గుక్కతిప్పుకోని ప్రధాని

7 Nov, 2019 05:37 IST|Sakshi

గ్రేట్‌

జెసిండా ఆర్డెర్న్‌! న్యూజిలాండ్‌ మహిళా ప్రధాని. అనేక ప్రత్యేకతలు, విలక్షణతలు ఉన్న ప్రభుత్వాధినేత. 2017అక్టోబర్‌ 26న ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ రెండేళ్లలోనూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను రెండు నిముషాల 56 సెకన్లలో ఫటాఫట్‌ మని చెప్పేసి ఇప్పుడు మళ్లీ ఒక కొత్త రికార్డుతో ప్రపంచ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచారు. గత శుక్రవారం న్యూజిలాండ్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఈ  వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

వీడియో ఆన్‌లైన్‌లోకి షేర్‌ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 లక్షల 30 వేల మందికి పైగా వీక్షించారు. ఏడు వేల మందికిపైగా ఫేస్‌బుక్‌లో ఆమెను కొనియాడుతూ కామెంట్స్‌ పెట్టారు. జెసిండా సంగతేమో కానీ, వీడియోను చూస్తుంటే మనమే గుక్కతిప్పుకోలేకపోతాం. అంత వేగంగా, అంత స్పష్టంగా, అంత అలవోకగా ఒక ప్రధాని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అతి స్వల్ప వ్యవధిలో గుర్తుంచుకునీ, గుర్తుకు తెచ్చుకునీ చెప్పడం విశేషమే! రెండో నిముషం దాటాక కూడా తనింకా చెప్పవలసినవి మిగిలే ఉండటం పైన కూడా జెసిండా.. ‘అయ్యో ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నానే’ అనే భావాన్ని నవ్వుతూ వ్యక్తం చేయడం ఇంకో విశేషం.

92 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. 2,200 పైగా ఇళ్లు నిర్మించాం.. కర్బన రహిత అభివృద్ధి బిల్లును తెచ్చాం.. జాతీయ రహదారులను సురక్షితం చేశాం.. కారాగార జనాభాను తగ్గించాం.. అంటూ ఒకదాని వెంట ఒకటిగా అనేకానేక పురోగామి ప్రణాళికల్ని అంకెలు, సంఖ్యలతో సహా జెసిండా చెప్పడాన్ని వీడియోలో చూసిన ప్రపంచ ప్రజలు విస్మయ చకితులు అయ్యారు. ప్రధాని అంటే ఇలా ఉండాలి అని ప్రశంసించారు. ట్విట్టర్‌ అయితే ‘గుడ్‌ లీడర్‌షిప్‌’ అనే మాటతో కిక్కిరిసిపోయింది. జెసిండా ఆర్డెర్న్‌ ‘లేబర్‌ పార్టీ’ నాయకురాలు. 37 ఏళ్ల వయసులో న్యూజిలాండ్‌ ప్రధాని అయి, ప్రపంచంలో అతి చిన్న వయసులో ప్రధాని అయిన మహిళగా రికార్డు నెలకొల్పారు. పదవి చేపట్టేనాటికి గర్భిణిగా ఉన్న తొలి ప్రధాని కూడా చరిత్రలో జెసిండానే!

>
మరిన్ని వార్తలు