్‌ మీడియా మీద ఆంక్షలు విధించాయి. ఫిల్టర్స్‌ పెట్టాయి. అవేవీ లేని మనం మాత్రం బార్లా తలుపులు తెరిచాం. పర్యవసానాలను అనుభవిస్తున్నాం.
∙∙
‘‘వయసులో ఉన్నప్పుడూ çకుదురుగా పనిచేసి.. ఇంటి బాధ్యతలు తీసుకున్నది ఎన్నడూ లేదు. ఇప్పుడైతే పని ఊసే లేదు. తాగడం.. నన్ను ఇబ్బంది పెట్టడ్డం. ఈ మధ్య  ఫోన్‌లో ఏవేవో రోత వీడియోలు ఆయన చూడ్డమే కాక.. నాకూ చూపిస్తున్నాడు. అలా చేయమని బలవంతపెడ్తున్నాడు. చేయకపోతే కొడ్తున్నాడు మేడం’’ అంటూ తను డొమెస్టిక్‌ హెల్పర్‌గా ఉన్న యజమానికి చెప్పి ఏడ్చింది యాభై రెండేళ్ల సావిత్రి. పోర్న్‌ చూస్తున్నాడని అర్థమైంది ఆ యజమానికి. ఆ రోజే సాయంకాలం ఈ యజమానికి ఆ సర్వెంట్‌ మెయిడ్‌ ఆదరాబాదరాగా ఫోన్‌ చేసింది..‘‘మేడం.. మా ఆయన... మా పక్కింటోళ్ల పదేళ్ల పిల్ల మీద చెయ్యేశాడట మేడం. పంచాయితీ పెట్టారు వాళ్లు. మా ఆయన మీద నేనే పోలీస్‌ కంప్లయింట్‌ ఇద్దామనుకుంటున్నా. సాయం చేయండి మేడం’’ రిక్వెస్ట్‌ చేసింది ఏడుస్తూనే!

ఇంకోచోట..!
బాగా సంపన్నుల కుటుంబం. వాళ్లకు ముగ్గురు పిల్లలు. తల్లిదండ్రులిద్దరూ బిజీ. పిల్లలకు అన్ని సౌకర్యాలూ ఇచ్చారు.. స్మార్ట్‌ ఫోన్స్, ట్యాబ్స్‌ సహా. ఆఖరి పిల్లాడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాడికి వాట్సాప్‌కు రోజూ రేప్‌ వీడియోలు వస్తున్నాయి. వాటిని చూడ్డం వాడికి అలవాటుగా మారింది. ఒకరోజు స్కూల్లో మ్యాథ్స్‌ టీచర్‌ను ఎక్కడో టచ్‌ చేశాడట. పెద్ద గొడవ. హైదరాబాద్‌లోనే.. బాగా చదువుకున్న ఉమ్మడి కుటుంబంలోనే.. మంచి ఉద్యోగంలో ఉన్న నడివయసు వ్యక్తి.. తన తమ్ముడి ఏడేళ్ల కొడుకును ప్రతిరోజూ అబ్యూజ్‌ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని చూస్తూనే ఆ పిల్లాడు భయంతో వణికిపోయే పరిస్థితి. çపరేషాన్‌ అయిన తల్లి... అనునయించి అడిగితే పిల్లాడు ఆ తల్లి గుండె పగిలే నిజం చెప్పాడు.

ఒక ఊళ్లో..!
చదువుకున్న యువకుడే. పద్నాలుగేళ్ల పిల్లను వేధించడం మొదలుపెట్టాడు. పెద్దవాళ్లకు చెబితే తననే తప్పుపడ్తారేమో.. స్కూల్‌ మాన్పించి ఇంట్లో కూర్చో పెడ్తారేమోనని ఎవరికీ చెప్పకుండా మౌనంగా సహించసాగింది. ఆ వేధింపులు బ్లాక్‌మెయిల్‌గా కూడా మారేసరికి తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పైన ఉదాహరణలన్నీ వాస్తవాలే. చదువు.. చదువులేకపోవడం, ఉన్నత కుటుంబం, దిగువ తరగతి, పల్లె, పట్నం.. తేడా లేకుండా! ఒకవైపు సెక్స్‌ అనే పదాన్ని వినడం..ఉచ్ఛరించడమే పాపంగా పరిగణిస్తూ.. ఇంకోవైపు పోర్న్‌ను ఫోన్‌ దగ్గర్లో పెట్టే హిపొక్రసీ కల్చర్‌ వల్లే ఇలాంటి విపరీతాలు.. హాజీపూర్, వరంగల్‌ వంటి నేరాలు అంటున్నారు మానసిక, సామాజిక విశ్లేషకులు. ఈ ఘోరాలు జరిగినప్పుడల్లా క్యాండిల్‌లైట్‌ మార్చ్‌లు, సదస్సులు, రేపిస్ట్‌లను ఉరితీయాలనే సోషల్‌ మీడియా ప్రచారాలు సర్వసాధారణం. ఉరితో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మూలాన్ని వదిలి పైపైన పూత పూస్తే రోగం తగ్గదు. హిపోక్రసీ వదలాలి. ఆడ, మగ అనాటమీ గురించి తెలియాలి ఇద్దరికీ. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ కావాలి.

చాలెంజ్‌లు
ఐస్‌ బకెట్, కీకీ, పదేళ్ల కిందట.. ఇప్పుడు అంటూ పాత, లేటెస్ట్‌ ఫొటోల పోస్టింగ్‌ వంటి  చాలెంజ్‌లు ప్రపంచంలో ఏ కొసన స్టార్ట్‌ అయినా.. క్షణాల్లో వాటిని ఓన్‌ చేసుకొని ఎంతో భక్తితో ఆ చాలెంజెస్‌లో భాగమయ్యే సోషల్‌ మీడియా పార్టిసిపేంట్స్, ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా ట్వంటీ ఫోర్‌ ఇంటూ సెవెన్‌ పదేపదే టెలికాస్ట్‌ చేస్తూ సెన్సేషన్‌ను క్రియేట్‌ చేసే మీడియా,  స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు యూత్‌.. జెండర్‌ సెన్సిటివిటీ మీద చాలెంజ్‌ ఎందుకు స్టార్ట్‌ చేయకూడదు? ప్రతి ఇంట్లో.. ప్రతి ఆర్గనైజేషన్, ఇన్‌స్టిట్యూషన్, ప్రతి ఊరు.. ప్రతి పట్టణంలో ఆడవాళ్ల పట్ల గౌరవంగా, పిల్లల హక్కుల పట్ల ఎరుకతో ఉండే చాలెంజ్‌ను ఎందుకు స్వీకరించకూడదు? ఇలాంటి కదలిక వస్తే బాగుంటుంది కదా.. అనేది యూత్‌ అభిప్రాయం. మొక్కుబడిగా చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఇలాంటి చాలెంజెసే కరెక్ట్‌ అంటున్నారు పెద్దవాళ్లు.        

ఎమర్జెన్సీ ప్రకటించాలి
రోజురోజుకి ఈ ఘోరాలు  పెరిగిపోతున్నాయి. తొమ్మిదినెలల పాపను కూడా వదిలిపెట్టలేదంటే.. చైల్డ్‌ అండ్‌ విమెన్‌ సేఫ్టీ ఎమర్జెన్సీ ప్రకటించాలి. దీన్నొక మూవ్‌మెంట్‌గా మొదలుపెట్టాలి. అయితే ఈ చాలెంజ్‌లో ముందు గవర్నమెంట్‌నే ఇన్‌వాల్వ్‌ చేయాలి. అది లిక్కర్, పోర్న్‌ బ్యాన్‌తోనే స్టార్ట్‌ అవ్వాలి.
– సి. ప్రియాంక, ఉద్యోగిని, హైదరాబాద్‌

అనాటమీ తెలియదు
మన దగ్గర చాలా మందికి.. అంతెందుకు మా సర్కిల్లోనే చాలా మందికి బాయ్‌ అండ్‌ గర్ల్‌ అనాటమీ తెలియని వాళ్లు బోలెడు. ఇప్పుడు జరుగుతున్న చాలా రేప్‌లకు ఇదీ ఒక కారణం. అంటే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం. అఫ్‌కోర్స్‌ లిక్కర్, పోర్న్‌ నెక్స్ట్‌ ప్లేస్‌లో ఉంటాయి. అర్జెంట్‌గా జెండర్‌ సెన్సిటివిటీని చాలెంజ్‌గా స్టార్ట్‌ చేయాలి.
– ఎస్‌. కౌశిక్, స్టూడెంట్, బోధన్‌ చైల్డ్‌ అండ్‌ విమెన్‌ సేఫ్టీ ఎమర్జెన్సీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు