పెళ్లిఇళ్లు

16 Mar, 2019 00:22 IST|Sakshi

దేవుడు కలుపుతాడు.. కానీ కలిసి ఉండాల్సింది మనమేగా!పెళ్లి ఇద్దరి మధ్య జరుగుతుంది.. తంతు రెండు అభిప్రాయాల మధ్య జరుగుతుంది!ఎన్ని చూడరు పెళ్లికి ముందు? గ్రహాల దగ్గర్నుంచి గృహాలదాకా!కాని వర్కవుట్‌ చేయాల్సింది ఈ మ్యాగ్నెట్లు కాదు.. అవగాహన, ఆకర్షణ, అనుగారం, అభిమానం! తొమ్మిది పెళ్లిళ్లు.. తొమ్మిది ఇళ్లల్లో!పెళ్లి..ఇళ్లు!!

అదిల్‌ ఖన్నా.. వ్యాపారి. అతని భార్య తారా ఖన్నా. తన స్నేహితుడు కరణ్‌తో కలిసి వెడ్డింగ్‌ ప్లాన్‌ కంపెనీని నిర్వహిస్తూ ఉంటుంది. అదే ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’. అమెజాన్‌ ప్రైమ్‌లో విమెన్స్‌ డే (మార్చి 8) నుంచి స్ట్రీమ్‌ అవుతోంది.. కళ్యాణ వేదికగా సామాజిక పరిస్థితులను చూపించే తొమ్మిది ఎపిసోడ్‌లతో.

ఆల్‌ దట్‌ గ్లిటర్స్‌ ఈజ్‌ గోల్డ్‌
అంగద్‌కు ఆలియా అంటే చచ్చేంత ప్రేమ. ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. కొడుకు కోసం కాదనలేరు కాని ఆలియా అంటే అంగద్‌ తల్లిదండ్రులకు అంతగా ఇష్టం ఉండదు. ఆమె గురించి ఆరా తీస్తారు. గతంలో ఆమెకు ఓ బాయ్‌ ఫ్రెండ్‌ ఉండేవాడని, అబార్షన్‌ కూడా అయిందని తెలుస్తుంది. అయితే ఆలియా గతం తెలిసే అంగద్‌ ఆమెను ప్రేమిస్తాడు. కాబట్టి అమ్మానాన్న ఆంతర్యం అర్థమైన అతను.. ఆ బాయ్‌ఫ్రెండ్‌ తనే అని చెప్తాడు. ఆ అబద్ధం ఆలియాకు కోపాన్ని తెప్పిస్తుంది. ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు ఫీలవుతుంది. అంగద్‌ సారీ చెప్పినా వినదు. చివరకు ఆ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్న తారా ఖన్నా ఇంటర్‌ఫియరై ‘‘అయిదువేల కోట్ల రూపాయల ఆస్తి. పెళ్లి పాతబడగానే ప్రేమ ఆవిరై డబ్బే మిగులుతుంది. థింక్‌ ఎబౌట్‌ 5 థౌజెండ్‌ క్రోర్స్‌’’అని చెప్పి పెళ్లికి ఆలియా తలూపేలా చేస్తుంది. మ్యారేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌ అంటారు.. కాని ఇన్నర్‌ స్పిరిట్‌ బ్యాక్‌ సీట్‌ తీసుకుంటుంది లైఫ్‌ వెహికిల్‌లో. గమ్యానికి చేర్చడానికి. 

ఇట్స్‌ నెవర్‌ టూ లేట్‌
గాయత్రి మాథుర్‌.. ఢిల్లీలోని ‘న్యూ ఎరా’ స్కూల్స్‌ యజమాని. అరవైఏళ్ల వితంతువు. బిజోయ్‌ చటర్జీ.. బ్లాగర్‌. అతనికీ భార్య చనిపోతుంది. ఆ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాలనుకుంటారు. బిజోయ్‌కి పిల్లలుండరు. గాయత్రికి ఒక కొడుకు, కూతురు. వివాహాలైపోయి వాళ్ల వాళ్ల కుటుంబాలతో ఉంటూంటారు. ఆ వయసులో అమ్మ తీసుకున్న నిర్ణయానికి వీళ్లు సిగ్గుపడ్తారు. ఆ పెళ్లిని వ్యతిరేకిస్తారు. ‘‘అమ్మ విషయంలో ఎమోషన్స్‌ బాగా పనిచేస్తాయి’’ అంటూ సలహా ఇస్తుంది ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ జస్‌ప్రీత్‌. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి.. ఒంటరిగా పిల్లలను ఎలా పెంచి పెద్దచేసిందో గాయత్రి చెప్తూంటే వీడియో తీసి.. ఆమె పిల్లలకు చూపిస్తారు తారా ఖన్నా, కరణ్‌. ఎమోషన్స్‌ పనిచేస్తాయి. పిల్లల మనసు కరుగుతుంది. 
లవ్‌ ఈజ్‌ ఆల్‌ యూనిక్‌.. 

ది ప్రైజ్‌ ఆఫ్‌ లవ్‌
‘‘యూపీ,బీహార్‌లో ఐఏఎస్‌కు ఎంత డిమాండో తెలుసు కదా? అందుకే డిఫెన్స్‌ (ఢిల్లీ)కాలనీలో ఇల్లు, విశాల్‌ అకౌంట్‌లో రెండు కోట్లు.. జస్ట్‌ అంతే!’’ఖంగు తిన్నారు పెళ్లికూతురి పేరెంట్స్‌. ‘‘ఇది విశాల్‌కు తెలుసా?’’ వాళ్ల ప్రశ్న. ‘‘అతని కోసమే కదా’’ వరుడి పేరెంట్స్‌ సమాధానం. ‘‘రెండు కోట్లు ఇస్తానంతే. డిఫెన్స్‌ కాలనీలో ఇల్లు ఇవ్వలేను’’ పెళ్లి కూతురి తండ్రి నిస్సహాయత. ‘‘అయితే నాలుగు కోట్లు క్యాష్‌’’ అవతలి వాళ్ల బెట్టు. బారాత్‌ (ఊరేగింపు) పందిట్లోకి రావాలంటే ఒప్పుకోని పరిస్థితి. తలవంచుతాడు పెళ్లికూతురి తండ్రి. పీటల మీద వరుడితో వధువుకి కొంగుముడి పడుతుంది. అప్పుడు వధువు చెవిలో తారాఖన్నా చెప్తుంది వరుడి తల్లిదండ్రులు ఆడిన వరకట్న బేరం గురించి. వధువు అడుగుతుంది వరుడిని..‘‘అది నీకు తెలుసా?’’ అని. ‘‘మనకోసమే కదా’’ అంటాడు వరుడు. ‘‘పెళ్లి కొడుకును కొనుక్కునే దౌర్భాగ్యం నాకొద్దు’’ అంటూ కొంగుముడి విప్పుకొని మంటపంలోంచి వెళ్లిపోతుంది పెళ్లికూతురు. ఆమె పేరు.. ప్రియాంక. 
తరతరాల పురుషాధిపత్యం చెంప చెళ్లుమనిపించిన ఒక ధైర్యం.. సాహసం. అవర్‌ విమెన్‌ డోంట్‌ డిజర్వ్‌ దిస్‌.. అవర్‌ విమెన్‌ ఆర్‌ బెటర్‌ దాన్‌ దిస్‌!

