నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా?

7 Oct, 2015 06:21 IST|Sakshi
నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా?

హోమియో కౌన్సెలింగ్
 
 నాకు వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. హోమియోలో పరిష్కారం చెప్పండి.
 - సుందర్, హైదరాబాద్

 మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, ఐదు కింది వీపు భాగంలో, మిగిలిన తొమ్మిది కింది నడుము భాగంలో ఉంటాయి. ప్రతి రెండు ఎముకల మధ్య డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. మనం కదిలేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు రెండు ఎముకల మధ్య రాపిడిని ఈ డిస్క్ తగ్గిస్తుంది. ఈ డిస్క్ మధ్య భాగం లోంచి మెదడు నుంచి మచ్చే నాడులు ఉంటాయి.
 
మెడ భాగంలోని వెన్నుపూసల మధ్య నరాలు ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే మెడనొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు.  మెడకు తీవ్రగాయం కావడం  వయసు పెరిగేకొద్దీ డిస్క్ అరగడం  గంటల తరబడి కూర్చొని పనిచేయడం  తీవ్రమైన మానసిక ఒత్తిడి పడటం వంటి కారణాలతో ఇది వస్తుంది. మెడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉండి, అది భుజాలు, చేతి వరకు పాకుతుంటుంది. చేతి వేళ్ల తిమ్మిర్లు, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

లంబార్ స్పాండిలైటిస్: కింద నడుము భాగంలో ఐదు ఎముకలు ఉంటాయి. ఎల్4 - ఎల్ 5 మధ్య సయాటిక్ నరం ఆరంభమవుతుంది. ఈ ఎముకల డిస్క్ అరగడం లేదా పక్కకు జరగడం వల్ల సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ తరహా నొప్పి నడుం వద్ద ప్రారంభమై కాలు మొత్తానికి పాకుతుంది. కాలు తిమ్మిర్లు పట్టడం కూడా జరగవచ్చు.
 
కారణాలు: నడుముకు బలమైన గాయం కావడం,  వయసు పెరిగేకొద్దీ వచ్చే అరుగుదల సమస్య  తదేకంగా ఎలాంటి కదలికలు లేకుండా కూర్చొని పనిచేయడం  గర్భిణులు.
 
సయాటికా: సయాటిక్ నరం మన శరీరంలోని అతి పెద్ద నరం. ఇది నడుము దగ్గర ప్రారంభమై, తొడలు, పిక్కల నుంచి వెళ్తూ అరికాలి వరకూ ఉంటుంది. ఈ నరంపై ఒత్తిడి పడటం వల్ల కలిగే నొప్పిని సయాటికా అంటారు. ఇప్పుడు వెన్నుపూసల నొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, కామొమిల్లా, మాగ్‌ఫాస్ లాంటి మందులను రోగి తత్వాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులు తగిన మందును నిర్ణయిస్తారు. దీన్ని వారు సూచించిన మోతాదులో, నిర్ణీత కాలపరిమితి మేర వాడటం వల్ల వెన్నుకు సంబంధించిన సమస్యల నుంచి ఎలాంటి సర్జరీ లేకుండా శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల వెన్ను సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
 
డయాబెటిక్ కౌన్సెలింగ్

 
 నా వయసు 30 ఏళ్లు. గత నాలుగేళ్లుగా కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాను. ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. నేను ఇటీవల పరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళన కలుగుతోంది. నేను డయాబెటిస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - సోమసుందర్, హైదరాబాద్

 వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. గానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ రాదు. ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అన్న అంశాన్ని మీరు తెలపలేదు. జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

 ఇక డయాబెటిస్ కోసం మీరు మీ రక్తపరీక్షలను పరగడపున చేయించుకున్నారా లేక భోజనం చేసిన తర్వాత చేయించుకున్నారా అన్న విషయాలు తెలపలేదు. రక్తపరీక్షలో బార్డర్‌లైన్ డయాబెటిస్ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత కొద్ది మోతాదులో ఆహారం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పీచు ఎక్కువగా ఉండే ముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్

 
నా వయసు 58. షుగర్‌వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి?
 - రవికుమార్, హైదరాబాద్

 ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్-సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఇలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్‌కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ.
 
 నా వయసు 36. కిడ్నీ సైజు తగ్గిందని తేలింది. సీకేడీ స్టేజ్ 5 అని డాక్టర్ చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి అని సలహా ఇచ్చారు. అది కాకుండా ఇంకేదైనా అవకాశం ఉందా?
 - మహబూబ్‌బాషా, గుంటూరు

 కిడ్నీ మార్పిడి చేయడం మీకు మంచి చికిత్స. మీకు మీ అన్నదమ్ములు గానీ, అక్కచెల్లెళ్లుగానీ లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు కిడ్నీ ఇవ్వవచ్చు. కిడ్నీ ఇచ్చే వారికి అన్ని పరీక్షలూ చేసి, ఇలా చేయడం వల్ల వారికి ఎలాంటి సమస్యా రాదనీ, ఒక్క కిడ్నీతోనే వారు సాధారణంగా జీవిస్తారని తేలిన తర్వాతనే దాతను నిర్ధారణ చేస్తారు. దాత ఎంత ఎక్కువ దగ్గరి సంబంధీకుడైతే.. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత రోగి శరీరంలో కిడ్నీ అంతగా ఇమిడిపోవడానికీ, ఎక్కువ కాలం పనిచేయడానికీ అవకాశం ఉంటుంది. కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) తర్వాత కూడా మీరు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కిడ్నీ ఇచ్చే దాత లేనివారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, ఎవరైనా బ్రెయిన్‌డెడ్ దాతల నుంచి కిడ్నీ లభించేవరకూ వేచిచూడాలి.
 
 

మరిన్ని వార్తలు