టిక్కెట్లు కొరియర్ చేస్తాడా?

16 Sep, 2015 04:53 IST|Sakshi
టిక్కెట్లు కొరియర్ చేస్తాడా?

 కస్టమర్    :  హలో... కొరియర్ సర్వీస్?
 కల్యాణ్    :  ఎస్ మేడమ్.
 కస్టమర్    :  (సిగ్గుపడుతూ) కల్యాణ్ ఉన్నాడా?
 కల్యాణ్    :  (ఆటపట్టించడానికి) ఇవాళ వీక్లీ ఆఫ్ మేడమ్.
 కస్టమర్    :  అయ్యో!
 కల్యాణ్    :  ఏం మేడమ్? నన్ను మెసేజ్ పాస్ చెయ్యమంటారా?
 కస్టమర్    :  ఊ... హు... (మొహమాటపడుతూ, వంకర్లు తిరుగుతూ)
 కల్యాణ్    :  పర్సనలా మేడమ్? (నవ్వుకుంటూ)
 కస్టమర్    :  నీ క్లోజ్ ఫ్రెండా?
 కల్యాణ్    :  వెరీ క్లోజ్ (ముసిముసిగా నవ్వుకుంటూ)
 కస్టమర్    :  ఫ్రైడే బిజీగా ఉంటాడా?
 కల్యాణ్    :  ఎందుకు మేడమ్?
 కస్టమర్    :  నితిన్ సినిమా రిలీజ్ అవుతోందిగా... వస్తాడేమోనని!
 కల్యాణ్    :  వాడితోనే మీకు టిక్కెట్లు కొరియర్ చేయిస్తా మేడమ్!
        ఆల్ ది బెస్ట్!! ఎంజాయ్!!!
 
  రాఘవేంద్రరావు దగ్గర నుంచి వర్మ, కృష్ణవంశీ, రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్ దాకా - అగ్ర దర్శకులందరితో పనిచేసిన హీరో మీరొక్కరే!
 (సంతోషంగా...) అవును. అది నా అదృష్టం. వాళ్ళది ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. రాఘవేంద్రరావు గారు ఎంత ప్లాన్డ్ అంటే, ఏ ఆర్టిస్ట్ ఏ టైమ్‌కి వచ్చి, ఏ టైమ్‌కి వెళ్ళిపోవాలన్నా సరే - కాంబినేషన్ షాట్స్ కూడా ప్లాన్ చేసి, తీసి పంపేస్తారు. రాజమౌళి గారి ఎంతసేపటికీ పని... పని... పని... ఉదయం 7 గంటల కల్లా ఫస్ట్ షాట్ తీసేస్తారు. ప్యాకప్ టైమ్ దాకా పని చేస్తారు, చేయిస్తారు. వర్మది మరో స్టైల్. ఆర్టిస్ట్‌ను వదిలేసి, స్వేచ్ఛగా చేయమంటారు. ఈ దర్శకులందరి నుంచి చాలా నేర్చుకున్నా.
 
 ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ ఎట్టకేలకు రిలీజవుతోంది. ఎలా ఉంది?
 నితిన్: ఇది కమర్షియల్ సినిమానే అయినా, డిఫరెంట్ ప్యాట్రన్‌లో ఉండే సినిమా. షాకింగ్‌గా అనిపించే కొత్త పాయింట్. ఐటమ్ సాంగ్‌లు, సెపరేట్ కామెడీ లాంటి జిమ్మిక్కులతో కాకుండా, కథను నమ్ముకొని తీసిన సినిమా. హిట్లు, ఫ్లాప్‌లు నాకు కొత్త కాదు. కెరీర్‌లో నేను చూసినన్ని ఫ్లాప్‌లు ఎవరూ చూడలేదు. కాకపోతే, ఇలాంటివి ఆడితే, కొత్త కథలు చేయడానికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు రిలీజ్ టైమ్‌లో కొంచెం టెన్షన్‌గానే ఉంది.

