ప్రతి ఇంటా పూలు వికసించాలి... ప్రతి పంటా చేతికి అందాలి...

31 Dec, 2016 23:33 IST|Sakshi
ప్రతి ఇంటా పూలు వికసించాలి... ప్రతి పంటా చేతికి అందాలి...

కొత్త సంవత్సర ప్రార్థన

నవ్వుతూ ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఇంటి యజమాని మిఠాయిలతో ఇంటికి చేరుతుండాలి. గృహిణి సంతృప్తిగా ఇంటిని చక్కదిద్దుతుండాలి. పిల్లలు బెరుకు లేకుండా బడికి వెళుతుండాలి. గురువులు జ్ఞానంతో విద్యను బోధిస్తూ ఉండాలి. వికాసం నలువైపులా సాగుతుండాలి. వృద్ధి పది దిశలా విస్తరిస్తుండాలి. కొత్త సంవత్సరం పాత భయాలన్నింటినీ వదలగొట్టాలి. కొత్త సంవత్సరం పాత సందేహాలన్నీ తరిమి కొట్టాలి. కొత్త సంవత్సరం పాత తప్పులన్నింటినీ మరుగున పడేయాలి. కొత్త సంవత్సరం పాత దీనాలాపనల్ని చీపురుతో చిమ్మి కాలబిలంలో పారేయాలి. వచ్చే కాలమంతా సంతోషం నిండి ఉండాలి. శుభం పలుకుతుండాలి. సుఖం వెల్లువెత్తాలి. శాంతి ప్రసరింప చేయాలి.

ఏ దేశం మరో దేశం కన్నా ఎక్కువ కాని తక్కువ కాని కాకుండా ఉండాలి. ఏ జాతి మరో జాతి కన్నా ఎక్కువ కాని తక్కువ కాని అవకుండా నిలవాలి. ఏ సరిహద్దు మరో సరిహద్దు రక్తంతో తడవకుండా సామరస్యంతో స్థిరపడాలి. ఏ ద్వేషం ఏ కంచెను దాటకుండా విఫలమవుతూ ఉండాలి. అపకారం తలపెట్టబోతే మేలు జరిగిపోవాలి. కసి స్నేహంగా పగ నెయ్యంగా ప్రతీకారం అనుబంధంగా రూపాంతరం చెందిపోతూ ఉండాలి.

ఆకాశం ఆకాశంలానే ఉండాలి. కాలుష్యం కొత్త చిగురుటాకుల నిశ్వాసతో అంతరించి పోవాలి. నదీజలాలు కావలసిన వారికి కావలసినంత దప్పిక తీర్చాలి. సముద్రాలు మానవుడి ఆశకు తల ఒంచకుండా పౌరుషంగా తమ జీవరాశిని కాపాడుకోవాలి. పర్వతాలు మంచు టోపీలతో పలకరించాలి. లోయలు కొండధారలతో తడుస్తూ ఉండాలి. తోటలు పిందెలు కాయలతో ఒంగిన కొమ్మలతో అనునిత్యం నిండు గర్భిణుల్లా భారంగా ఉండాలి. పంటలు చీడపీడల పాడు లేకుండా పచ్చగా ఎదగాలి. రైతు నాగలి పట్టుకుని నవ్వగలగాలి. రోడ్లు భద్రంగా ఉండాలి. వాహనాలు ఏ ప్రమాదమూ లేకుండా గమ్యాన్ని చేరుకోగలగాలి. కొత్త మార్గాలు ఏర్పడాలి. కొత్త దారులు తెరుచుకోవాలి. ప్రతి మార్గం సామాన్యుడి అందుబాటులో ఉండాలి.

ఆడపిల్ల పడ్డ ప్రతి గర్భం అపురూపం కావాలి. భూమిన పడ్డ ప్రతి బిడ్డా సురక్షితంగా ఉండాలి. నవ్వే ప్రతి బాలిక కబంధ కపట కాముక దృష్టి నుంచి తప్పించుకోవాలి. యువతీ యువకుల భుజాలను ఈ దేశం నమ్మగలగాలి. పైలా పచ్చీసులో కూడా ఒక బాధ్యత నర్మగర్భంగా లోపల కదలాడాలి. లక్ష్యం హెచ్చరిస్తూ ఉండాలి. గమ్యం వైపు అడుగు పడుతూ ఉండాలి.

ప్రేమలు సఫలం కావాలి. పెళ్లిళ్లు విఫలత్వాన్ని తప్పించుకోవాలి. చెదిరిన అనుబంధాలు తిరిగి చేతులు చేతులు కలపాలి. మనిషికి మనిషే తోడు అని నమ్మగలగాలి. ప్రతి మనిషిలో మంచిని వెతకగలగాలి. సాటి మనిషికి గౌరవం ఇవ్వాలి. ధర్మం ఆధిపత్యం కొరకు కాకుండా కేవలం దారిదీపంగా మాత్రమే ఉండగలగాలి. మతం మంచిని మాత్రమే పంచాలి. మతం మరో మతాన్ని ఆలింగనం చేసుకునే సహనంతో వ్యవహరించాలి. పరమాత్ముని ఏకత్వం గోచరం కావాలి.

తుపాకీ కరిగిపోవాలి. మందుగుండు తడిసిపోవాలి. హింసను అసహ్యించుకోవాలి. ఉన్మాదం కూకటివేళ్లతో పెకలించుకుపోవాలి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పెద్దలు జబ్బున పడాలి. పథకాలు రచించేవారందరూ అనుభవించాలి. కుట్రలు కుతంత్రాలు మానవ హననానికి కారణమయ్యే ప్రతి కార్పణ్యాలు మహా పతనం కావాలి. పూర్తిగా విఫలం కావాలి. నిజాయితీ నిండిన దళాలు కావాలి. రక్షణకు నిలిచిన ప్రతి దళ సభ్యుడు విచక్షణను పాటించాలి. సైనికుడు నవ్వుతూ సెలవు పై ఇంటికి రాగలగాలి. శవపేటికల కార్ఖానాలు మూతపడాలి.
ప్రతి వాకిలి కళకళలాడాలి. ప్రతి లోగిలి ముచ్చటగొలపాలి. ప్రతి కుండీ పూవులు పూయాలి. ప్రతి గుడీ గంటలు మోగాలి. ప్రతి అజాన్‌ చెవికి సోకాలి. ప్రతి చర్చ్‌ ప్రార్థనతో పులకించి తరించాలి.

2017 సకల శుభాలు తేవాలి.ప్రతి మస్తిష్కానికి స్థిమితత్వం ఇవ్వాలి.సామాజిక దొంతరల మధ్య సమన్వయం సిద్ధించాలి.ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరుగా ఒక లిప్త అయినా బతకగలగాలి. ఆమీన్‌. ఆమెన్‌. తథాస్తు.
– ఖదీర్‌

మరిన్ని వార్తలు