చిల్లుకుండలో... నీళ్ళు పోయకండి!

12 Dec, 2016 13:50 IST|Sakshi
నవంబర్ 23 సత్యసాయిబాబా జయంతి

సత్యపథం

‘అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు’ అన్న నినాదాన్ని ఒక మంత్రంగా, ఒక స్ఫూర్తిగా మలచినవారు శ్రీసత్యసాయిబాబా. బోధలతో కర్తవ్యాన్ని గుర్తు చేసేవారు కొందరైతే, బోధలతోపాటు ఆచరణ ద్వారా లోకానికి దారి చూపేవారు మరికొందరు. సత్యసాయి బోధలు, సేవలు పుట్టపర్తి దాటి ప్రపంచమంతా విస్తరించాయి. 1926 నవంబర్ 23న జన్మించిన సత్యసాయి చిన్నప్పటినుంచే తాత్వికంగా, వైరాగ్యంగా మాట్లాడేవారు. అయితే, మాటల కంటే చేతలే ముఖ్యమని నమ్మిన బాబా విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దాహార్తితో నిండిన ఎన్నో గ్రామాలకు నీటి వసతి కల్పించారు.

సత్యసాయి బోధలు
దేవుడు ఒకటే. రెండు కాదు. సాధన చేస్తే నువ్వే దైవం కావచ్చు. ఇంద్రి యాలు కోరినవన్నీ ఇస్తూ, మనసు ఆడించినట్టల్లా ఆడుతూ పోతే - నువ్వెప్పటికీ దైవం కాలేవు, దైవాన్ని చేరుకోలేవు. నీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూసుకోవడం నీ బాధ్యత. నీ దైనందిన, వృత్తిపనులు వదిలి పెట్టాలని ఎవరూ కోరుకోరు. ఈ ప్రపంచంలో హాయిగా జీవించు. కానీ ఆధ్యాత్మిక స్రవంతికి ఎన్నడూ దూరం కావద్దు.

నాలుక రుచులను కోరుతుంది. రుచులను అందిస్తూ పోతే శరీరానికే ప్రమాదం. నాలుక రుచికీ, మాటకూ ఆధారం. కాబట్టి రెండింతల జాగ్రత్త లేకపోతే, రెండింతల ప్రమాదం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, చిల్లుకుండలో నీరు పోసినట్లే. మాట అదుపు తప్పితే... మరీ ప్రమాదం.

తక్కువ మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. అవసరమైనంతే మాట్లాడాలి. మాటలో తీవ్రత పెరగకూడదు. అరుపులు, కేకలుగా మారకూడదు. కోపంలో, ఉత్సాహంలో కూడా మాట జారకూడదు.  విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో దారిదీపంగా నిలచిన బాబా 2011 ఏప్రిల్ 24న దేహాన్ని విడిచిపెట్టినా, ఆయన బోధలు, సత్యసాయి ట్రస్ట్ సేవలు స్ఫూర్తినిస్తున్నాయి.

- పమిడికాల్వ మధుసూదన్

మరిన్ని వార్తలు