సినిమాలే కాదు...రాజకీయాలు కూడా ముఖ్యమే!

6 Oct, 2014 22:34 IST|Sakshi
సినిమాలే కాదు...రాజకీయాలు కూడా ముఖ్యమే!

యువత ‘ప్రాధాన్యత జాబితా’లో రాజకీయ వార్తలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఆరోజు విడుదలైన సినిమా గురించి, ఆరోజు చూసిన క్రికెట్ మ్యాచ్ గురించి... రకరకాల కోణాల్లో విశ్లేషించే యువత మిగిలిన విషయాల్లో మాత్రం అంటీ ముట్టనట్లుగా ఉండేది.

వినోదానికి, క్రికెట్టుకు ఇచ్చే ప్రాధాన్యతతో పోల్చితే...రాజకీయ, సామాజిక విశ్లేషణకు యువత ఇచ్చే ప్రాధాన్యత తక్కువ. అయితే సోషల్ మీడియా విస్తృతమయ్యాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
 
ప్రపంచ వ్యాప్తంగా 16-29 మధ్య వయసు ఉన్న యువతీ యువకులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. దినపత్రికలు, టీవీల కంటే ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమకాలీన రాజకీయ పరిణామాలు, దేశస్థితిగతులు, ముఖ్యమైన సంఘటనలను గురించి తెలుసుకోగలిగామని ఆస్ట్రేలియా యువతలో 65 శాతం చెబుతోంది.
 
‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’కి చెందిన అధ్యాపక బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. కామెంటింగ్, పోస్ట్‌లను షేరింగ్ చేయడం ద్వారా సమకాలీన రాజకీయాలపై తమ ఆసక్తిని ప్రదర్శిస్తుంది యువత.

‘‘ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా నేటి యువత రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటుంది’’ అన్నారు ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’ ప్రొఫెసర్ రొయెన్.సోషల్ మీడియా కారణంగా రాజకీయ వార్తల పట్ల ఆసక్తి మాత్రమే కాదు, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న యువకుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు ఆయన.

మరిన్ని వార్తలు