ప్యాచ్‌ మంత్ర

23 Mar, 2018 00:19 IST|Sakshi

ఫ్యాషన్‌

అందం అతికినట్టుండాలి. అతికించడం కూడా ఇప్పుడో అందం.మ్యాచ్‌ అయ్యేలా ప్యాచ్‌ వేస్తే కన్ను చటుక్కున క్యాచ్‌ చేస్తుంది. అవును... కన్ను అతుక్కుపోతుంది. అది కూడా మంత్రం వేసినట్టుగా!మీరూ ప్యాచ్‌ ఫ్యాషన్‌నుటచ్‌ చేయండి.  ప్యాచ్‌తో మంత్రముగ్ధులను చేయండి.

సమ్మర్‌ ప్యాచ్‌
వేసవిలో కాటన్‌ దుస్తులకే అధిక ప్రాధాన్యత. అవి చీరలైనా, డ్రెస్సులైనా. ప్లెయిన్‌గా ఉంటే కళ్లకు, ఒంటికి మరింత హాయి. అయితే, మరీ సాదాసీదాగా ఉండటం అలంకరణకు అన్నివేళలా నప్పని విషయం. అందుకని ‘ప్యాచ్‌’తో దుస్తులకు ముచ్చటైన కళను జతచేయడానికి సిద్ధమవుతున్నారు డిజైనర్లు.

మనవైన చేనేతలు
నేత చీరలు వేసవిలో చమటను పీల్చుకుంటాయి కాబట్టి మేనికి హాయినిస్తాయి. వీటికి కొత్త హంగులు అద్దాలంటే కలంకారీ ఫ్యాబ్రిక్‌ ప్యాచ్‌లతో పాటు ఇతర రంగు రంగుల కాటన్‌ ఫ్యాబ్రిక్‌తోనూ డిజైన్‌గా రూపొందించుకోవచ్చు.

కేరళ కసవు
బంగారు రంగు అంచుతో అచ్చమైన హ్యాండ్లూమ్‌గా వన్నెలుపోయే కేరళ కసవు చీర ఎండ వేడిని నిరోధిస్తుంది. పాలమీగడలా ఉండే ఈ రంగు చీరల మీద పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ ఫ్యాబ్రిక్‌ డిజైన్‌ని ప్యాచ్‌గా వేస్తే చాలు ఇలా అందమైన హొయలు పోవడానికి సిద్ధమైపోతాయి. సింపుల్‌గానూ ఉంటాయి. వేడుకలకు ప్రత్యేక కళను తీసుకువస్తాయి.

డిజైనర్‌ దుస్తులు
టస్సర్, మల్‌మల్, కోరా, ఖాదీ.. వంటి చేనేతలను లాంగ్, అనార్కలీ గౌన్లు, లెహంగాలుగా రూపొందించుకోవచ్చు. వాటికి మరో కలర్‌ లేదా థ్రెడ్‌ ఎంబ్రాయిడరీ చేసిన అంచును జత చేస్తే సంప్రదాయ వేడుకలకే కాదు ఇండో వెస్ట్రన్‌ పార్టీలకూ అచ్చమైన డిజైనరీ డ్రెస్సులుగా వెలిగిపోతాయి. 

తక్కువ ధరకే ఎక్కువ హంగులు
పూర్తి కాంట్రాస్ట్‌ ఫ్యాబ్రిక్‌పై పెయింట్‌ లేదా ఎంబ్రాయిడరీ చేసి ఎవరికి వారు ప్యాచ్‌లను సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే రెడీమేడ్‌గానూ ప్యాచ్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఒక్కో డిజైన్‌ ప్యాచ్‌ రూ.20 నుంచి వందల రూపాయల్లో లభ్యమవుతున్నాయి. రూ.400–500 ఖర్చుపెడితే ఆకర్షణీయమైన శారీని ఎవరికి వారు డిజైన్‌ చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు