కరోనా కథ.. ఇల్లే సురక్షితం

27 Mar, 2020 08:15 IST|Sakshi

గోపాల్‌ ప్రాజెక్ట్‌ లీడర్‌ కావడంతో మూడేళ్ళలో ఒక్కసారి కూడా ఇంటికి రావడానికి కుదరలేదు. కరోనా కారణంగా అవకాశమొచ్చింది. న్యూయార్క్‌ జాన్‌.ఎఫ్‌.కెనడీ నుంచి హైదరాబాదుకు అతి కష్టం మీద టికెట్‌ తీశాడు.

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అన్ని పరీక్షలను దాటుకుని బయటకొచ్చాక పక్కనే ఉన్న బుక్‌ స్టాల్స్‌లో పిల్లల కథల పుస్తకాలు, కథాసంపుటులు కొన్నాడు.
ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఆరుగంటల ప్రయాణం చేశాక బస్సు తన గ్రామం చేరుకుంది. బస్టాండ్‌ ఎప్పట్లానే బిచ్చగాళ్ళకు, అనాథలకు ఆశ్రయమిస్తూనే చాలా ఖాళీగా ఉంది. ఎనభై ఇళ్ళున్న చిన్న గ్రామమది. నాలుగు వందలమంది జనాభా.

‘‘ఎవరింటిని వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది. ఎవరి ఊరిని వారు శుభ్రంగా ఉంచుకుంటే దేశం పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛభారత్‌ నినాదాన్ని పాటిద్దాం. కరోనాను తరిమికొడదాం. వీలయితే మీ బంధువుల్లో అవగాహన కలిగించండి’’ తర్వాతి రోజు ప్రతింటికి వెళ్లి మాస్కులు అందజేస్తూ తనవంతుగా ప్రతి ఒక్కరికి చెప్పాడు.

అతను చేస్తున్న పనిని గ్రామస్తులంతా పొగుడుతుంటే నిన్న ఎయిర్‌పోర్ట్‌లో ఒక స్వచ్చంద సంస్థ ప్రయాణికులకు మాస్కులను అందజేస్తున్నప్పుడు తమ గ్రామం గురించి చెప్పి ఐదొందల మాస్కులు తీసుకొచ్చిన సంగతి, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలెన్నో నిర్వహించాలని స్వచ్ఛందంగా విరాళమిచ్చిన సంగతి గుర్తుకొచ్చాయి.

మూడేళ్ళ తర్వాత లభించిన ఆటవిడుపులో సేద తీరడానికి పిల్లలతో ఆడుకుంటూ వారికి కథలు చదివి వినిపించాడు. వాళ్ళనూ చదవమని ప్రోత్సహించాడు. టీవీలు చూడడం తగ్గించి పుస్తక పఠనం అలవాటు చేసుకోమని హితబోధ చేశాడు. పజిల్స్‌ ఆడుకుంటూ పిల్లలు కాలక్షేపం చేస్తుంటే, కథా సంపుటులు చదువుకుంటూ లాక్‌ డౌన్‌ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉన్నాడు.కొడుకు రాకతో ఇంట్లో సందడి చోటుచేసుకోవడంతో గోపాల్‌ తల్లీదండ్రుల సంతోషం అంబరమే అయ్యింది. ప్రేమానుబంధాల మధ్యలోకి ఏ వైరస్‌లూ చొరబడలేవు.– దొండపాటి కృష్ణ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు