ఓణీ కట్టిన వసంతం

19 Mar, 2015 00:26 IST|Sakshi
ఓణీ కట్టిన వసంతం

ప్రకృతి కొత్త చిగుళ్లు తొడుగుతోంది. పరిమళం పూత దిగుతోంది.రంగులు సింగారాలౌతున్నాయి. వయ్యారాలు విహంగాలౌతున్నాయి. ఏం జరుగుతోంది?!వసంతం లంగావోణీతో ముస్తాబవుతోంది. అయ్యో... మన్మథా... నిన్నిక మళ్లీ ఆ రతీదేవే రక్షించాలి. ‘‘ఈ ఉగాది నాదే కదా’’ అని భువికి దిగి వచ్చావా...గుండె గల్లంతే. అమ్మాయ్, నువ్వే కనికరం చూపాలి.చూపు తిప్పుకోనందుకు సార్‌ని.. చూసీ చూడనట్టు పోనివ్వాలి!
 
- నిర్మలారెడ్డి
ఇటీవలి కాలంలో అమ్మాయిలనే కాదు, అమ్మలనూ అందంగా అలంకరిస్తున్నాయి డిజైనర్ లంగా ఓణీలు. అంతముచ్చటగా ఉండటం వల్లనేనేమో అమ్మల వార్డ్‌రోబ్‌లోనూ లంగా ఓణీలు హుందాగా చేరిపోతున్నాయి. పెళ్లి, పేరంటమే కాదు ఏ చిన్న వేడుకైనా సందడి చేయడానికి రెడీ అంటున్నాయి. ఇక తెలుగింటి పండగలలైతే ఆధునిక వస్త్రరాశులన్నింటినీ పక్కకు నెట్టేసి మరీ ముందుకు వచ్చేశాయి లంగాఓణీలు. పాశ్చాత్య వస్త్రధారణ అంటేనే విసుగుపుట్టింది అనుకునే నిన్నమొన్నటి తరాలు నేటి సంప్రదాయ వస్త్ర వైభవానికి మెటికలు విరిచి మరీ మురిసిపోతున్నాయి. అందుకే ఈ ఉగాది వేళ పచ్చని గడపల్లో పువ్వుల్లా విరియడానికి సిద్ధం అంటున్నాయి లంగాఓణీలు.
 
ప్రకృతితో పోటా పోటీ...
కాంక్రీట్ జనారణ్యానికీ పచ్చని శోభను నింపడానికి పండగవేళ ముస్తాబు సరైన సమాధానం. ఉగాది ప్రకృతి పండగ.. అందుకే సప్తవర్ణాల సోయగాలను ముంగిట్లోకి తేవాలంటే కాంతిమంతమైన రంగులే సరైన ఆప్షన్.  కాబట్టి పండగకు లంగాఓణీలను ఎంచుకునేటప్పుడు పసుపు, ఎరుపు, పచ్చ, మెరూన్... రంగులను దృష్టిలో పెట్టుకోవాలి.
 
సంప్రదాయంగా ఉంటూనే ఆధునిక మగువ ఇష్టపడేలా ఆ డిజైన్స్ ఉండాలి. ఇందుకు లెహంగా, ఓణీల అంచుల డిజైన్లు ఆకట్టుకునేలా ఉండాలి. చర్మ రంగు కాస్త చామనఛాయగా ఉన్నా తెలుపురంగు దుస్తులు ధరించినప్పుడు మరింత నలుపుగా కనిపిస్తారు. అందుకని హాఫ్‌వైట్ లెహంగా ధరిస్తే, ముదురు రంగు ఓణీ, బ్లౌజ్ ఎంచుకోవాలి. ఒక వేళ గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ, స్టోన్, కుందన్, జరీ వర్క్ ఉన్న లెహంగా ఎంపిక చేసుకుంటే.. సింపుల్‌గా ఉండే చున్నీని ధరించాలి.
 
మేలైన ఎంపిక..

డిజైనర్ లంగాఓణీలలో నేటి వరకు నెటెడ్ మెటీరియలే ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడీ స్థానాన్ని బెనారస్, పట్టుతోపాటు ఉప్పాడ వంటి చేనేతలూ భర్తీ చేశాయి. మనదైన వైభవాన్ని తెలియజేస్తున్నాయి. కొన్నాళ్లు ఉత్తరాది గాగ్రాచోళీలు సందడి చేశాయి. ఇప్పుడు నిన్నటి తెలుగింటి కళ మళ్లీ కనువిందుచేసేలా షిఫాన్ ఓణీలు, పట్టు పరికిణీలదే పైచేయిగా ఉంటోంది.
 
శరీరాకృతికి తగిన విధంగా...
లంగా ఓణీ డిజైన్ చేసుకునేటప్పుడు ముందుగా క్లాత్, కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. ఎంత ఖర్చు పెట్టగలమో లెక్కేసుకొని, దానికి తగిన మెటీరియల్‌ను ఎంచుకోవాలి. సన్నగా ఉన్నవారు నెటెడ్ లెహంగా కావాలనుకుంటే కింది భాగంలో (ఇన్నర్) ‘క్యాన్‌క్యాన్’ మెటీరియల్‌ను వేయాలి. దీని వల్ల కింది భాగం ఉబ్బెత్తుగా వస్తుంది. లంగా ఓణీపై డిజైన్ ఎక్కువగా ఉంటే జాకెట్టు సింపుల్‌గా ఉండాలి. లంగా వోణీల డిజైన్ సాధారణంగా ఉంటే జాకెట్టు పై వర్క్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లావుగా ఉన్నవారు ఎక్కువ వర్క్ ఉన్నవి కాకుండా, సింపుల్‌గా ఉండే లంగాఓణీలను ఎంచుకోవాలి.

మరిన్ని వార్తలు