పశ్చాత్తాపం ద్వారానే నిత్యశాంతి!

12 Feb, 2015 23:21 IST|Sakshi
పశ్చాత్తాపం ద్వారానే నిత్యశాంతి!

ఒకసారి సీమోను అనే పరిసయ్యుడు యేసును తన ఇంటికి విందుకు పిలిచాడు. పాపాత్మురాలిగా ముద్రపడిన ఒక స్త్రీ ఆహ్వానం లేకుండానే అక్కడికొచ్చింది. యేసును అత్తరుతో అభిషేకించి, ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, వాటికి ముద్దు పెట్టింది.

నిజానికి ఇంటికొచ్చిన అతిథి కాళ్లు ఇంటి సేవకులు కడిగితే ఇంటి యజమాని అతనికి ముద్దుపెట్టి సాదరంగా లోనికి తీసుకెళ్లడం నాటి ప్రముఖులైన యూదుల ఇళ్లలోని ఆచారం. తాను చేయని పనులన్నీ ఆమె చేస్తూంటే అభ్యంతర పెట్టని సీమోను, ఈయన నిజంగానే ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలన్న విషయం గ్రహిస్తాడని మనసులో అనుకున్నాడు. యేసు అది గ్రహించి, ‘ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె చేసిన విస్తారమైన పాపాలూ క్షమించబడ్డాయి’ అంటూ, శాంతి గల దానవై వెళ్లమంటూ ఆమెను దీవించాడు (లూకా 7:36-50). ‘లోకంలో అందరూ పాపులే! కాకపోతే కొందరు క్షమించబడిన పాపులు, మరికొందరు ఇంకా క్షమించబడని పాపులు’అన్న సత్యాన్ని ప్రభువు సీమోనుకు పరోక్షంగా తెలిపాడు. సీమోను అతిథి మర్యాదలు చేయకపోగా, ఆ లోటును ఆ స్త్రీ పశ్చాత్తాపంతో కూడిన తన దివ్యప్రవర్తనతో పూడ్చి ఆ విందుకే అందాన్ని తెచ్చింది. అనామకురాలు, సమాజం చేత తృణీకరించబడినదే అయినా ఎంతో నిశ్శబ్దంగా ఆమె చేసిన అసమానమైన ఆనాటి ఆరాధన చరిత్ర పుటలకెక్కింది. దేవుని చేతే శ్లాఘింపబడింది. మనిషిదీ దేవునిదీ, పశ్చాత్తాపానికి, ప్రేమకూ మధ్య ఉన్న అనుబంధమే!

యేసే ఇంటికొచ్చినా ఆయన నుండి నిత్యజీవాన్ని పొందలేకపోయిన దురదృష్టవంతుడు సిమోను కాగా, పిలవని అతిథిగా వచ్చి ప్రభువు పాదాల వద్ద తన పాపాల భారాన్నంతా వదిలించుకుని ఆయన ప్రసాదించిన శాంతిని, క్షమాపణను మూటగట్టుకుని వెళ్లిన ధన్యజీవి ఆ అనామకపు స్త్రీ!!

అందుకే దేవుడిచ్చే నిత్యశాంతిని పొందడం, కోటిరూపాయలు కూడబెట్టినంత తేలిక కాదని మనం గ్రహించాలి. పాస్ పోర్టున్నోళ్లంతా విదేశాలకు వెళ్లినవాళ్లు కానట్టే, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పేవాళ్లంతా నిత్యశాంతిని పొందిన వాళ్లు కాదు. చెమటోడ్చి పని చేసే రోజు కూలీ తన పూరి గుడిసెలోనే పచ్చడి మెతుకులు తిని, చింకిచాప మీద ఒళ్లు మరచి నిద్రపోతుంటే, ఏసీ గదుల్లో బతికే ధనికులు, బడాబాబులు ఆకలి లేక, నిద్ర రాక అలమటించడం వెనుక రహస్యం అదే!

దేవుని నిత్యశాంతి అనే నది ‘పశ్చాత్తాపం’ అనే కాలువ ద్వారానే విశ్వాసి జీవితంలోకి ప్రవహిస్తుంది. ప్రేమ, నిస్వార్థత, కరుణ, పరిశుద్ధత, పరోపకారం, నిర్భయత్వం, నీతి అనే వృక్షాలు ఆ నీటితోనే విశ్వాసి జీవితంలో ఎదిగి ఫలిస్తాయి.
 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
 

మరిన్ని వార్తలు