ఎ మ్యారేజ్‌ ఆఫ్‌ కన్వీనియెన్స్‌
లుథియానాలోని ఓ వీథి.. అందాల పోటీలు జరుగుతున్నాయి. సుఖ్‌మనీ అనే అమ్మాయి నెగ్గింది. ‘‘సుఖ్‌మనీ.. నాక్కోబోయే కోడలు’’ అంటూ ప్రకటించాడు ఓ పెద్దాయన. అందాల పోటీలో నెగ్గిన అమ్మాయిని తనింటి కోడలిగా చేసుకోవాలని ముచ్చటపడలేదు. తనింటి కోడలిని ఎంపిక చేసుకోవడం కోసమే ఆ అందాల పోటీ నిర్వహించాడు. ‘‘ఇక్కడ (లుథియానా) ఇవి మామూలే. ఎన్‌ఆర్‌ఐ పెళ్లి కొడుకులకు అంత టైమ్‌ ఉండదు. సో.. ఇలా వాళ్లు చూడాలనుకున్న అమ్మాయిలందరికీ ఒక్కచోట బ్యూటీ కంటెస్ట్‌ కండక్ట్‌ చేస్తారు. మన ఆచారాలు, సంప్రదాయాలు, వంటలు వగైరా క్వశ్చన్స్‌ అడుగుతారు. ఈ కంటెస్ట్‌లో పాల్గొనడానికి ట్రైనింగ్‌ కూడా తీసుకుంటాం’’ అని చెప్తుంది సుఖ్‌మనీ. విషాదం ఏంటంటే.. సుఖ్‌మనీ పెళ్లవుతుంది. భర్త ఇంపోటెంట్‌ అని తేలుతుంది. ఇది అతనికి రెండో పెళ్లి. అతను ఇంపోటెంట్‌ అవడం వల్లే మొదటి భార్య విడాకులిస్తుంది. కాని ఆమె క్యారెక్టర్‌ మంచిదికాదని తామే విడాకులు ఇచ్చామని అబద్ధం చెప్పి సుఖ్‌మనీ గొంతు కోస్తారు. ఇలాంటివీ అక్కడ మామూలే! సుఖ్‌మనీ మొదటి అమ్మాయి కాదు. 

సమ్‌థింగ్‌ ఓల్డ్‌.. సమ్‌థింగ్‌ న్యూ
 అమ్మాయి పుట్టిందని తల్లిదండ్రులు ఆసుపత్రిలోనే వదిలేసిన అనాథ గీతాంజలి. మంచి హోదాలో ఉన్న ఓ జంట ఆమెను దత్తత తీసుకుంటారు. ఉద్యోగంలో స్థిరపడ్డాక నిఖిల్‌ అనే అబ్బాయితో పెళ్లి సెటిల్‌ అవుతుంది. వరుడి తల్లిదండ్రులూ ప్రగతిశీల భావాలు కలవాళ్లే. అయినా జాతకాలు చూపిస్తారు. అమ్మాయి జాతకం ప్రకారం ముందు చెట్టుతో పరిణయం జరిపించాలంటాడు పురోహితుడు. అమ్మాయి సిద్ధపడ్తుంది. ఆమె ఆ నిర్ణయానికి హతాశులవుతారు తల్లిదండ్రులు. ‘ఏ చిన్న రిస్క్‌కైనా సిద్ధంగాలేను’ అంటుంది గీతాంజలి. ఆమె అలా చెట్టును పెళ్లాడిందనే విషయం నిఖిల్‌కు తెలియదు. తెలియనివ్వరు అతని తల్లిదండ్రులు. చదువు అన్నిటినీ నేర్పదు. ఎన్నో తెలుసుకోవడానికి దారులు చూపిస్తుంది. వాటిలో విశ్లేషణ, తర్కమీమాంసలూ ఉంటాయి. 

ఎ రాయల్‌ ఎఫైర్‌
రనావత్‌.. రాజ్‌పుత్‌ రాజవంశీయుడు. హోటల్స్‌ యజమాని. అతని కొడుకు సమర్‌ రనావత్‌కు పైలట్‌ అయిన దేవయానిని నిశ్చయిస్తాడు. మెహందీ ఫంక్షన్‌లో పూజా అనే మైనర్‌ పిల్ల మీద లైంగిక హింసకు పాల్పడుతాడు. ఆ ఇంటి పరువుప్రతిష్ట పోలీస్‌స్టేషన్‌ మెట్టెక్కకూడదని కాబోయే కోడలు దేవయాని పూజాతో బేరం ఆడుతుంది. అయిదు లక్షలతో రాజీ కుదుర్చుకుంటుంది పూజా. ఇదీ మన డీఎన్‌ఏ. ఇరవై ఒకటవ శతాబ్దాన్నీ రాజరికమే ఏలుతోంది. అదేం చేసినా శిరసావహించడమే! 

