నాకంటే ముఖ్యమా!

20 Nov, 2019 01:36 IST|Sakshi
నుస్రత్‌ జహాన్‌

ఆయన ఏదైనా బిజినెస్‌ ట్రిప్‌కి వెళుతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని నుస్రత్‌ అని ఉండొచ్చు. ఆమె పార్లమెంట్‌ సమావేశాలకు సిద్ధమౌతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని అతడు అని ఉండొచ్చు. అది ఒక విధమైన ప్రేమ వ్యక్తీకరణే తప్ప, ఒకరి విధులకు ఒకరు విఘాతం కలిగించే, దంపతుల మధ్య అగాధం సృష్టించే మాటైతే కాదు. ఈ సంగతిని వదంతులు సృష్టించేవారు గ్రహించాలి.

నిండా చేపలున్న చెరువులా ఉంది కొత్త లోక్‌సభ! పాత చేపలు, కొత్త చేపలు, ఫస్ట్‌ టైమ్‌ చేపలు. సభ శోభాయమానంగా ఉంది. సభా ప్రాంగణం కళకళలాడుతోంది. మోదీ, రాహుల్‌ వంటి నాయకులతో ప్రమాణ స్వీకారాలు ప్రారంభం అయ్యాయి. ఒక రోజు గడిచింది. రెండో రోజులో సగం గడిచింది. స్వీకారాలు సాగుతూనే ఉన్నాయి. తొలిసారి ఎంపీలు అయినవారు ప్రమాణ స్వీకారానికి ఉబలాటపడటం సహజమే. అయితే తొలిసారి ఎంపీలు అయిన ఒకరిద్దరు యువ మహిళా ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని చూడ్డానికి దేశం ఉబలాటపడుతోంది! ఆ ఎంపీలలో ఒకరు నుస్రత్‌ జహాన్‌. బెంగాల్‌ నటి. తృణమూల్‌ కాంగ్రెస్‌ లీడర్‌. మూడు లక్షలకు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచిన బసిర్హాట్‌ ఎంపీ. పాలిటిక్స్‌ కొత్త. ఎంపీగా కొత్త. ఎంత ముందుండాలి ప్రమాణ

స్వీకారానికి! నుస్రత్‌ వంతు వచ్చింది. కానీ నుస్రత్‌ రాలేదు. టైమ్‌కి రాలేకపోవడం కాదు. అసలు లోక్‌సభకే రాలేదు. అభిమానుల ప్రాణం ఉసూరుమంది. అగ్రనేతల కోపం తారస్థాయికి చేరుకుంది. కొత్తగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి.. స్కూల్‌కి డుమ్మా కొట్టినట్లు సభకు ఆబ్సెంట్‌ అవడం ఏమిటి? ఎవరికీ సమాచారం లేదు. తర్వాతొచ్చింది సమాధానం. అదీ నుస్రత్‌ ట్విట్టర్‌ నుంచి. ‘టువర్డ్స్‌ ఎ హ్యాపీలీ ఎవర్‌ ఆఫ్టర్‌ విత్‌ నిఖిల్‌జైన్‌’ అని! నిఖిల్‌ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండబోతున్నారట!! ఈ ఏడాది జూన్‌ 19న నుస్రత్‌ ప్రమాణ స్వీకారం రోజే నుస్రత్‌ పెళ్లి మహోత్సవం. ఆ టైమ్‌కి టర్కీలో ఉన్నారు ఆవిడ, ఆమె దీర్ఘకాల ప్రియ సఖుడు నిఖిల్‌ జైన్‌! ఇద్దరూ దండలు మార్చుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్న ఫొటోని కూడా ట్విట్టర్‌లో పెట్టారు నుస్రత్‌.

పార్లమెంటులో పెద్ద తలకాయలు ముఖాలు చూసుకున్నాయి. టర్కీలోని ‘సిక్స్‌ సెన్సెస్‌ కప్లాన్‌కయా’ అనే కొండ ప్రాంతపు రిసార్ట్‌లో నుస్రత్‌ వివాహం అతి గోప్యంగా జరిగింది. ‘‘ఈ పిల్లలకు సెన్స్‌ లేదు’ అనుకున్నారు కొందరు పార్లమెంటేరియన్‌లు. పిచ్చి పిచ్చి డ్రెస్‌లు వేసుకుంటుంది. కాలేజ్‌కి వచ్చినట్లు పార్లమెంటు ప్రాంగణంలో సెల్ఫీలు దిగుతుంటుంది. ప్రజలతో కూడా ఇలానే ఉంటుందా.. నాన్‌ సీరియస్‌గా.. అనుకున్నారు. వారం తర్వాతొచ్చి.. ‘‘నుస్రత్‌ అను నేను..’’ అంటూ ప్రమాణం చేశారు. పార్లమెంటు ప్రమాణం కన్నా, పెళ్లి ప్రమాణం ఎక్కువైందా నుస్రత్‌కు అని అప్పుడంతా బీజేపీ వాళ్లు సోషల్‌ మీడియాలో ఆమెను ట్రోల్‌ చేశారు. ‘‘నా కన్నా ముఖ్యమా?!’’ అని ఆమె భర్త ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్‌ మెయిల్‌ చేశాడని కూడా అప్పుడొక రూమర్‌ వచ్చింది.