రెండున్నరేళ్ళ క్రితం మొదలెట్టిన సినిమా. ఆ పాయింట్ పాతబడిపోలేదా?
 మూడేళ్ళ క్రితం కథ విన్నప్పుడు కొత్తగా ఉన్న ఆ పాయింట్ ఇప్పటికీ కొత్తదే. సినిమా ఆలస్యం కూడా ఒకందుకు మంచికే అయిందేమో! అప్పుడె వరికీ తెలియని, అర్థం కాని విషయం ఇటీవల మీడియా వల్ల తెలుస్తోంది. దాని ‘యూట్యూబ్’ వీడియో సినిమా రిలీజయ్యాక చెబుతా.  

ఇంత లేటవుతుంటే, ప్రాజెక్ట్ పైన మీ ఫోకస్ ఎలా నిలుపుకొన్నారు?
 తెలుగులో నాతో, తమిళంలో హీరో జైతో ఏకకాలంలో రెండు భాషల్లో తీసిన ఈ సినిమాలో నా పని ఏడాది క్రితమే అయిపోయింది. కాకపోతే, తమిళ వెర్షన్‌కు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల రిలీజ్ లేట్. ఈ కథ, ఇందులోని మంచి పాయింటే నా ఏకాగ్రత పోకుండా చేసింది.

మీరు పవన్ కల్యాణ్ ఫ్యాన్ కాబట్టి, సినిమా పేరు మీరే సజెస్ట్ చేశారట!
 అదేమీ లేదండీ! త్రివిక్రమ్ గారితో నేను చేస్తున్న సినిమాకు ‘అ...ఆ...’ అని పేరు పెడితే, పవన్ కల్యాణ్ అలా ‘అ...ఆ...’ అని అంటూ ఉంటాడు కాబట్టే, ఆ పేరు పెట్టారని ఎవరో రాశారు. ఏం చెబుతాం చెప్పండి! ఈ సినిమాకు ‘కొరియర్ బాయ్ కార్తీక్, కల్యాణ్’లలో ఏదో ఒకటి పెట్టాలని దర్శక, నిర్మాతలు అనుకున్నారు. రెండూ చెప్పారు. మీ ఇష్టం అన్నా.

{పొడ్యూసర్ల కష్టాలు తెలిసిన మీరు సహాయం అందించి ఉండచ్చుగా!
 ఒక దశలో అడిగా. చెరి సగం ఖర్చు పెడదామన్నా. పోనీ, తెలుగు వెర్షన్ వరకు నాకే పూర్తిగా ఇచ్చేయమన్నా. కానీ, కథ మీద నమ్మకంతో దర్శక, నిర్మాతలు అలా చేయలేదు. అందుకే, ఇప్పుడు నేను చేయగలిగిందల్లా వీలైనంత పబ్లిసిటీ ఈవెంట్స్‌లో పాల్గొనడం. అదే చేస్తున్నా.

దర్శకుడు ప్రేమ్‌సాయి కన్నా, మీరు, గౌతమ్ మీననే ఎక్కువగా పబ్లిసిటీలో కనిపిస్తున్నారు. తీరా, ఇది గౌతమ్ సినిమా అనుకుంటారేమో!
 ప్రేమ్‌సాయి కొత్తవాడు కాబట్టి, నాతో పాటు గౌతమ్ లాంటి తెలిసిన పెద్ద పేరుంటే బాగుంటుందని మేమిద్దరం చేస్తున్నాం. గౌతమ్ మీనన్ సినిమాల తరహా సెన్సిబిలిటీస్ దీనిలోనూ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది లేదు.

 ఇంతకీ సినిమా ఎలా ఉంటుందన్నదైనా ఒకటి,రెండు ముక్కల్లో చెప్పండి!
 ‘జయం’లోలా అనుకోని పరిస్థితుల్లో సామాన్యుడెలా హీరో అయ్యాడన్నది కథ. కొత్తదనం ఆకట్టుకుంటుంది. ఇది కచ్చితంగా డెరైక్టర్స్ ఫిల్మ్.

{తివిక్రమ్‌తో ప్రాజెక్ట్ ఎలా కుదిరింది? ‘అ..ఆ..’ సంగతులేంటి?
 ‘గుండె జారి గల్లంతయ్యిందే’ టైమ్‌లో ఆయన, నేను సినిమా చేద్దామనుకున్నాం. తీరా అది కుదరలేదు. ఆయనా ఇప్పుడు ఒక మంచి ప్రేమకథ చేయాలనుకుంటున్నారు. ఆయనకూ, నాకూ డేట్స్ కలిశాయి. ఇప్పుడు కుదిరింది. అంతే తప్ప, ‘అ...ఆ...’ కథకు నేనేమీ ఆఖరు ఆప్షన్ కాదు.

