మహోత్కృష్ట యాగం... అతిరాత్రం

8 Apr, 2018 01:14 IST|Sakshi

ప్రకృతిపై వికృతి ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది (ఉదా– సార్స్, స్వైన్‌ ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, ఎ బోలా, మ్యాడ్‌ కౌ వంటివి.) మానవశరీరంపై ప్రతి నిమిషం దాదాపు 50,000 సూక్ష్మక్రిములు (బాక్టీరియా) దాడిచేస్తూనే ఉంటాయి. మన రోగనిరోధక శక్తి వాటిని నిరోధిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకు తగ్గినపుడు రోగగ్రస్థులమవుతాం. దేహం – దేశం రెండూ ఒక్కటే.

భూమిపై ఏ జీవీ ప్రయత్నించని విధంగా మానవుడు వివిధ ఆయుధాలతో, అణుశక్తి విస్ఫోటనశక్తితో ప్రపంచంలో జీవకణశక్తిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటువంటి వినాశకారక ఆలోచనలు మార్చేందుకు చంద్ర సంబంధమైన సోమలతతో అత్యంత కఠోర నియమావళితో చేసే మా–నవ ప్రయత్నమే సోమయాగం. ఏ యజ్ఞమైనా ప్రకృతిని కాపాడడానికే.

కలియుగంలో చేయదగిన సప్త సోమయాగాలలో అప్తోర్యామం ఏడవది. అగ్నిహోత్రంతో సశాస్త్రీయ సనాతన భారతీయ వేద విజ్ఞాన విధానం ద్వారా ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలతనుండి తీసే సోమరసాన్ని ప్రకృతికి (దేవతలకు) సమర్పించటమే సోమయాగం. చంద్రుడు మనఃకారకుడు. చంద్రకాంతి ప్రకృతిని, జీవుల మనస్సును ప్రభావితం చేస్తుంది. చంద్రకళలతో సమానంగా పెరుగుతూ, సమానంగా తరిగే ఏకైక ఓషధీ రాజం సోమలత. అమితంగా చంద్రశక్తిని గ్రహించే ఏకైక లత సోమలత. సోమయజ్ఞాలలో సోమవల్లీరసం ప్రధానం.

ప్రకృతిలో జీవశక్తిని పెంచడానికి సోమలతనుండి తీసే సోమరసాన్ని అగ్ని ద్వారా దేవతలకు సమర్పించు మంత్రవిభాగాలు ప్రధానంగా 33 స్తుతి – శస్త్రాలు. స్తుతి సామవేద మంత్రాలు, శస్త్రాలు ఋగ్వేద మంత్రాలు. సప్త సోమయాగాల పేర్లు ఈస్తుతి – శస్త్రాల సంఖ్యను అనుసరించి నిర్ణయించబడుతుంది. వేదానాం సామవేదోస్మి అని జగద్గురువులైన శ్రీ కృష్ణులు చెప్పారు. సామం లేకపోతే యాగం లేదు. సోమయాగంలో సామవేదమే ప్రధానం. ఈ విషయం అర్థం కావాలంటే యాగం చూడడం, అది ఏమిటి అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

సోమయాగాలు ఏడు – 1) అగ్నిష్టోమం 2) అత్యగ్నిష్టోమం 3) ఉక్థ్యం 4) షోడశీ 5) వాజపేయం – 6) అతిరాత్రం 7) అప్తోర్యామం.

ఫలం ఏమిటి?
సోమ యాగం వల్ల ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమంచేస్తే ప్రాణ వాయువు (ఆక్సిజన్‌) పెరుగుతుంది. సోమరసంతో హోమం చేస్తే ప్రకృతిలోని సమస్త మూలకణములు శుద్ధి అయి, జీవశక్తి పెరుగుతుంది. సోమయాగం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి.

జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్యవృద్ధి (పంటలు) కలుగుతుంది. ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్‌ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. మాతా శిశు మరణాలు, ప్రమాదాలు తగ్గుతాయి. మానవుడికి చెడు ఆలోచనలు రావు.

అప్తోర్యామం సోమయాగం వల్ల మానవుల కనీస అవసరాలు తీరుతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితమైంది.యాగం అనంతరం పిల్లలు లేని దంపతుల కోసం పుత్రకామేష్టి, జీవితంలోని అన్ని విపత్తులూ తొలగిపోయి, సకల శుభాలూ జరగడం కోసం చేసుకునే శ్రీ ప్రత్యంగిరా హోమం జరుగుతాయని, ఆసక్తి గల వారు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చునని యాగ పరిరక్షకులు కేసాప్రగడ ఫణి రాజశేఖర శర్మ తెలియజేస్తున్నారు.

నిర్వహణ ఎవరు?
జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ తీర్ధమహాస్వామి, వెదురుపాక గాడ్, శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివార్ల దివ్య ఆశీస్సులతో త్రిలింగ తెలుగు ప్రాంతాలైన భద్రాచలంలో 2012లో అతిరాత్రం, 2013లో మురమళ్లలో అతిరుద్రం, 2015లో గార్గేయపురం (కర్నూలు)లో అప్తోర్యామం, 2017లో యాదగిరిగుట్టలో అయుత శ్రీమహావిష్ణు మహాయాగాలు‘ ఇత్యాది ఏకవింశతి (21) మహాయాగకర్తలు బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ – రాధాకృష్ణకుమారి దంపతుల కర్తృత్వాన, హైదరాబాద్‌ కె.హెచ్‌.ఎస్‌. సేవా ట్రస్ట్, ఇతర అనుబంధ సంస్థల నిర్వహణలో అశేష భక్త జనావళి పాల్గొననున్నారు.

ఎప్పుడు? ఎక్కడ?
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పంచారామాలలో ఒకటైన కుమారారామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల పాండవుల గుట్టలో ఈ ఏప్రిల్‌ 14 నుంచి 25 వ తేదీ వరకు మహాగ్నిచయన పూర్వక మహోత్కృష్ట సోమయాగం అతిరాత్రం జరగనుంది. బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహర నాథ శర్మ నేతృత్వ పర్యవేక్షణలో త్రేతాగ్ని హోత్రి బ్రహ్మశ్రీ కిరణ్‌ అవధాని దంపతులు యజమానులు కాగా, భార్గవ రామ అవధాని బ్రహ్మగానూ, సాకేత రామ అవధాని హోతగానూ, శ్రీధర శర్మ ఉద్గాతగానూ ఈ యాగం అత్యంత శాస్త్రోక్తంగా, మహా వైభవంగా జరగనుంది.

మరిన్ని వార్తలు