వెస్టర్న్‌ వసంతం

18 May, 2017 23:21 IST|Sakshi
వెస్టర్న్‌ వసంతం

ప్రపంచం ఎటో వెళ్లిపోతోంది.మాంచి స్పీడ్‌ మీదుంది. యంగ్‌స్టర్స్‌ బిగ్‌స్టార్స్‌ అవుతున్నారు.బిగ్‌ స్టార్స్‌ సూపర్‌ స్టార్స్‌ అవుతున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఇదేకొత్త ట్రెండ్‌. ట్రెండ్‌లను తలదన్నే ట్రెండ్‌. కథ మారింది. ఫిట్‌ మారింది. ప్రింట్‌ మారింది. ఫ్యాబ్రిక్‌ మారింది.లుక్‌ మారింది. మరి మనం మారద్దూ! మనం కూడా వరల్డ్‌ ఫ్యాషన్లని మన భుజం మీద మోయద్దూ!! ఇదో... అదే ఆలోచనతో మీకు ఇవాళ సాక్షి సమర్పిస్తోంది. వస్త్రాలలో ఎన్నో పూల తోటలు. నిజంగా ఒక వెస్టర్న్‌ వసంతం.

జార్జెట్, షిఫాన్, క్రేప్‌ ఫ్యాబ్రిక్స్‌ వలీ డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. సన్నగా ఉన్న అమ్మాయిలకు వీటితో డిజైన్‌ చేయించాలంటే మరింత సన్నగా కనపడతారని అపోహపడతారు. వలీ డిజైన్స్‌ చూస్తే చిన్న చిన్న మార్పులతో, సరైన కట్, ఫిట్‌తో అందంగా కనిపించేలా డిజైన్‌ చేయవచ్చు. చేతులు, నడుము, నెక్‌లైన్‌ వద్ద కొద్దిపాటి కుచ్చులను జత చేస్తే మార్పులో స్పష్టత సులువుగా అర్థమైపోతుంది.

బొద్దుగా లేదా పొడవు తక్కువగా ఉన్నవాళ్లకు షార్ట్‌లెంగ్త్‌ డిజైన్స్‌ ఎలా నప్పుతాయో వలీ డిజైన్స్‌ చూసి తెలుసుకోవచ్చు. ఇలాంటి వారికి కొద్దిగా ముదురు రంగులు, చిన్న చిన్న ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి.

రాసిల్క్‌ మెటీరియల్‌తో డిజైన్‌ చేసిన క్రీమ్‌ కలర్‌ షార్ట్‌ ఫ్రాక్‌. దాని మీద ఎర్రని పువ్వుల ఎంబ్రాయిడరీ ఆకర్షణీయతను పెంచుతుంది. ఇదే తరహా కాంబినేషన్‌లో ఇతర డ్రెస్‌ డిజైన్స్‌నూ మార్చుకోవచ్చు.


జియామ్‌బటిస్టా వలి ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. రోమ్‌లో పుట్టి, అక్కడే బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ పరిశ్రమ అతనిలో సృజనను తట్టిలేపింది. లండన్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాడు. అక్కడ వేలాది మంది ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కోర్సు చేస్తున్నారు. అప్పటికే ఎంతో మంది ఫ్యాషన్‌ డిజైనర్లు ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. వారి మధ్య తను ఎలా నెగ్గుకు రాగలను అని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు అతనికి చిత్రకళ సమాధానమిచ్చింది. దానిని ఆపోసన పట్టాడు. చిత్రకళను డ్రెస్‌ డిజైన్స్‌ మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఇతని సృజనను మెచ్చి ప్రముఖ కంపెనీలు ఎర్రతివాచీని పరిచాయి. పీటర్‌ ఎ పోర్టర్‌ వంటి కంపెనీలకు క్రియేటివ్‌ డిజైనర్‌గా ఉండి తర్వాత తనే సొంతంగా స్టోర్‌ ప్రారంభించాడు. ఇప్పుడు 41 దేశాల్లో 245 సెల్లింగ్‌ పాయింట్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్త మార్కెట్‌ ఉంది వలీకి. తలలు పండిన డిజైనర్లు సైతం తమ ప్రతిభను కనబరిచేందుకు ఎదురుచూసే ప్యారిస్‌ ఫ్యాషన్‌ షోలో వరుసగా నాలుగు సార్లు పాల్గొనే అవకాశం దక్కింది వలీకి.
 
పువ్వుల సోగయం సిసలైన స్టైల్‌
శరీరాన్ని హత్తుకుపోయినట్టుండే ప్యానెల్స్, రంగులు, పువ్వుల ప్రింట్లతో ప్రతి యేటా ఓ కొత్తదనం వలీ డిజైన్స్‌లో కనిపిస్తుంది. రాచఠీవితో వెలిగిపోయే డ్రెస్‌ డిజైనింగ్, నాటకీయతను రూపుకట్టే కేప్స్, పోల్కాడాట్స్‌.. వలీ డిజైన్స్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పూసలతో చేసిన ఎంబ్రాయిడరీ, బో కాలర్స్, అసెమెట్రికల్‌ డ్రేపింగ్, విశాలంగా కనిపించే పెప్‌లమ్స్‌ ఇట్టే ఆకట్టుకుంటాయి. కాంతిమంతమైన ఎరుపు, నీలం, పసుపులలోనే ఎన్నో షేడ్స్‌ని సృష్టించి వాటితోనే అద్భుతమైన డిజైన్స్‌ తయారుచేస్తాడు వలీ.

నీ లెంగ్త్‌ మిడ్‌ ఫ్రాక్‌  ఇది. ప్రొఫెషనల్‌గా రాణించాలనుకునే ఆధునిక యువతులకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చే డెస్‌ స్టైల్‌ ఇది.
నెక్‌ కాలర్, స్ట్రెయిట్‌ కట్‌తో సాదా సీదాగా అనిపించే ఈ స్టైల్‌ని సన్నని బెల్ట్‌ను జత చేసి పూర్తి లుక్‌ మార్చేశారు.

నడిచి వచ్చే పువ్వుల దండులా మేనిపై విరుల సోయగం ప్రత్యేకతను చాటుతుంది. దానికి ఫెదర్‌ని జత చేస్తే రాయంచ కొత్త రెక్కలు తొడుక్కున్నట్టే! టాప్‌ టు బాటమ్‌ ఒకే ప్రింట్‌ ఫ్యాబ్రిక్‌ వాడినా అందులోని ప్రధాన రంగును ఫెదర్‌ లేదా దుపట్టా లాంటివి ధరించడానికి ఎంపిక చేసుకోవచ్చు.

 జియామ్‌బటిస్టా వలి

మరిన్ని వార్తలు