పిజ్జ పిజ్జాగా నచ్చుతాయి

25 May, 2017 22:55 IST|Sakshi
పిజ్జ పిజ్జాగా నచ్చుతాయి

ఫ్యాషన్‌ ఫ్యూజన్‌
ప్రపంచ ఫ్యాషన్‌ పరిచయం


పిజ్జా పుట్టిన చోట పుట్టిన స్టయిల్‌ ఇది. పిజ్జాని ఇష్టంగా ఓ పట్టు పట్టినట్టే అర్మానీని ఒక చుట్టు చుట్టాలి. ప్రపంచానికి ఇటాలియన్‌ డ్రెస్‌ కావరాన్ని క్రియేటివ్‌గా కట్టి చూపిన జార్జియో అర్మానీ స్టైల్‌ మనమూ ఓ చుట్టు చుడితే .. ఓ కట్టు కడితే..! పిజ్జ పిజ్జాగా నచ్చుద్ది.

ఒకప్పుడు మగవారి డ్రెస్సుల్లో ఉండే స్ట్రెయిట్‌ కట్‌ మగువల డ్రెస్‌ డిజైన్స్‌కీ మార్చి ‘ఔరా!’ అనిపించాడు. ఫ్యాషన్‌ ప్రపంచం అబ్బురపడేలా అతివల దుస్తులను అందంగా రూపుకట్టాడు. ‘ఎవరే అతగాడు..’ అంటూ ఫ్యాషన్‌ ప్రియులు పాటలు పాడుకునే అతని పేరు జార్జియో అర్మానీ! ‘క్లాత్‌ ఒంటికి చుట్టుకున్నట్టు కాదు ప్రేమగా హత్తుకున్నట్టు’ ఉండాలి అంటాడు ఈ ఇటాలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌.

డ్రెస్‌ డిజైన్స్‌లో భారతీయత
మగవారి దుస్తులలో టాప్‌ అనిపించుకున్న అర్మానీ పదిహేనేళ్ల క్రితం మహిళల దుస్తులనూ తన లేబుల్‌ ద్వారా పరిచయం చేశాడు. మగవారి దుస్తుల్లోని స్ట్రెయిట్‌ కట్‌ స్టైల్‌ ఆడవారి దుస్తుల్లోనూ చూపించాడు. అప్పటి వరకు ఒక సాదా సీదా డిజైన్స్‌ ఉండే మహిళల ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అర్మానీ తనదైన మార్క్‌ తో అలా ‘స్ట్రెయిట్‌’గా దూసుకొచ్చాడు. ప్యారిస్‌ ఫ్యాషన్‌ వేదికలపై మహిళల డ్రెస్‌ డిజైన్స్‌తో పాటు ఇతర అలంకరణ వస్తువులనూ ప్రదర్శించాడు. ఇతని డిజైన్స్‌లో లాంగ్‌ అండ్‌ షార్ట్‌ గౌన్స్, బిజినెస్‌ సూట్స్‌ ప్రముఖమైనవి. వాటిలో కలర్‌ కాంబినేషన్స్, కట్స్‌ అతివలకు అమితంగా నచ్చేశాయి. అర్మానీ కలెక్షన్స్‌లో ఉండే నిండుదనం, కళ భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండటంతో మనవారినీ ఆకట్టుకున్నాయి. దీంతో మన దేశ డిజైనర్లు సైతం అర్మానీ మార్క్‌ని తమ డిజైన్స్‌లో చూపిస్తున్నారు.

జీన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌
యువతరం ధరించే డెనిమ్స్‌తో ఎన్నో ప్రయోగాలు చేశాడు అర్మానీ. నాణ్యత, సరైన ఫిట్‌తో శరీరానికి పొందికగా అమరే కట్స్‌ వీటిలో ఉండటంతో జీన్స్‌ అంటే అర్మానీయే అనేలా ఈ లేబుల్‌కి పేరొచ్చింది. అంతేకాదు స్పోర్ట్స్‌వేర్‌ రూపకల్పనలో అర్మానీ ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాడు.  

సూట్‌ ది బెస్ట్‌!
వరల్డ్‌లో ఇటాలియన్‌ మెన్స్‌ సూట్‌ ఫేమస్‌. అందులో అర్మానీ సూట్‌ ఓ ఐకాన్‌. ఈ సూట్స్‌లో సీరియస్‌ లుక్‌ అనిపించే హెవీ ప్యాడింగ్, మృదువైన ఫ్యాబ్రిక్, ఫ్లోయింగ్‌ సిలౌట్స్‌ ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకునే మహిళల బిజినెస్‌సూట్స్‌ తయారుచేశాడు అర్మానీ. మహిళల హుందాతనానికి ఈ సూట్స్‌ కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.

