‘నవ’ ధాన్యాలు

24 Mar, 2016 01:19 IST|Sakshi
‘నవ’ ధాన్యాలు

1. గోధుమలు: పలు పాశ్చాత్య దేశాలతో పాటు ఉత్తర భారతీయుల ఆహారంలో ప్రధానమైనవి గోధుమలే. వీటిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. బీ కాంప్లెక్స్‌లో బి-12 మినహా మిగిలిన విటమిన్లు, విటమిన్-ఈ, విటమిన్-కేతో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి.

 
2. వరి:
పలు తూర్పు దేశాలతో పాటు దక్షిణ భారతీయులు వరి ధాన్యం నుంచి వేరు చేసిన బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. వరిలో రకరకాల వంగడాలు ఉన్నా, వాటిలోని పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. బియ్యంలో దాదాపు 80 శాతం పిండి పదార్థాలే ఉంటాయి. స్వల్పంగా ప్రొటీన్లు, కొవ్వులు, బి1, బి2, బి3, బి5, బి6 విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి.

 
3. కందులు: కందులను దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వినియోగిస్తారు. ఎక్కువగా పొట్టు తీసేసి పప్పుగా మార్చి వినియోగిస్తారు. కందులలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బి1, బి2, బి3, బి5, బి6, బి9 సీ, ఈ, కే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

 
4. పెసలు:
పెసలను కూడా అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. పొట్టుతీయని గింజలను నానబెట్టి మొలకెత్తిన తర్వాత తినడంతో పాటు పొట్టుతీసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. పెసలలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

 
5. శనగలు: పెసల మాదిరిగానే శనగలను కూడా నానబెట్టి మొలకెత్తిన తర్వాత నేరుగా తినడంతో పాటు పొట్టుతీసేసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. శనగల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగాను, కొవ్వులు నామమాత్రంగాను ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

 6. బొబ్బర్లు: కందులు, పెసలు, శనగల మాదిరిగా బొబ్బర్లను అంత విరివిగా వాడకపోయినా, మన దేశంలో వీటిని తరచుగానే ఉపయోగిస్తారు. బొబ్బర్లను నానబెట్టి ఉడికించి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. బొబ్బర్లలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.

 
7. నువ్వులు: నువ్వులు ప్రధానంగా నూనెగింజల జాతికి చెందుతాయి. నువ్వులను, నువ్వుల నూనెను కూడా మన దేశంలో విరివిగా వినియోగిస్తారు. నువ్వుల నూనెను ఊరగాయల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వులలో ప్రధానంగా కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

 8. మినుములు: మినుముల వాడుక మన దేశంలో పురాతన కాలం నుంచి ఉంది. మినుములను లేదా పొట్టుతీసిన మినప్పప్పును నానబెట్టి వివిధ రకాల అల్పాహార వంటకాలకు ఉపయోగిస్తారు. మినప్పుప్పును పిండిగా చేసి అప్పడాలు, సున్నుండలు వంటివి తయారు చేస్తారు. మినుముల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

 9. ఉలవలు: ఉలవల వాడకం మన దేశంలో పురాతన కాలం నుంచే ఉన్నా, మిగిలిన పప్పుధాన్యాలతో పోలిస్తే వీటి వాడుక చాలా తక్కువ. ఉలవల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో  బి1, బి2, బి3, బి5, బి6, బి9 విటమిన్లతో పాటు విటమిన్-సీ, విటమిన్-ఈ, విటమిన్-కే వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఉలవలను నానబెట్టి నేరుగా తింటే, మధుమేహం అదుపులోకి వస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో తేలింది.

 

ఉషశ్రీ సీనియర్ కన్సల్టెంట్
న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

 

పిల్లల కోసం  ‘నవ’ సూచనలు
1 ఐదేళ్ల వయసొచ్చే వరకు తలిదండ్రులు తమ పిల్లలను అపురూపంగా చూడాలి 2 ఐదేళ్లు వచ్చాక వారికి మంచి, చెడు చెప్పే ప్రయత్నం చేయాలి. నయానా భయానా దారికి తెచ్చుకోవాలి. వారి మంచిలోనూ, చెడులోనూ అన్ని సందర్భాలలోనూ వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించాలి 3 వారిని విమర్శించడం, వ్యాఖ్యానించడం, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చడం చేయకూడదు 4 పిల్లల శారీరక, మానసిక స్థితిగతులను బట్టి పెద్దయ్యాక వారు ఏమి కావాలన్న దానిపై ఒక ఆలోచన చేయాలి కానీ ముందు నుంచే వారిపై ఆశలు పెట్టుకుని, మోయలేనంత భారం మోపకూడదు 5 శారీరకంగా బలంగా అంటే బొద్దుగా, ముద్దుగా ఉన్నారు కదా అని మురిసిపోకూడదు.

మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చూడాలి. 6 భార్యాభర్తల కీచులాటలు, అత్తాకోడళ్ల తగవులు, ఇరుగుపొరుగుతో కయ్యాలు వంటివి లేకుండా ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. 7 ఎప్పుడూ చదువు.. చదువు.. అని వారిని సాధించకుండా, వారికి నైతికవిలువలను, నీతినిజాయితీలను ప్రబోధించే కథలు చెబుతుండాలి. నిజాయితీగా ఉన్నందుకు చిన్న చిన్న బహుమతులిచ్చి ప్రోత్సహించాలి 8 క్రమశిక్షణ పేరుతో వారిని తీవ్రంగా మందలించడం, మీతో మాట్లాడాలంటేనే భయపడేలా చేయకూడదు. అలాగని అతి చనువు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోకూడదు. క్రమశిక్షణకు క్రమశిక్షణే, చనువు చనువే అన్నట్లు వ్యవహరించాలి 9 చివరగా ఒక్క మాట.. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వండి. అవసరమైతే వారి ఆలోచనలను, అభిప్రాయాలను సరిదిద్దుతూ, సూచనలు, సలహాలు ఇస్తుండండి.

 

డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
లూసిడ్ డయాగ్నొస్టిక్స్
బంజారాహిల్స్, హైదరాబాద్

 

 

మరిన్ని వార్తలు