న్యూ జంగిల్ బుక్

4 Jul, 2016 23:08 IST|Sakshi
న్యూ జంగిల్ బుక్

హ్యూమర్ ఫ్లస్

 

వ్యాపారం వ్యాపారమే. కస్టమర్ మనిషా, జంతువా అనేది మనకు సంబంధం లేదు. మనుషులందరూ తలా రెండు సెల్‌ఫోన్లు కొనేశారు కాబట్టి వ్యాపార విస్తరణ కోసం సెల్‌ఫోన్ కంపెనీలు అడవిలో కూడా నెట్‌వర్క్ పెట్టాయి. ఆధార్ కార్డ్ లేకపోయినా జంతువులకు సెల్‌ఫోన్లు అమ్మసాగాయి.

 
ఒక కోతి చచ్చీచెడీ నాలుగు బస్తాల నేరేడుపళ్లు ఇచ్చి స్మార్ట్‌ఫోన్ కొనింది. వెంటనే సెల్ఫీ తీసుకుని ఆశ్చర్యపోయింది. తాను అందంగా ఉంటానని తెలుసు కానీ, మరీ అంత అందంగా వుండడం ఊహించలేకపోయింది. ఫేస్‌బుక్‌లో పెడితే రెండొందల లైక్స్ వచ్చాయి. పక్కచెట్టుపై వున్న వదినకి ఫోన్ చేసి పేలు చూసుకుందాం రమ్మని పిలిచింది. పేలు చూచివేతని ఫోటో తీసి ‘వదినతో పేలు సీయింగ్’ అని పోస్ట్ చేస్తే ప్రముఖ హేర్ డ్రెస్సింగ్ కంపెనీ నుంచి ‘పేన్ లుకర్’ జాబ్ ఆఫర్ వచ్చింది.

 
ఏనుగైతే తన దంతాన్నే త్యాగం చేసి ఫోన్ కొనింది. గూగుల్ సెర్చ్‌లో వెతికి ఎక్కడ చెరుకు దొరుకుతుందో కనిపెట్టి నమిలి తినేసింది. సింహాన్ని విడియోలో చూడ్డం వల్ల దానికి భయం పోయింది. సింహం కలలో కనిపిస్తే సింహస్వప్నం అని అరవడం మానేసింది. జింకల పని మరీ హాయి. గద్దల్ని వాట్సప్ గ్రూప్‌లో చేర్చుకున్నాయి. అవి పులికి ట్రాకింగ్ పెట్టాయి. పులి మైలు దూరంలో వుండగానే మెసేజ్ కొడుతున్నాయి. దాంతో జింకలు పరారీ. సమాచార విప్లవాన్ని పులులు కూడా అందిపుచ్చుకున్నాయి. అయితే వాటికి అహం ఎక్కువ కాబట్టి ఒకరి వేట గురించి ఇంకొకరు షేర్ చేసుకోవడం లేదు.

 
ఒక మొసలికి చెడ్డ ఇబ్బందొచ్చిపడింది. ఫోన్‌లో డిక్షనరీ వుండడంతో అన్ని పదాలకి అర్థాలు తెలిసిపోతున్నాయి. మొసలి కన్నీరుని వెంటనే గుర్తుపడుతున్నారు. మొసలి కూడా ఫోన్ కొనింది కానీ అది ఎక్కువసేపు నీళ్లలో వుండడం వల్ల మాట్లాడ్డం కష్టంగా వుంది. గట్టుమీద చెట్టు తొర్రలో దాచింది కానీ నక్కలెత్తుకుపోతున్నాయి. ఏది కనపడినా ఎత్తుకెళ్లడం నక్కల ప్రవృత్తి. దొంగఫోన్లు వాడ్డంలో అవి ఎక్స్‌పర్ట్‌లయ్యాయి. ఎప్పుడూ ఎదుటివాళ్లకు గోతులు తీయడం వల్ల పిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్‌వర్క్ అని కొత్త సిద్ధాంతాన్ని కూడా లేవదీశాయి.

 
ఫోన్ చేతికొచ్చేసరికి అడవి కోళ్లలో సామాజిక చైతన్యం కాలుమోపింది. వంటల కార్యక్రమంలో తమని రకరకాలుగా వండడం చూసి అవి అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. యూట్యూబ్‌లో ఈ విడియోలన్నీ నిషేధించాలని కోళ్ల శంఖారావం అని షార్ట్‌ఫిలిం తీసి అప్‌లోడ్ చేశాయి. చికెన్ ప్రియులంతా కోళ్ళ హక్కుల్ని సమర్థించారు.

 
ఎలుగుబంట్లకు ఒళ్లంతా బొచ్చు వుండడం వల్ల ఫోన్ ఎక్కడ పెట్టింది మరిచిపోయి శరీరమంతా తడుముకుంటున్నాయి. కంగారు అయితే తన పొట్టలోని పిల్లకు కూడా ఫోన్ కొనిపెట్టింది. అది ఆకలైతే ఏడ్వడం మానేసి మెసేజ్‌లు ఇస్తూ వుంది. కొండచిలువ ఒక అడుగు ముందుకేసి సెల్ఫ్ ప్రమోషన్ విడియో తీసింది. ‘కొండగాలి పిలిచింది, గుండె వూసులాడింది’ అనే పాటకి డ్యాన్స్ చేసి సర్వజీవుల రక్షణే తమ అభిమతమని, ప్రతి శనివారం సాయంత్రం తన భాషణ వుంటుందని ఆహ్వానం పంపింది. చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అని టైప్ చేసింది. ఇంతకూ షరతు ఏమిటంటే తనకు ఆకలేస్తే ఒకటి రెండు జంతువుల్ని తింటుందట!



ఇదంతా చూసి సింహాల నాయకుడికి కోపమొచ్చింది. సెల్‌ఫోన్ కంపెనీల ప్రతినిధిని పిలిపించింది.‘‘సమాచారం ఉన్నా లేకపోయినా కండబలందే రాజ్యం. కానీ ఈ ఫోన్ల వల్ల వేటకి కొంత అంతరాయంగా వుంది’’ అన్నాడు. ‘‘ప్రభూ, మీరు అపార్థం చేసుకున్నారు. సాంకేతిక నైపుణ్యం వల్ల మనిషి తన వేట లక్షణాల్ని మెరుగుపరుచుకున్నాడు. ఒకప్పుడు ఉద్యోగం చేసి ఇంటికెళ్లి హాయిగా గడిపేవాడు. ఇప్పుడు ఇంట్లో కూడా వాడితో ఉద్యోగం చేయించి పిండుతున్నారు. భార్యాపిల్లలతో వున్నప్పుడు ఫోన్ మోగించి, వాడి కలల్ని కూడా వేటాడుతున్నారు. ఫోన్ వుంటే బాణం, రివాల్వర్ కంటే వేగంగా వేటాడవచ్చు. ఆలోచిస్తే సూక్ష్మం బోధపడుతుంది’’ అన్నాడు ప్రతినిధి.


సింహం వెంటనే జింకల నాయకుడికి ఫోన్ చేసి, ‘‘రాత్రి డిన్నర్‌కి రెండు బలిసిన జింకల్ని పంపించు. లేదంటే మా మంద చేతిలో మీ మంద హతం’’ అని బెదిరించాడు. డిన్నర్ రెడీ అయింది. అప్పటినుంచి బలమైన జంతువులు కాలు కదపకుండా ఫోన్ ద్వారా వేటని కొనసాగించాయి. ప్రకృతి ఆవిధంగా సమతుల్యతని కాపాడుకుంది. 

 - జి.ఆర్. మహర్షి

 

మరిన్ని వార్తలు