విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో!

30 Jul, 2014 09:24 IST|Sakshi
విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో!

కలసి ఉండటం అంటే... కలసి పంచుకోవడం. అది సంతోషమైనా... కష్టమైనా... పని అయినా. కానీ నా పుట్టింట్లో ప్రేమలు పంచుకోవడం చూళ్లేదు. నా మెట్టింట్లో పనులు పంచుకోవడం చూళ్లేదు. అందుకే కలసి వుండి మనసులు విడిపోవడం కంటే, విడిగా ఉండి మనసులు కలుపుకోవడం మంచిదేమో కదా!   విడిగా ఉండి కలివిడిగా ఉండటం మేలేమో!  కలసి ఉంటే కలదు సుఖం అని చాలా తేలికగా చెప్పేస్తారంతా. కానీ కలసి ఉండటం అంత తేలిక కాదు. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట.
 
మా నాన్న స్కూల్ టీచర్. ప్రేమాభిమానాల విలువ ఎరిగిన వ్యక్తి. తన తమ్ముళ్లను తనే పెంచారు. చదివించారు. జీవితంలో స్థిరపడేలా చేశారు. పెళ్లిళ్లు చేసి, వారి కుటుంబాలను కూడా తనతోనే పెట్టుకున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎంతో గొప్పవన్న భావన ఆయనది. అయితే నాన్న తమ్ముళ్లిద్దరూ నాన్న అంత ఉన్నత మనస్కులు కాదు. వాళ్ల పిల్లల్ని నాన్న మాతో సమానంగా చూసేవారు. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని వేరుగానే చూసేవారు. అది మాకు బాధ అనిపించినా నాన్నతో చెప్పేవాళ్లం కాదు. ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేయడాన్ని ఒప్పుకోరు. బంధాల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. అందుకే నన్ను కూడా ఉమ్మడి కుటుంబానికే కోడల్ని చేశారు. అది నాకు అంతగా ఇష్టం లేకపోయినా నాన్న మాట కాదనలేక సరే అన్నాను. కానీ నా భయమే నిజమయ్యింది.
 
మా అత్తవారింట్లో మా మామగారి తమ్ముడి కుటుంబం కూడా కలిసే ఉంటుంది. మా అత్తగారు కాస్త మెతకే కానీ మా చిన్నత్తగారు మాత్రం అలా కాదు. కోడలంటే కుటుంబాన్ని చక్కబెట్టేది అన్న భావన బలంగా నాటుకుపోయిందామెకి. దాంతో పొద్దున్న వాకిలి ఊడవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ అన్ని పనులూ నేనే చేయాల్సి వచ్చేది.ఆమెకి మగపిల్లలు లేరు.

 

కాబట్టి ఇంటికి కోడళ్లెవ్వరూ రాలేదు. మొదట అడుగు పెట్టింది నేనే. పని చేయడానికి బాధ లేదు. కానీ ఒంట్లో బాలేకపోయినా నేనే చేయాలి అనడం మాత్రం నచ్చేది కాదు. ఏమయినా నాకు ఒకటి అర్థమయింది... కలసి ఉండటం అంటే... కలసి పంచుకోవడం. అది సంతోషమైనా... కష్టమైనా... పని అయినా. కానీ నా పుట్టింట్లో ప్రేమలు పంచుకోవడం చూళ్లేదు. నా మెట్టింట్లో పనులు పంచుకోవడం చూళ్లేదు. అందుకే కలసి వుండి మనసులు విడిపోవడం కంటే, విడిగా ఉండి మనసులు కలుపుకోవడం మంచిదేమో కదా!
 
- సుధ, నరసాపురం
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు