వెన్ను పూలు

17 Dec, 2015 22:43 IST|Sakshi
వెన్ను పూలు

అమ్మాయిల వెన్ను(బ్యాక్) డిజైనర్లకు ఓ క్యాన్వాస్‌గా మారినట్టు ఉంది. అందుకే బ్యాక్ డిజైన్స్ డ్రెస్సుల ట్రెండ్ ఇప్పుడు వరసకట్టింది. ఎన్నెన్నో పువ్వులు, లతలు.. వెన్నుపైన ఎంతో అందంగా, మరెంతో హుందాగా మెరిసిపోతున్నాయి. మొన్న మొన్నటి వరకు డిజైనర్లు చుడీదార్ నెక్ డిజైన్స్‌కి ఫ్రంట్ మీదే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు కాస్త గాలి వెనక్కి మళ్లి.. వెన్ను మీద మరింత అందంగా రూపుకడుతున్నారు.
 
బ్యాక్ డిజైన్స్ ఒక బ్లౌజ్‌లకేనా! అలా అని సరిపెట్టేసుకునే రోజలు కావివి. సాదాసీదా బ్యాక్ నెక్ డిజైన్ డ్రెస్సులు కంఫర్ట్ కోసం అయితే పర్వాలేదు. కానీ, పార్టీలో ఎదుటివారి చూపులు ఎనకే వెంబడించాలంటే మాత్రం బ్యాక్ డిజైన్ డ్రెస్సులు తప్పనిసరి.
 
లేసులు.. ప్రింట్లు..
ఇవి ఓ మోస్తారు సాదాసీదా ఎంపికయే. అయినా వెన్ను మొత్తం ఆవరించేలా డిజైన్ ఉంటే మీరే అట్రాక్టివ్. అలాంటి డిజైన్ ఉన్నవాటిని ఎంపికచేసుకోవడమే కాదు, మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు కూడా!
 
ఫ్రంట్ కన్నా మిన్నగా
కాలర్, రౌండ్, హాల్టర్.. నెక్ మోడల్స్ ఎన్ని వచ్చినా అవి డిజైన్‌తో తళుక్కుమనాల్సిందే! ఛాతిభాగం మొత్తం డిజైన్‌తో ఆకట్టుకున్నా అదేమంత స్టైల్ కాదు. అందరూ కాస్త ఎక్కువో, మరికాస్త తక్కువో ఫ్రంట్ డిజైన్ చుడీదార్ వేసుకునేవారే. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే మాత్రం బ్యాక్ డిజైన్ సృజనాత్మకంగా ఉండాలి.
 
హారాలన్నీ వెన్నుకే
మెడలో నగలు ముందున్నవారికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగని నగలు వెనకేసుకోలేరు. అందుకే డిజైనర్లు ఎంబ్రాయిడరీ హారాలను డ్రెస్ వెనకాల అందంగా అల్లేస్తున్నారు. మణిమరకతాల్లాంటి స్టోన్స్‌తో వాటిని రూపుకట్టేస్తున్నారు. ఈ హారాలను చూస్తే బంగారు హారాలు చిన్నబోయేలా ఉన్నాయి.
 
వేడుకలకే వెన్ను
క్యాజువల్ డ్రెస్సులకు వెన్నుపైన సాదాసీదా ప్రింట్లు ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. అదే పార్టీలకైతే స్వరోస్కి, జర్దోసి, కుందన్స్, చెమ్కీ.. ఇలా అన్నింటి మేలవింపు డిజైన్స్ ఇంపుగా ఉంటాయి. వయసు, ఎత్తు, లావు.. వీటిని దృష్టిలో పెట్టుకొని తమ శరీరాకృతికి తగిన బ్యాక్ డిజైన్లను ఎంచుకోవడంలో ఎవరి ఎంపిక వారిదే! నాలుగురాళ్లే కాదు నాలుగు డిఫరెంట్ బ్యాక్ డిజైన్స్ ఉన్న డ్రెస్సులను కూడా మీ వార్డ్‌రోబ్‌లో చేర్చండి. పార్టీ వేర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే ‘బ్యాక్’తో మీ వెనకే చూపులను కట్టిపడేయండి.    
 - ఎన్.ఆర్
 
 
 నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చాక బ్యాక్ కోసం ఎన్నో కొత్త డిజైన్లు పుట్టుకువచ్చాయి. వాటిలో ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఆకట్టుకుంటోంది  సన్నగా ఉన్నవారికి లాంగ్ బ్యాక్ డిజైన్స్ బాగా నప్పుతాయి  బొద్దుగా ఉన్నవారు డ్రెస్ బ్యాక్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్స్ కి వెళ్లకపోవడమే మంచిది. అలాగే ఎంబ్రాయిడరీ సింపుల్ అనిపించే డిజైన్స్‌ను ఎంచుకోవాలి  ‘ఎ’ షేప్ శరీరాకృతి గలవారు వెన్ను పై భాగాన డిజైన్ ఎక్కువ ఉండేవి, ‘స్పూన్’ షేప్ శరీరాకృతి గలవారు వెన్ను కింది భాగాన డిజైన్ ఎక్కువ ఉండేవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.
 

>
మరిన్ని వార్తలు