చిన్నవయసులో శిఖరాలకు

9 Apr, 2018 00:25 IST|Sakshi

ముప్పై ఏళ్ల బోత్సువానా దేశపు యువతి బొగోలో జాయ్‌ కెనెవెండో రెండురోజులుగా సోషల్‌ మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు! ఏప్రిల్‌ 1న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొగ్వీస్తీ మసీసీ ఆ సమావేశంలో యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు  పెట్టుబడులు పెట్టబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఆ వెంటనే కెనెవెండోని ‘పెట్టుబడులు, వాణిజ్యం, పరిశ్రమల’ శాఖ మంత్రిగా నియమించారు.

తన హామీని నెరవేర్చడానికి దేశ అధ్యక్షుడు మొట్టమొదట పెట్టిన అతి పెద్ద ‘పెట్టుబడి’ కెనెవెండోనేనని ఆయనపైనా, ఆమె పైన ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం చిన్నవయసు కారణంగా కెనెవెండో ఆఫ్రికా ఖండాన్ని ఆకర్షించలేదు. మెగ్వీస్తీకి ముందున్న అధ్యక్షుడు అయాన్‌ ఖమా రెండేళ్ల క్రితమే కెనెవెండోనో పార్లమెంటు సభ్యురాలిగా నియమించారు. అంతకుముందు ఆమె ఘనా దేశపు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖలో ‘ట్రేడ్‌ ఎకనమిస్ట్‌’గా చేశారు.

యువతకు అచ్చమైన ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన కెనెవెండో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు; మహిళలు, యువజనుల సాధికారత అనే అంశాలపై పట్టున్న యువతి. ‘మొలాయా క్గ్వోసీ’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ మహిళా నాయకత్వ, మార్గనిర్దేశక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుంటుంది. 2011లో మిషెల్‌ ఒబామా ఆతిథ్యంతో జరిగిన ‘ఆఫ్రికన్‌ ఉమన్‌ లీడర్స్‌ ఫోరమ్‌’ నుంచి స్ఫూర్తి పొంది ఆ సంస్థను నెలకొల్పారు.

2009లో జరిగిన ఐక్యరాజ్యసమితి 64వ అత్యున్నతస్థాయి ప్రతినిధుల సమావేశానికి ఆఫ్రికా దేశాల తరఫున హాజరైన ఇద్దరు ప్రతినిధులలో ఒకరిగా ఇరవై ఏళ్ల వయసులోనే కెనెవెండో హాజరయ్యారు! యు.కె.లోని ససెక్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. 2012లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌’ పొందారు. కెనెవెండోకు ప్రయాణాలంటే ఇష్టం. యోగా చేస్తారు. పుస్తకాలు చదువుతారు. మంచి ఫ్రెండు, మనసుకు హాయినిగొల్పే శీతల పానీయం పక్కనే ఉంటే జీవితం ఉత్సాహంగా ఉంటుందని కెనెవెండో అంటారు.

మరిన్ని వార్తలు