రెండు చేతులు ఇరవై పనులు!

2 Apr, 2018 01:19 IST|Sakshi

నెత్తి మీద వంద పనులు పెట్టుకుని, పడిపోకుండా పరుగులు తీయడం మల్టీటాస్కింగ్‌. (పనులు పడిపోకుండానా, మనిషి పడిపోకుండానా? రెండూనూ). పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, మేనేజింగ్‌ డైరెక్టర్లు, ఛైర్మన్‌లు నిత్యం మల్టీటాస్కింగ్‌ చేస్తుంటారని విన్నప్పుడు.. వాళ్ల ‘డీఎన్‌ఏ’ వేరేమో అనిపిస్తుంది. వాళ్లు తప్ప నరమానవులెవరూ మల్టీటాస్కింగ్‌ చెయ్యలేరు. వేగం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలి. పని ఫినిష్‌ చేసేయాలి. మల్టీటాస్కింగ్‌ ఒక విధంగా సామర్థ్యానికి కొలబద్ద.

అయితే ఈ మల్టీటాస్కింగ్‌.. ఒంటికి మంచిది కాదని, ఒత్తిడిని తట్టుకునే శక్తిని కొద్దికొద్దిగా ఈ టాస్కింగ్‌ తగ్గించేస్తుందని మయామీ యూనివర్శిటీ న్యూరోసైంటిస్ట్‌ అమిషీ ఝా అంటున్నారు! ‘మైండ్‌తో పరుగులు తీసే మనిషి, బాడీ ఏమైపోతుందో పట్టించుకోడు. బాడీ బలహీనం అయ్యాక, ఆ ప్రభావం మైండ్‌ మీద పడి కొత్తకొత్త న్యూరో ప్రాబ్లమ్స్‌ వచ్చేస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. అందుకే.. అన్నీ ఒకరే చేయాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. పనుల్ని పంచండి.

ఎవరికైతే పంచారో వాళ్లపై నమ్మకం ఉంచండి. ఆరోగ్యంగా ఉండండి. మరి గృహిణుల మాటేమిటి? వాళ్ల మల్టీటాస్కింగ్‌.. ఏ కంపెనీ సీఈవో కన్నా తక్కువ కాదు కదా! నిజమే. లోకంలోని అతి పెద్ద మల్టీటాస్కింగ్‌ గృహిణులదే. రెండు చేతులు, ఇరవై పనులు. వాళ్ల ఆరోగ్యం దెబ్బతినదా? తింటుంది. అందుకే.. బయట మన మల్టీటాస్కింగ్‌ పనుల్ని నలుగురికి పంచిన విధంగానే, ఇంట్లో స్త్రీల మల్టీటాస్కింగ్‌ని మనమూ పంచుకోవాలి.

>
మరిన్ని వార్తలు