పొగ మాన్పించేందుకు కొత్త ఎంజైమ్‌!

24 Oct, 2018 00:29 IST|Sakshi

పొగతాగడం మానేయాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త. ఏటా 50 నుంచి 60 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ అలవాటును మాన్పించేందుకు స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పొగతాగిన వెంటనే రక్తంలోకి చేరే నికోటిన్‌ను అక్కడికక్కడే నాశనం చేయగల ఎంజైమ్‌ను వీరు అభివృద్ధి చేశారు. పొగాకు పొలం నేలలో ఉండే సూడోమోనాస్‌ పుటిడా అనే బ్యాక్టీరియా స్రవించే ఎంజైమ్‌ నిక్‌–ఏ2ను మూడేళ్ల క్రితమే స్క్రిప్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ గుర్తించింది.

అప్పటి నుంచి దీన్ని కృత్రిమంగా తయారు చేయడంతో పాటు.. నికోటిన్‌ను నాశనం చేయగల దాని శక్తిని మరింత వృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వీరు అభివృద్ధి చేసిన నిక్‌–ఏ2–జే1 ఎంజైమ్‌ను ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు అది చాలా సమర్థంగా రక్తంలోని నికోటిన్‌ మోతాదులను తగ్గించినట్లు తెలిసింది.  మెదడును చేరేలోపు రక్తంలోని నికోటిన్‌ నాశనమవుతోంది కాబట్టి పొగ తాగడం ఒక వ్యసనంగా మారదని అంచనా. ఇప్పటివరకూ ఈ ప్రయోగాలు ఎలుకలకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలను రాబట్టగలిగితే ఈ ఎంజైమ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడుతుంది.

మరిన్ని వార్తలు