ఆసరాకు కొత్త అర్థం

10 Feb, 2015 22:56 IST|Sakshi
ఆసరాకు కొత్త అర్థం

అవయవాలు అన్నీ ఉన్నా ఏ పని చేయకుండా ఇతరుల నుంచి సాయం ఆశించేవారున్న ఈ సమాజంలో పుట్టుకతో చేతులు లేకపోయినా...   అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా... మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూన్న ఈమె మనోనిబ్బరం ముందు శారీరక వైకల్యం సైతం తలవంచక తప్పలేదు. ఆమె గురించి చదవడమంటే ఆసరాకు కొత్త అర్థాన్ని తెలుసుకోవడమే!
-  తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ
 
వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌కు చెందిన కీసరి సమ్మయ్య, కోమల కూతురు రజిత (34). పుట్టుకతోనే చేతులు లేకపోయినా    కాళ్లతోనే పలకా బలపం పట్టి ఇంటర్ వరకు చదివింది. చేతులు లేవన్న మాటే తప్ప రజిత అన్ని పనులను సాధారణ మనుషులకంటే చక్కగా చేయగలదు. కాళ్లతోనే కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, కుట్లు, అల్లికలు వంటి అన్ని పనులను అద్భుతంగా చేయగలదు. కాలితోనే ఫోన్‌ను ఆపరేట్ చేయగలదు. రజితలో ఉన్న ప్రతిభను గుర్తించిన కొన్ని స్వచ్ఛందసంస్థలు ముందుకు వచ్చి ఆమెను ప్రోత్సహించాయి. దానితో నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్‌లో నిర్వహించిన ప్రత్యేక కంప్యూటర్ శిక్షణా తరగతుల్లో చేరి కాళ్లతోనేకీబోర్డు, మౌస్‌లను ఆపరేట్ చేస్తూ సాధారణ విద్యార్థులతో పోటీపడి నెలరోజుల వ్యవధిలోనే ఎంఎస్ ఆఫీస్, వర్డ్ కోర్సులను నేర్చుకుని సర్టిఫికేట్ సాధించింది.

సాయం చేసే చేతులు

సాటివారికి సాయం చేయాలనే తలంపుతో చిన్నప్పటి నుంచి స్కౌట్స్‌లో చేరింది. వివిధ కాం్యపుల్లో వలంటీర్‌గా పని చేసి నాలుగుకు పైగా ప్రశంసాపత్రాలను పొందింది. ఆ సేవాగుణంతోనే అందరికీ ఆదర్శంగా నిలిచే నిర్ణయం తీసుకుంది. అప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారని ఐదోకాన్పులో జన్మించిన ఆడబిడ్డ మాకు వద్దు అనుకుంటున్న ఓ తల్లిదండ్రులను సంప్రదించి వారి నుంచి ఐదోబిడ్డను దత్తత తీసుకుని, ఆ బిడ్డకు అన్నీ తానై పెంచుతోంది రజిత. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివినా, తనబిడ్డను కాన్వెంటుకు పంపుతోంది.
 
ఎండమావి

‘నీ పరిస్థితి మొత్తం నాకు తెలుసు. నిన్ను అర్థం చేసుకున్నాను. నీకు జీవితాంతం తోడు ఉంటాను’ అంటూ 2007 ఆదర్శవివాహం పేరుతో ఓ వ్యక్తి రజిత జీవితంలోకి ప్రవేశించాడు. ఏడాది పాటు సజావుగా కాపురం చేశాడు. తాగుడుకు బానిసై ఉన్నట్టుండి ఓ రోజు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయాడు. అప్పటికే వారికి సాత్విక అనే పాప ఉంది. ఓవైపు తన ఇద్దరు పిల్లలు, మరోవైపు వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత రజితపై పడింది.  

ఆదుకోని ప్రభుత్వం

వికలాంగులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇంతవరకు రజితను ఆదుకోలేదు. ‘ఏదైనా చిన్నవ్యాపారం పెట్టుకుంటాను లోన్ ఇప్పించమంటూ’ పదోతరగతి పాస్ అయ్యాను, కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించి ఇంత ఆసరా చూపండ’ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చుట్టూ తిరిగింది. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటూ చెప్పేవారే తప్ప సాయం అందలేదు. దాంతో కుటుంబపోషణకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది.
 
కాళ్లకు చక్రాలు


వికలాంగులకు రైల్వేశాఖ పాస్‌లు ఇస్తుంది. దానిప్రకారం వికలాంగులు రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా వారికి తోడుగా వచ్చే వారికి టికెట్ చార్జీలో సగం మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వం నుంచి నెలకు రూ. 500 ిపింఛను తప్ప ఏ ఆధారం లేని రజితకు ఈ రైల్వేపాసే ఆధారం అయ్యింది. పొద్దున్నే ఉదయం ఎనిమిదిగంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ చేరుకుని హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం ఎదురు చూసేది. ‘మీ టికెట్ చార్జీలో సగం నాకిస్తే చాలు, మీరు రైలులో ప్రయాణం చేయొచ్చు. మీకు సీటు కూడా ఆపి ఉంచాను. నాతో రండి’ అంటూ బతిమాలుతూ... ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లలో తిరిగేది. ఇలా రోజుకు రూ 100 నుంచి రూ 200 సంపాదిస్తూ కొంతకాలం కుటుంబాన్ని పోషించింది. అయితే దురదృష్టవశాత్తుజరగరానిది జరిగితే తనపై ఆధార పడ్డ నలుగురికి ఉన్న ఒక్క ఆధారం పోతుందనే భయంతో ఈ పనిని ఇటీవలే మానేసింది.
 
ఓ ఆధారం ఉంటే బాగుండు

పిల్లలందరూ దైవంలా భావించే పుస్తకాలను తాను కాలితో తాకడం, దానితోనే చదవడం చేస్తుంటే తోటిపిల్లలు ఈసడింపుగా చూసేవారు. ఆటోలో ప్రయాణించినప్పుడు డ్రైవర్లకు కాళ్లతో డబ్బులు ఇస్తుంటే చాలామంది డ్రైవర్లు అదోలా చూసేవాళ్లు. కుటుంబాన్ని పోషించేందుకు నిత్యం రైళ్లలో తిరుగుతుంటే పాస్‌ను దుర్వినియోగం చేస్తున్నావంటూ టీసీలు తిట్టేవారు. ఇలా అవమానాలు ఎదుర్కొంటూనే నా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నా. కొత్తగా ఏమైనా నోటిఫికేషన్లు విడుదలైతే రాత పరీక్ష ద్వారా ఉద్యోగం పొందాలనే కృతనిశ్చయంతో ఉన్నాను. అంతవరకు  నా చదువు, ప్రతిభ చూసి ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పిస్తే నా పిల్లల పోషణ బాధ్యతకు ఏ లోటు ఉండదు’’ అని చెబుతున్న రజిత దీనగాథను ఎవరైనా జాలిగల వారు... మంచి మనసున్న వారు ఒక్కరైనా చెవిన వేసుకుంటే ఆమె కష్టాలు కొన్నైనా గట్టెక్కుతాయేమో!

మరిన్ని వార్తలు