లాంగ్‌ గౌన్స్‌ అండ్‌ బ్లేజర్స్‌
క్లాసిక్‌ బిజినెస్‌ వేర్, పెన్సిల్‌ కట్‌స్కర్ట్స్, ప్యాంట్స్, లాంగ్‌ బ్లేజర్స్, షార్ట్‌ జాకెట్స్, వెస్ట్స్, అసెమెట్రికల్‌ స్టైల్స్‌ నేటి మహిళలను మహారాణులుగా చూపుతున్నాయి.



లాంగ్‌ లెహంగా మీదకు పెప్లమ్‌ బ్లౌజ్‌తో ఓ రిచ్‌ లుక్‌ని చూపించవచ్చు. దీనికి ఎంచుకునే రంగు క్లాత్‌ ప్రధానమైనది. పెప్లమ్‌ బ్లౌజ్‌కి పెద్ద బకల్‌తో రూపొందించిన బెల్ట్, నెక్‌లైన్‌ వద్ద చేసిన ఎంబ్రాయిడరీ, త్రీ బై ఫోర్త్‌ స్లీవ్స్‌ సింపుల్‌ టెక్నిక్స్‌తోనే సూపర్‌ అనిపించే మార్కులు కొట్టేయడం అర్మానీ ప్రత్యేకత.

అర్మానీ లాంగ్‌ కోటు డ్రెస్‌లాగే ధరించవచ్చు.  కోటు అంటే వదులుగా టాప్‌ టు బాటమ్‌ కప్పేసే విధంగా కాకుండా
శరీరానికి సరైన ఫిట్‌తో ఉండి అకట్టుకునేవి.

నేటి తరం అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో తప్పనిసరి డ్రెస్‌గా ఉండిపోయిన లాంగ్‌ ఫ్రాక్‌ అర్మానీ సృష్టి.

సిగరెట్‌ ప్యాంట్, లాంగ్‌ స్లీవ్స్‌ టాప్‌.. క్యాజువల్‌ డ్రెస్సింగ్‌కీ ఓ స్టైల్‌ ఉందని చూపడం అర్మానీ ప్రత్యేకత. వీటిలో కలర్‌ కాంబినేష న్స్‌ది ముఖ్య పాత్ర.

మగవారి దుస్తుల్లో మేటి అయిన అర్మానీ అదే స్టైల్‌ కట్‌తో అతివల డిజైనరీ దుస్తులు ఇలాంటివెన్నో సృష్టించాడు.


ఒకే తరహా ప్రింట్లు ఉండే రెండు రంగుల ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసి షార్ట్‌ స్లీవ్‌లెస్‌ ఫ్రాక్‌. క్యాజువల్‌ వేర్‌లోనూ భిన్నమైన స్టైల్‌!

ఫ్యాషన్‌ వరల్డ్‌లో రంగుల ఎంపిక అవగాహన తప్పనిసరి. సాదా సీదా రంగుల కాంబినేషన్‌ తోనే కట్టిపడేసే డిజైన్స్‌ సృష్టించవచ్చు.

కాలాలకు అతీతం
ఎనిమిది పదుల వయసు దాటిన జార్జియో అర్మానీ కలెక్షన్‌ టైమ్‌లెస్‌ ఫ్యాషన్‌గా పేరొందాయి. ఛాయాచిత్ర కళ, నాణ్యమైన ఫ్యాబ్రిక్, మోనోక్రోమ్‌ కలర్స్‌ అర్మానీ డిజైన్స్‌లో కనిపించే స్టైలిస్టిక్‌ ఫీచర్స్‌. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ డిజైనర్స్‌ జాబితాలో ఉన్న అర్మానీ ఫ్యాషన్‌ లేబుల్స్‌ అత్యంత విలాసంగా ఉంటాయి. ఎన్నో హాలీవుడ్‌ సినిమాలలో అర్మానీ డిజైన్స్‌ ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పటికీ ఫిల్మ్‌ ప్రీమియర్‌ షోలు, పెద్ద పెద్ద ఈవెంట్లలో తారలు ధరించే అర్మానీ గ్లామరస్‌ డ్రెస్సులే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మోనోక్రోమ్‌ కలర్స్‌!
ఒక రంగుతో ఎన్నో రంగులు సృష్టించి వాటిని క్లాత్‌మీదకు తీసుకువస్తే అర్మానీ మార్క్‌ డ్రెస్సులుగా రూపొందుతాయి. అవి బ్లేజర్స్‌ అయినా క్యాజువల్‌ టాప్స్‌ అయినా!
– ఎన్‌.ఆర్‌

మరిన్ని వార్తలు