పౌష్టికాహారానికి కొత్త రూపు..

14 Mar, 2018 00:41 IST|Sakshi

పౌష్టికాహార లోపం తీవ్రమైన సమస్య. చాలామంది పసిపిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎదగలేకపోతున్నారు కూడా. ఈ నేపథ్యంలో సముద్రంలోనే అత్యంత పుష్టికరమైన ఆహారాన్ని పండించి అందించేందుకు సిద్ధమవుతోంది అమెరికాలోని ఓ స్టార్టప్‌ కంపెనీ. సముద్రంలో పెరిగే అనేకానేక మొక్కల్లో ‘కెల్ప్‌’ ఒకటి. అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, ఒమేగా –3 కొవ్వులు కలిగి ఉండే ఈ మొక్కలతో రుచికరమైన వంటకాలు తయారుచేసి అమ్మేందుకు అకువా అనే సంస్థ కిక్‌స్టార్టర్‌లో నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తోంది.

కెల్ప్‌ ఎంత పుష్టికరమైందంటే... పాలలో ఉండే కాల్షియం కంటే పది రెట్లు ఇందులో ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌ ఏ, బి1, బి2, సి, డి, ఈ లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అకువా జెర్కీ పేరుతో రానున్న కెల్ప్‌ వంటకాలలో కొంతవరకూ చక్కెర కూడా ఉంటుంది. ఈ కెల్ప్‌ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. రోజుకు అడుగు కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ప్రస్తుతం అకువా జెర్కీ మూడు రకాల రుచుల్లో లభిస్తోంది. ఒకటి సముద్రపు ఉప్పు రుచిలో ఉంటే.. రెండోది నువ్వుల రుచి.. మూడోది నిప్పులపై కాల్చిన రుచిలోను ఉన్నాయి.  

మరిన్ని వార్తలు