పూరీ జగన్ దర్శకత్వంలో మీ సినిమా ఆఖరిక్షణంలో ఆగిపోయిందేం?
 (కొద్దిగా ఇబ్బంది పడుతూ...) కొన్ని కారణాల వల్ల ఆఖరు క్షణంలో ఆ ప్రాజెక్ట్ ఆపేశాం. ఇప్పుడవన్నీ చర్చించడం ఎందుకు లెండి!

దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఇప్పుడు మీ ఈక్వేషన్ ఎలా ఉంది?
 ఇప్పటికీ బయట కనిపిస్తే, హాయ్, హలో చెప్పుకుంటాం. కాకపోతే, ‘హార్ట్ ఎటాక్’ సినిమా అప్పుడు ఉన్నంత ఫ్రెండ్షిప్ మాత్రం మా మధ్య లేదు. ఏదో తెలియని ఒక చిన్న ‘ఇల్ ఫీలింగ్’ ఇద్దరి మధ్య వచ్చింది.

మరి, మళ్ళీ ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఉందా?
 ఎందుకు లేదు! ఆయన మంచి స్క్రిప్ట్‌తో వస్తే, కచ్చితంగా నటిస్తా.

నిజజీవితంలో సరే... సినీ రంగంలో మీకు బాగా ఫ్రెండ్స్ ఎవరు?
 హీరోలు అఖిల్, మంచు విష్ణు, నాని.

అఖిల్‌కూ, మీకూ ఏజ్ గ్యాప్ ఉంది కదా! అసలెలా ఫ్రెండ్సయ్యారు?
 అయిదారేళ్ళ క్రితం ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (సి.సి.ఎల్) తొలిసారిగా జరుగుతున్నప్పుడు మా మధ్య స్నేహం కుదిరింది. మా ఇద్దరి థికింగ్ దగ్గర నుంచి చాలా అంశాలు కలుస్తాయి. అలా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం.

ఎంత ఫ్రెండ్ అయినా, అక్కినేని లాంటి పెద్ద కుటుంబం వారసుడి తొలి సినిమా ‘అఖిల్’ నిర్మించే ఛాన్సెలా వచ్చింది? ఆ ఐడియా ఎవరిది?
అఖిల్ తొలి సినిమా మేమే చేద్దామన్న ఐడియా మా నాన్న గారిది. ‘మనం’ ప్రీమియర్ చూసినప్పుడే అనుకున్నాం. ఆ ఆలోచన, స్టోరీ, వి.వి. వినాయక్ డెరైక్షన్ - ఇలా అన్నీ చెప్పగానే అఖిల్ ఫాదర్ నాగార్జున గారు కూడా హ్యాపీగా ఒప్పుకున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది.

‘అఖిల్’ సినిమాకు ఎక్కువ బడ్జెటైందట. తొలిచిత్ర హీరోకు అంత ఖర్చా?
 బడ్జెట్ ఎక్కువవడం ఏమీ లేదు. ఆ కథకు బాగా ఖర్చవుతుందని మేము ముందు నుంచి అనుకున్నదే! ఇంత ఖర్చు చేయడానికి కారణం - కథ మీద ఉన్న నమ్మకం. ఇది కేవలం భారీ సినిమా కాదు, భారీ స్టోరీతో ఉన్న సినిమా! దానికి తగ్గట్లే, రకరకాల దేశాల్లో షూటింగ్.  

కానీ, ప్రతి సినిమాకూ బడ్జెట్ పెంచుకుంటూ పోవడం కరెక్ట్ అంటారా?
 డెరైక్టర్ విజన్‌ను బట్టి, కథ డిమాండ్‌ను బట్టి, ఎవరి దమ్ము ఎంతో అంత ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. బడ్జెట్ ఎంత పెట్టినా, అంతకు అంత డబ్బులు రావడం ‘బాహుబలి’ లాంటి సినిమాలతో జరుగుతోంది కదా!

