వణికిస్తున్న చైనా జలుబు

24 Jan, 2020 02:06 IST|Sakshi

న్యూ వైరస్‌ – కరోనా

కొత్త కొత్త వైరస్‌లు ఆవిర్భవిస్తూ... మనల్ని బెంబేలెత్తించడం మనకు కొత్త కాదు. చాలాకాలం కిందట ఆంథ్రాక్స్‌ ఆ తర్వాత సార్స్, కొన్నేళ్ల కిందట బర్డ్‌ ఫ్లూ, అటు తర్వాత స్వైన్‌ఫ్లూ, ఈ వరసలో జికా, తాజాగా నిపా... ఇలా వైరస్‌లన్నీ వరసపెట్టి మన భూగోళాన్ని వణికించాయి. ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా వచ్చి చేరింది ‘కరోనా’ వైరస్‌. ఇప్పటికి తెలుస్తున్న దాన్ని బట్టి దీని జన్మస్థానం మధ్య చైనాలోని వుహాన్‌ అనే నగరం. గతేడాది (2019) డిసెంబరులో అక్కడ దీన్ని గుర్తించారు. ఆ తర్వాత అక్కణ్నుంచి ఇది చాలాచోట్లకు (ఆఖరికి యూఎస్‌కు కూడా) వ్యాపించినట్లుగా కనుగొన్నారు. చైనా నుంచి మనకు ప్రయాణికుల సంఖ్య తక్కువేగానీ... యూఎస్‌నుంచి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ కావడంతో మనమూ దీని గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

ఈ కొత్త వైరస్‌ బాధితులనూ, వాళ్ల రక్తంలోని వైరస్‌నూ ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌తో పరీక్షించాక ఈ కొత్త వైరస్‌ కిరీటం ఆకృతిలో ఉందని గుర్తించారు. దాంతో దీనికి ‘కరోనా’ అనే పేరు పెట్టారు. దీన్ని గురించి అధ్యయనం చేశాక... ఇది ‘సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌’ (సార్స్‌) కుటుంబానికి చెందిందని తెలిసింది. దాంతో దీనికి ‘సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనా వైరస్‌’ అని పిలుస్తున్నారు. సంక్షిప్తంగా ‘సార్స్‌–సీవోవీ’. దాదాపు పదిహేడేళ్ల కిందట సార్స్‌ వైరస్‌ విచ్చలవిడిగా విజృంభించి వందలాది మందిని చంపేసిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దీనికి 2019–ఎన్‌సీవోవీ అని నామకరణం చేసింది. మిగతా అన్ని శ్వాసకోశ వైరస్‌ల లాగే ‘కరోనా వైరస్‌’ కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

పాముల నుంచి మనుషులకు వచ్చిందట...
ఈ వైరస్‌ గురించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... అప్పట్లో వ్యాపించిన సార్స్‌ అనేదాన్ని జూనోటిక్‌ వైరల్‌ డిసీజ్‌గా చెప్పారు. అంటే... తొలుత ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందనీ, ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తోందని అర్థం. మనుషులను ప్రభావితం చేయడానికి ముందర ఇది కోళ్లలో, (పౌల్ట్రీ), గాడిదలూ, గొర్రెలూ, పందులూ, ఒంటెలూ, నక్కలూ, బ్యాడ్జర్స్, బ్యాంబూ రాట్స్‌ అనే ఎలుకలూ, హెడ్జ్‌హాగ్స్‌ వంటి జంతువులను ఆశ్రయించుకొని ఉందట. ఆ తర్వాత పాములకూ విస్తరించిందట. ఇక చైనా ప్రజలు పాముల్ని తింటారన్నది తెలిసిందే కదా. అలా అది తొలుత అక్కడి గబ్బిలాలు, వాటి నుంచి అక్కడి పాములకు విస్తరించిందట. మరీ ముఖ్యంగా చైనా క్రెయిట్‌ (చైనా కట్లపాము), చైనా కోబ్రా (చైనా నాగుపాముల) ద్వారా మనుషులకు అంటుకుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్న మాట.

లక్షణాలివి...
ఈ వైరస్‌ సోకిన వారిలో లక్షణాలన్నీ ఫ్లూను పోలి ఉంటాయి. అంటే... దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ, తలనొప్పి, గొంతులో గరగర, కొందరిలో జ్వరంతో ఇది కనిపిస్తుంది. ఇక చిన్నపిల్లలకు ఇది సోకితే వాళ్లలో చెవి ఇన్ఫెక్షన్‌ కూడా కనిపిస్తుంది. అంటే గొంతులో (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌) ఇన్ఫెక్షన్‌లో ఏ లక్షణాలు కనిపిస్తాయో... ఇందులోనూ అంతే.

నివారణ / చికిత్స
ఈ వైరస్‌ నుంచి రక్షణ కోసం మనం ఎప్పుడూ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. సబ్బుతో చేతులు రుద్దుకోవడం అన్నది కనీసం 15–20 సెకండ్లపాటు చేయాలి. సబ్బు, నీళ్లు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్‌ బేస్‌డ్‌ డిస్పోజబుల్‌ రుమాళ్లు (హ్యాండ్‌ వైప్స్‌) లేదా శానిటైజర్స్‌ లేదా జెల్స్‌ ఉపయోగించవచ్చు. ∙దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతుల్ని, చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు వ్యక్తులు ఫుల్‌ స్లీవ్స్‌ వేసుకున్నప్పుడు విధిగా వారంతా తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. దీని వల్ల వైరస్‌ లేదా వ్యాధిని సంక్రమింపజేసే ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు
►దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు ఆ తర్వాత వాటిని  శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి
►దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను గాని వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్‌ చేయాలి
►జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల తర్వాత కూడా మరికాసేపు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది.
►పరిసరాలను, కిచెన్లను, బాత్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
►రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. అయినా వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడం మంచిదే.
►పబ్లిక్‌ ప్లేసెస్‌లో ఒకే బాత్‌ రూమ్‌ ఉపయోగించినప్పుడు అందరూ తలుపు హ్యాండిల్‌గాని, కొళాయి నాబ్‌ కానీ ఉపయోగించినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దాన్నే ఫొమైట్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. కాబట్టి హ్యాండిల్స్‌/నాబ్స్‌ను ఉపయోగించిన తర్వాత చేతులను తప్పనిసరిగా ‘హ్యాండ్‌ శానిటైజర్స్‌’తో శుభ్రం చేసుకోవడం అసవరం.

చికిత్స...
ప్రస్తుతానికి దీనికి నిర్దిష్టంగా వ్యాక్సిన్‌ అయితే అందుబాటులో లేదు. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సింప్టమాటిక్‌ చికిత్స అన్నమాట.
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇప్పటికి ఇది మన దగ్గర లేదు కాబట్టి దీని గురించి ఆందోళన అవసరం లేదు. అయితే మన పొరుగుదేశంతో పాటు, మన దేశానికి విస్తృతంగా వచ్చే యూఎస్‌లోనూ ఉన్నందున దీని గురించి అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంలో తప్పు లేదు.
డాక్టర్‌ రమణ ప్రసాద్‌
కన్సల్టెంట్‌ పల్మునాలజిస్ట్‌ అండ్‌ స్లీప్‌ స్పెషలిస్ట్,
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు