జీవితంలో గరళం.. హృదయంలో అమృతం

22 Nov, 2018 00:14 IST|Sakshi

నేస్తం

అది నయం కాని వ్యాధి. మందులు వాడినన్ని రోజులూ జీవితాన్నిస్తుంది. ఆపేస్తే ప్రాణాలు తీసేసుకుంటుంది. అలాగని ‘నాకు ఈ వ్యాధి ఉంది’ అని ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అది పెట్టే బాధ కన్నా సమాజం పెట్టే బాధ.. దానిని.. పంటిబిగువున తట్టుకుని నిలబడటం సాధ్యం కాదు. ఇలాంటి బాధను భరిస్తూ ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తోంది. తెలిసో తెలియకో భర్త చేసిన తప్పు ఆయనతో పాటు భార్యాబిడ్డలనూ వెంటాడింది. ఆ మహమ్మారి.. భర్తను బలి తీసుకున్నా, తనను బంధువుల్లో, సమాజంలో వివక్షకు గురిచేసినా ఆమె వెరవలేదు. భర్త చేసిన తప్పు వల్ల తనతో పాటు కుమార్తె అనుభవించిన క్షోభ మరెవ్వరికీ కలగకూడదని ఆమె భావించింది. హెచ్‌.ఐ.వి.పై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడ్డ వారికి ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. హెచ్‌.ఐ.వి. కారణంగా కుటుంబ సభ్యులు దూరం చేసిన వారిని అక్కున చేర్చుకుని వారిని సేవా కేంద్రాలకు పంపిస్తోంది. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌తో మరణించిన వారిని అయినవారు తీసుకెళ్లకపోతే తనే అన్నీ అయి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ఆదర్శ మహిళే.. సుధారాణి.

భర్త ద్వారా సంక్రమించింది
ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసరావు 22 ఏళ్ల క్రితం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో  టెలిఫోన్‌ బూత్‌ నిర్వహించేవారు. అందులోనే స్థానికంగా నివాసం ఉండే సుధారాణి పనిలో చేరింది. వారిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నారు. 1997లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. గతంలో తిరిగిన తిరుగుళ్లకు శ్రీనివాసరావుకు హెచ్‌.ఐ.వి. సోకింది. ఈ కారణంగా ఆయన భార్య, పిల్లలూ ఇబ్బంది బలయ్యారు. ఈ సమయంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల నుంచి సుధారాణి తీవ్ర వివక్షకు గురయ్యింది. తమ వాడికి ఎలాగో వ్యాధి వచ్చింది. ఆయనతో పాటు మిమ్మల్నీ చూడాలంటే  సాధ్యం కాదని వెళ్లగొట్టారు. వ్యాధితో ఏడేళ్ల పాటు బాధను అనుభవించి 2005లో శ్రీనివాసరావు మరణించాడు.  భర్త దహనసంస్కారాలు, పెద్దకర్మ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సుధారాణిని పుట్టింటికి పంపించేశారు. ప్రేమపెళ్లిని కాదని సుధారాణిని దూరంగా ఉంచిన ఆమె తల్లిదండ్రులు భర్త చనిపోయిన తర్వాత మాత్రం అక్కున చేర్చుకున్నారు. ఆమెకూ ఆ వ్యాధి ఉందని తెలిసినా.. మేమున్నామంటూ ఓదార్చారు. దీంతో కొండంత ధైర్యంతో సుధారాణి తన జీవితాన్ని కొనసాగించారు. వైద్యుల సలహాతో ఏఆర్‌టి మందులు వాడుతూ పదహారేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

అవుట్‌ రీచ్‌ వర్కర్‌గా సేవలు
తన జీవితం ఎలాగూ అస్తవ్యస్తమయ్యింది. తనలా మరొకరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, అలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆదరించాలని సుధారాణి నిర్ణయించుకున్నారు. భర్త మరణించిన తర్వాత పీపీటీసీటీ ప్లస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా సెయింట్‌ యాన్స్‌లో అవుట్‌రీచ్‌ వర్కర్‌గా చేరారు. ఇందులో భాగంగా గర్భిణిలను గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి హెచ్‌ఐవి పరీక్షలు చేయించి, ఒకవేళ వారికి హెచ్‌ఐవి ఉంటే బిడ్డకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడేలా వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. గర్భిణిలకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా 18 నెలల పాటు ఫాలో అప్‌ చేస్తున్నారు.