కానీ అన్ని టికెట్లూ ఒకే ధరకు ‘ఫ్లాట్ రేట్’లో అమ్మడం మంచిదంటారా?
 మంచి కాఫీ తాగాలంటే కూడా చాలా ఖర్చు చేస్తున్నప్పుడు, రెండున్నర గంటలు ఏసీలో ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమా టికెట్ కేవలం డెబ్భై రూపాయలే అంటే ఎలా? ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో హైకోర్ట్ ఆర్డర్‌తో ఎక్కువ రేట్‌కి టికెట్లమ్ముతున్నారు. వైజాగ్‌లో త్వరలో అలా చేస్తారట.

ఇంతకీ, నిర్మాతగా అనుభవమెలా ఉంది? ప్రొడక్షన్ కొనసాగిస్తారా?
 (నవ్వేస్తూ) బాబోయ్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ! వచ్చిన అనుభవం చాలు. మళ్ళీ అఖిల్ మూడో సినిమానో, నాలుగో సినిమానో నిర్మిస్తా.

మీరు అభిమానించే పవన్ కల్యాణ్ సినిమా ప్రొడ్యూస్ చేసే ఛాన్సొస్తే...?
 (వెంటనే అందుకుంటూ...) తప్పకుండా చేస్తా. ఆయన డేట్లివ్వాలే కానీ, నావన్నీ కూడా మానుకొని మరీ ఆ సినిమా చేస్తా.

ఈ పధ్నాలుగేళ్ళ కెరీర్‌లో మీరు బాగా ఆస్వాదించిన క్షణం?
 ‘ఇష్క్’ సినిమా సక్సెస్ అయిన క్షణం నా కెరీర్‌లో బెస్ట్ మూమెంట్. నా కెరీర్‌లో అది స్పెషల్ ఫిల్మ్. నా కెరీర్‌ను ‘ఇష్క్’కు ముందు, తరువాత అనుకోవచ్చు. కెరీర్ మొదట్లోనే ‘జయం’, ‘దిల్’, ‘సై’ లాంటి వరుస విజయాలు వచ్చినా, అప్పటికి సినీరంగంలో నాకేమీ తెలీదు. ఆ తరువాత దారుణమైన డౌన్‌ఫాల్ కూడా చూశా. ఆ క్షణంలో మళ్ళీ నాకు రెండో ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమా - ‘ఇష్క్’.

‘జయం’తో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన తేజతో రిలేషనెలా ఉంది?
 నాకు ఈ ఫేమ్ వచ్చిందంటే ఆయన చలవే. నాకు ఆ కృతజ్ఞత ఉంది.

తేజ తాను తీర్చిదిద్దిన హీరోలెవరూ తన ఫోనే తీయడం లేదంటున్నారే!
 ఆయన ఎవరికి ఫోన్ చేశారో! నాకైతే ఆయన నుంచి ఫోన్ రాలేదు.

పోనీ, మీరు ఆయనకు ఫోన్ చేస్తుంటారా?
 లేదు. ‘ధైర్యం’ సినిమా తరువాత బయటే తప్ప, విడిగా మేము పెద్దగా కలిసిందీ, మాట్లాడుకున్నదీ లేదు. అయితే, ఇప్పటికీ ఆయన ఒక మంచి కథతో వస్తే, సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

ఏడాది గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్పీడ్ పెంచారు.
 తప్పదు. డిసెంబర్‌లో వచ్చిన ‘చిన్నదాన నీ కోసం’ తర్వాత 6 నెలలు ఖాళీ. పూరీగారి సినిమా చేయాల్సింది. అది క్యాన్సిలయ్యేసరికి మళ్ళీ ఖాళీ. డల్ అయ్యా. ఇప్పుడు ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ రిలీజ్. అక్టోబర్ 7 నుంచి ‘అ...ఆ...’ షూటింగ్. గౌతమ్ గారు చేస్తున్న నాగచైతన్య సినిమా అయిపోగానే, తెలుగు - తమిళాల్లో ఒక సినిమా చేయాలని ప్లాన్.  
 - రెంటాల జయదేవ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా