ఎంగిలి పండు రుచి

16 Feb, 2018 00:38 IST|Sakshi

చెట్టు నీడ

తల్లి మనసు కొద్దిగా నొచ్చుకుంది. కానీ దాన్ని బయటపడనీయకుండా ఉంచేందుకు ప్రయత్నించింది.  

ఇంట్లో రెండు యాపిల్స్‌ ఉన్నాయి. చిట్టిపాప రెండింటినీ తన చిన్న చేతుల్లో పట్టుకుంది. ‘బుజ్జీ, అమ్మకో యాపిల్‌ ఇవ్వవా?’ గారాబంగా అడిగింది తల్లి. వెంటనే చిన్నారి తన ఎడమ చేతిలోని యాపిల్‌ను కొరికింది. 
తల్లి కూతురినే గమనిస్తూవుంది. కుడిచేతిలోది తనకు ఇస్తుందేమో అనుకుంది.  కానీ ఆ వెంటనే కుడిచేతిలోని యాపిల్‌ను కూడా కొరికింది చిన్నారి. రెండూ ఎంగిలి చేయకపోతేనేం! తల్లి మనసు కొద్దిగా నొచ్చుకుంది. కానీ దాన్ని బయటపడనీయకుండా ఉంచేందుకు ప్రయత్నించింది. ఎంత చిన్న పిల్లకయినా అది తగిన గుణం కాదనుకుంది.

కానీ వెంటనే పాప– ‘అమ్మా, ఈ కుడి చేతిలోది తీసుకో. ఇది దీనికన్నా తియ్యగా ఉంది’ అంటూ ఎడమచేతి వైపు చూపిస్తూ తన కుడిచేతిని ముందుకు చాచింది. అమ్మ సంభ్రమానికి గురైంది. తన చిన్నారి యాపిల్‌లాంటి చెంపలపై ముద్దులు పెట్టకుండా ఉండలేకపోయింది. మనమే ఆశ్చర్యపోయేలా జీవితం ఒక్కోసారి ప్రేమను పంచుతూవుంటుంది. అప్పుడు మనం నొచ్చుకున్నవన్నీ గాలికి ఎగిరిపోతాయి.

మరిన్ని వార్తలు