బాధితుల కోసం కర్నూలుతో ‘నేస్తం’
డ్రాపింగ్‌ సెంటర్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌గా పనిచేసేందుకు 2007లో  సుధారాణి కర్నూలు వచ్చారు. కర్నూలులో ‘నేస్తం ఫర్‌ రాయలసీమ రీజియన్‌ పీపుల్‌ లివింగ్‌ విత్‌ హెచ్‌ఐవి అండ్‌ ఎయిడ్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ని స్థాపించారు. డ్రాపింగ్‌ సెంటర్‌ ద్వారా హెచ్‌ఐవి ఉన్న వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ, వారు ఎవరి వల్లనైనా వివక్షకు గురవుతుంటే వెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు సుధారాణి. అలాగే హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై కళాశాలలు, పాఠశాలలు, మహిళా ప్రాంగణాల్లో ఇప్పటి వరకు 220లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్‌ఐవితో ఉన్న వారికి తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు ఇప్పించారు. ఇటీవలే ‘విహాన్‌ కేర్‌ అండ్‌ సపోర్ట్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు. హెచ్‌ఐవితో జీవించే వారిని గుర్తించి, వారిని ఏఆర్‌టి సెంటర్‌తో లింకప్‌ చేసి మందులు తీసుకునేలా చేయడం, అవసరమున్న వారికి వైద్యుల వద్దకు రెఫర్‌ చేయడం ఈ సెంటర్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవితో బాధపడుతూ చురుకుగా, కాస్త ఆరోగ్యంగా ఉన్న వారితో ఇతరులు ఆ వ్యాధికి గురిగాకుండా వారితోనే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అలాగే హెచ్‌ఐవి బారిన పడిన పిల్లలను ఐసీపీఎస్‌కు లింకప్‌ చేసి, వారికి ఏఆర్‌టి సెంటర్‌ ద్వారా మందులు అందుకునేలా చేయడంతోపాటు, నెలకు రూ.1000లు పింఛన్‌ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి పది వేల మంది హెచ్‌ఐవి బాధితులను గుర్తించి, వారిని ఏఆర్‌టి సెంటర్‌కు పంపించి మందులు ఇప్పించారు. అలాగే 104 మంది హెచ్‌ఐవి బాధిత చిన్నారులను గుర్తించి, వారి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి పంపి ఒక్కొక్కరికి నెలకు రూ.500 లు ఆర్థిక సహాయం అందేలా చేశారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ ద్వారా ఏఆర్‌టి కేంద్రంలో చికిత్స పొందేందుకు వచ్చే 100 మందికి మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజూ అందేలా చూశారు. హెచ్‌ఐవి కారణంగా కుటుంబసభ్యులు దూరం చేసిన వారిని కర్నూలు లోని  శాంతినికేతన్, అభయగిరి సెంటర్‌లతో పాటు అనంతపురంలోని ఆర్‌డిటికి పంపిస్తున్నారు. వీరిలో ఎవరైనా చనిపోతే స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తున్నారు.
– జె.కుమార్, సాక్షి, కర్నూలు

నేను పడ్డ క్షోభ  ఎవరూ పడకూడదనే
ఆ వ్యాధి బయటపడినప్పటి నుంచి నేను, నా భర్త పడిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆయన మంచాన పడ్డప్పుడు ఏ ఒక్కరూ వచ్చి చేయందించింది లేదు. సమాజంతో పాటు బంధువుల, స్నేహితులూ మమ్ములను దూరం చేశారు. ఐదేళ్ల పాటు ఆయనను కాపాడుకున్నా, చివరికి విధి గెలిచి ఆయనను మా నుంచి దూరం చేసింది. ఆ తర్వాత అమ్మ, తమ్ముడు నాకు పెద్ద దిక్కయ్యారు. సమాజం ఏమనుకున్నా ఫరవాలేదని అండగా నిలిచారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. ఈ వ్యాధి భారిన పడిన వారు నాలాగా బాధపడకూడదని భావించి హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బాధితులకు నా వంతు సేవ చేస్తున్నాను. 
– బి. సుధారాణి, నేస్తం కో ఆర్డినేటర్‌ 

మరిన్ని వార్తలు