పార్లమెంటు సభ్యురాలిగా.. నుస్రత్‌ జహాన్‌

2019 నవంబర్‌ 18 సోమవారం. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. సభలో నుస్రత్‌ జహాన్‌ లేరు. వర్షాకాల సమావేశాల తొలిరోజు నుస్రత్‌ లేరు, ఇప్పుడీ శీతాకాల సమావేశాల తొలిరోజూ నుస్రత్‌ లేరు. ఏమైందీ అమ్మాయికి!! హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారని వార్త. ఐసీయులో ఉన్నారని ఇంకో వార్త. అంతకుమించి వివరాలేమీ లేవు. సోషల్‌ మీడియా కామ్‌గా ఉంటుందా? తవ్వడం మొదలు పెట్టింది. ఆదివారం ఆమె భర్త పుట్టినరోజు. గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. తెల్లారే నుస్రత్‌ ఢిల్లీలో ఉండాలి. లోక్‌సభలో ఉండాలి. కానీ హాస్పిటల్‌లో ఉన్నారు! కోల్‌కతాకు ఢిల్లీకి మధ్య దూరం దాదాపు వెయ్యీ ఐదొందల కిలోమీటర్లు. విమానంలో రెండుగంటల జర్నీ.

ఎంతో అవసరం అయితే తప్ప తెల్లవారుజామునే ఢిల్లీ బయల్దేరి హడావుడిగా పార్లమెంటుకు వెళ్లాలని అనుకోరు ఎవరైనా. ఒకరోజు ముందు వెళ్తారు. ఒకరోజు ముందే నుస్రత్‌ ఎందుకు ఢిల్లీ వెళ్లలేదు అనే ప్రశ్నకు సమాధానం ఉంది. భర్త పుట్టినరోజు. రెండో రోజైనా తెల్లవారు జామునే ఎందుకు బయల్దేర లేదు అనే ప్రశ్నకూ సమాధానం ఉంది. ఆమె హాస్పిటల్‌లో ఉన్నారు. ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారనే దానికి మాత్రం ఉండీ లేనట్లుంది!! వేసుకుంటున్న మందుల మోతాదు మించిపోయి నుస్రత్‌కు ఊపిరి ఆడటం ఇబ్బందయిందని, అందుకే ఆసుపత్రిలో చేర్చారని సమాధానం. నుస్రత్‌ ఆస్త్మా పేషెంట్‌. అందుకే ఇన్‌హేలర్‌ వాడుతుంటారు. ఇన్‌హేలర్‌ కూడా పని చేయనంతగా అకస్మాత్తుగా ఆమెను ఆస్త్మా ఎటాక్‌ చేసిందా! సమాధానం లేదు. సోషల్‌ మీడియాలో రూమర్‌లు.

‘‘నా కన్నా ముఖ్యమా?!’’ అని మళ్లీ ఆమె భర్త ఆమె ఎమోషనల్‌గా బ్లాక్‌ మెయిల్‌ చేశాడా.. అనుమానం. నుస్రత్‌ డైనమిక్‌ లేడీ. ముస్లిం అయి ఉండీ, హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నందుకు తనపై తరచూ వస్తుండే విమర్శల్ని ఆమె ఏనాడూ ఖాతరు చేయలేదు. ‘‘నేను భారతీయురాలిని. నేను పాటిస్తున్నది భారతీయ సంప్రదాయం’’ అనేదే ఆమె ఎప్పుడూ ఇచ్చే సమాధానం. ఆమె భర్త బిజినెస్‌ మ్యాన్‌. ఇద్దరిదీ లవ్‌ మ్యారేజ్‌. లవ్‌లో, మ్యారేజ్‌లో ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్స్‌ ఉంటే ఉండొచ్చు.

ఆయన ఏదైనా బిజినెస్‌ ట్రిప్‌కి వెళుతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని నుస్రత్‌ అనొచ్చు. ఆమె పార్లమెంట్‌ సమావేశాలకు సిద్ధమౌతుంటే.. ‘నాకంటే ముఖ్యమా?’ అని అతడు అనొచ్చు. అది ఒక విధమైన ప్రేమ వ్యక్తీకరణే తప్ప, విధులకు విఘాతం కలిగించే, దంపతుల మధ్య అగా«థం సృష్టించే మాటైతే కాదు. అభిమానంతో కానీ, అనుమానంతో కానీ వదంతులు వ్యాపింపజేసేవారు.. ఒకటి గుర్తుంచుకోవాలి. వాళ్లలో వాళ్లు ఎన్ని అనుకున్నా, అనుకోకున్నా.. మనం అన్న మాటలే వాళ్లను ఎక్కువ హర్ట్‌ చేస్తాయి. మనమేమీ వాళ్లింట్లోని వాళ్లం కాదు కదా. కాస్త దూరం పాటించాలి. కనీసం వాళ్ల ఇంటి లోపలికి వెళ్లనంత దూరమైనా!

వదంతులు

తల్లి డింపుల్‌తో ట్వింకిల్‌ (జూన్‌ 8న డింపుల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వింకిల్‌ పెట్టిన ఫొటో)

నుస్రత్‌ జహాన్‌ను ఆసుపత్రిలో చేర్పించారన్న వార్త రావడానికి ముందు రోజు డింపుల్‌ కపాడియా (62) ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారనే ఒక వార్త వదంతులకు కారణం అయ్యింది. మీడియా ప్రతినిధి ఒకరు నేరుగా డింపుల్‌కే ఫోన్‌ చేసి అడిగినప్పుడు మొదట ఆమె నిర్ఘాంతపోయారు. ఆ వెంటనే నవ్వేస్తూ.. ‘‘నేను కాదు. మా మదర్‌ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆవిడ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని చెప్పారు. అంతకు ముందు అమితాబ్‌ బచ్చన్‌ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడం చూసి సోషల్‌ మీడియాలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రేగాయి. ‘‘నేను బాగున్నాను’’ అని ఆయనకై ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు