న్యూ ఇయర్‌ నిర్ణయాలు కొనసాగాలంటే

1 Jan, 2020 02:23 IST|Sakshi

కొత్త సంవత్సరం వస్తోందనగానే అదో సందడి,  హడావుడి, రంగురంగుల సంబరం. ఆ రోజు వరకు ఉన్న పాత అలవాట్లను విడిచి, కొత్త అలవాట్లతో సరికొత్త జీవితాన్ని అందంగా, ఆనందంగా ప్రారంభించాలని రాత్రికిరాత్రే ఉరుకులుపరుగుల మీద కొత్త కొత్త నిర్ణయాలు తీసేసుకుంటారు. ‘అది మానేయాలి, ఇది మానేయాలి’ అని పెద్ద పెద్ద ఒట్లు పెట్టుకుంటారు. అందరిచేతా మంచి అనిపించుకోవాలనుకుంటారు.

ఎక్కువగా తీసుకునే నిర్ణయాలు
వ్యాయామం చేయటం, బరువు తగ్గాలనుకోవటం, పద్ధతిగా ఉండాలనుకోవటం, కొత్త నైపుణ్యాలు సాధించాలనుకోవటం, ఆనందంగా ఉండాలనుకోవటం, తక్కువ డబ్బు ఖర్చు చేసి ఎక్కువ దాచాలనుకోవటం, ధూమపానం విడిచిపెట్టాలనుకోటం, కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలనుకోవటం, ప్రయాణాలు చేయాలనుకోవటం, పుస్తకాలు చదవాలనుకోవటం. జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజీ స్టడీ ప్రకారం ‘ఈ నిర్ణయాలు తీసుకున్నవారిలో కేవలం 46 శాతం మంది మాత్రమే వాటిని అమలుపరుస్తున్నారు’ అని తెలుస్తోంది. ఆ రోజు నిర్ణయాలు తీసుకోకపోయినా, ఆ తరవాత.. ఏదో ఒకటి సాధించాలని కొందరు అనుకుంటున్నారట. అలా అనుకున్నవారిలో నాలుగు శాతం మంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారట.

ఆచరించటానికి పాటించాల్సినవి..
నిర్ణయాలు తీసుకుని, వాటిని ఆచరణలో ఉంచుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయని క్లినికల్‌ సైకాలజిస్టులు చెబుతున్నారు.
►తప్పనిసరిగా మారాలని మనసును సిద్ధం చేసుకోవాలి. గత సంవత్సరం ఏయే అంశాలను పాటించలేదు? ఎందుకు సాధించలేకపోయాను? అని ఎవరికివారు ప్రశ్నించుకుని, వాటిని సరిచేసుకోవాలి.
►సాధించగలిగే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి.
►తక్కువ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
►నిర్ణయాన్ని పాజిటివ్‌ కోణంలో తీసుకోవాలి. అంటే.. సిగరెట్‌ మానేయాలి అనుకోవడం కంటె, ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం మంచిది.  
►పెద్ద పెద్ద లక్ష్యాలను బ్రేక్‌ చేసి చిన్న చిన్న లక్ష్యాలుగా సెట్‌ చేసుకోవాలి. ఏడాది పాటు ఒకే నిర్ణయానికి కట్టుబడకుండా, వారానికి, నెలకు చొప్పున నిర్ణయాలను నిర్దేశించుకోవాలి. వ్యవధిని తగ్గించుకుని క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నమాట.
►లక్ష్యాలను ఒక బోర్డు మీద రాసుకుని, రోజూ టిక్కులు పెట్టుకోవాలి.
►తీసుకున్న నిర్ణయాలను ఇతరులతో పంచుకోవాలి.
►మొబైల్స్‌లో రిమైండర్‌ ఆప్స్‌ ఉంటాయి కనుక, అవి సమయానికి తగ్గట్టుగా గుర్తు చేసేలా సెట్‌ చేయాలి
►ప్రతిరోజూ ఎంతవరకు పాటించామో చూసుకోవాలి.
►నిర్ణయాలు తీసుకున్న వారం తరవాత కూడా ఆచరణలో పెట్టకపోతే, వెంటనే ఆచరణ ప్రారంభించాలి.
ఈ చిన్న చిన్న సూచనలను పాటిస్తే, మనం తీసుకున్న నిర్ణయాలను సంపూర్ణంగా ఆచరించగలుగుతాం. ఏ మాత్రం అలసత్వం వహించినా వారం గడిచేసరికల్లా కొత్త ఏడాది పాతబడిపోతుంది. దాంతో నిర్ణయాలు కూడా పాత సామాన్ల అటక మీదకు ఎక్కి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాయి. తస్మాత్‌ జాగ్రత్త!!!
– జయంతి

>
మరిన్ని వార్తలు