అగ్గితెగులును అడ్డుకునేందుకు కొత్త మార్గం...

27 Mar, 2018 00:39 IST|Sakshi

వరిపంటకు అగ్గితెగులు సోకితే పంట సగానికిపైగా నష్టపోవాల్సిందే. కీటకనాశినులకూ ఒకపట్టాన లొంగని ఈ తెగులు వ్యాప్తికి చెక్‌ పెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌ శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. తెగులుకు కారణమైన శిలీంధ్రంలో కేవలం ఒక్క ప్రొటీన్‌ ఉత్పత్తిని నిలిపివేస్తే దీన్ని సమర్థంగా అడ్డుకోవచ్చునని వీరు గుర్తించారు. ప్రపంచంలో మూడొంతుల మందికి వరి కీలకమైన ఆహారమైన విషయం తెలిసిందే. ఈ తెగులు కారణంగా ఏటా దాదాపు ఆరు కోట్ల మంది కడుపు నింపగల వరి నాశనమవుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే తాము దీనిపై పరిశోధనలు చేపట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నిక్‌ టాల్బోట్‌ అంటున్నారు.

అగ్గి తెగులుకు కారణమైన శిలీంధ్రం వరి మొక్కల కణాలను ఎలా నియంత్రిస్తోందో.. తద్వారా మొక్క కణాల మధ్య ఎలా నివసించగలుగుతోందో తాము తెలుసుకోగలిగామని ఆయన చెప్పారు. ఇదంతా కేవలం పీఎంకే1 అనే ఒకే ఒక్క ప్రొటీన్‌తోనే సాధ్యమవుతోందని అన్నారు. రసాయన పద్ధతుల ద్వారా ఈ ప్రొటీన్‌ ఉత్పత్తిని నిలిపివేసి శిలీంధ్రాన్ని ఒక్క కణంలోకి పరిమితం చేయగలిగారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధన ఫలితంగా తెగులును అరికట్టేందుకు కొత్తకొత్త మార్గాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు నిక్‌ టాల్బోట్‌! 

మరిన్ని వార్తలు