ప్రైడ్‌ అండ్‌ బ్రైడ్‌జిల్లా
తరానా అలీ.. ఆస్మా అన్సారీ... ఇద్దరు వధువులు. తరానా అలీ.. తన తల్లిదండ్రుల ఆర్థికస్థితితో సంబంధం లేకుండా రాయల్‌ వెడ్డింగ్‌కి డిమాండ్‌ చేస్తుంది. బిడ్డ కోసం తల్లిదండ్రులు లక్షలు అప్పు తెస్తారు. ఆస్మా అన్సారీ దిగువ మధ్యతరగతి అమ్మాయి. తన పెళ్లితో తండ్రి అప్పులపాలు కావద్దని సింపుల్‌ మ్యారేజ్‌కి ప్లాన్‌ చేస్తుంది. 
  పెళ్లిని ఇద్దరు వ్యక్తులు.. ఆ రెండు కుటుంబాల వ్యక్తిగత వ్యవహారంగా మాత్రమే ఎందుకు చూడరు?

ది గ్రేట్‌ ఎస్కేప్‌
నూతన్‌ యాదవ్‌.. ఓ రాజకీయ నాయకుడి కూతురు. క్రిస్టియన్‌ను ప్రేమిస్తుంది. అది తెలిసీ ఆమెను హౌజ్‌ అరెస్ట్‌ చేస్తారు పెద్దలు. తమ పార్టీలోనే ఔత్సాహిక యువ నాయకుడితో పెళ్లి ఖాయం చేస్తారు. పెళ్లికి ముందురోజు ఇంట్లోంచి వెళ్లిపోయి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడుతుంది. స్టేట్‌మెంట్‌ కూడా ఇస్తుంది.. భవిష్యత్‌లో తమకేం జరిగినా దాని బాధ్యత తన తల్లిదండ్రులదేనని. కారణం... ప్రేమించిన పాపానికి నూతన్‌ యాదవ్‌ అక్క చనిపోతుంది. ఇంకోవైపు.. తారా ఖన్నా భర్త అదిల్‌ ఖన్నా.. భార్య స్నేహితురాలైన ఫైజాతో వైవాహిక సంబంధంలో ఉంటాడు. ఆ విషయం తారాకు తెలుస్తుంది. మారిపోయినట్టు నటిస్తుంటాడు ఆదిల్‌. తల్లి కావాలనుకుంటుంది తార. భర్తలో లోపం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. మేడ్‌ ఇన్‌ హెవెన్‌ కో ఫౌండర్‌ కరణ్‌ది ఇంకో సమస్య. అతను గే. తల్లే అతణ్ణి అసహ్యించుకుంటుంది.

అలాంటి ఎన్నో అవమానాలతో ఆర్టికిల్‌ 377 సవరణ (377 ఆర్టికిల్‌ నిషేధానికి ముందన్నమాట) కోసం ఉద్యమంలోకి దిగుతాడు. సంప్రదాయవాదులు అతనిమీద కోపంతో మేడ్‌ ఇన్‌ హెవెన్‌ ఆఫీస్‌ను ధ్వంసం చేస్తారు. ఇటు.. తన భర్త మారలేదని అర్థమవుతుంది తారకు. ఆ బంధంలోంచి బయటకు రావడమే కరెక్ట్‌ అనుకొని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌ ఆఫీస్‌కు చేరుతుంది. అప్పటికే అక్కడికి వచ్చి ఉంటాడు కరణ్‌. నవ్వుకుంటారు.. కన్నీళ్లు వచ్చేదాకా. తార ఒళ్లో పడుకుని సేద తీరుతుంటాడు కరణ్‌.. ఓ బిడ్డలా! ఓదారుస్తుంటుంది తార.. ఒక అమ్మలా! భయం ధైర్యాన్నిస్తే.. ఆశపుడుతుంది.. నమ్మకం కలుగుతుంది.. అంతా మంచే జరుగుతుందని! ఆశిద్దాం.. ఆడ–మగ, పేద–ధనిక, పాత–కొత్త తరాలకు.. అందరికీ...అంతా మంచే జరగాలని! 

సరస్వతి రమ

మరిన్ని వార్తలు