అజామ్‌గఢ్ నుంచి అమెరికా వరకు!

6 Oct, 2014 23:40 IST|Sakshi
అజామ్‌గఢ్ నుంచి అమెరికా వరకు!

ఫ్రాంక్ ఇస్లామ్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
కారణం... అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి
ఆయనకు ప్రశంసలు లభించడమే.
వాషింగ్టన్‌లోని పొటొమ్యాక్‌లో ఉన్న ఇంద్రభవనం లాంటి ఇస్లామ్ ఇల్లు... చాలామందితో పాటు ఒబామా మనసును కూడా దోచుకుంది.
ఒబామా స్వయంగా ఇస్లామ్‌కు ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నారు.
ఇస్లామ్ ఇంద్ర భవంతిలో ఎన్నో గదులు, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఫ్రాంక్ ఇస్లామ్ కనిపించని కష్టం కూడా ఆ భవనం పునాదులలో ఉంది.


ఇస్లామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అందరినీ ఆకట్టుకుంటున్న అతడి ఇంటి గురించి మాత్రమే కాదు... సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్న అతని వ్యక్తిత్వాన్ని గురించి కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి...
 
ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌గఢ్‌లో జన్మించారు ఇస్లామ్. అజామ్‌గఢ్ మురికివాడల్లో నుంచి అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఏయంయు) వరకు... అక్కడి నుంచి అమెరికాకు ఇస్లామ్ ప్రయాణం కొనసాగింది. తనకు బాగా ఇష్టమైన ‘ఏయంయు’ నుంచి యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో (అమెరికా) లో చేరారు ఇస్లామ్. అక్కడ చదువు పూర్తి చేసిన తరువాత ఎన్నో ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ కంపెనీలలో ఉద్యోగం చేశారు. అయితే తనకు ఎప్పుటి నుంచో ఒక కల ఉండేది - సొంతంగా ఒక కంపెనీ స్థాపించాలని! వ్యాపారవేత్తగా రాణించాలని! చేస్తున్న ఉద్యోగం మానేసి 1994లో తన దగ్గరున్న కొద్ది పెట్టుబడితో ‘క్యూయస్‌యస్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించారు.
 
‘‘ఉద్యోగం చేయడమంటే ఆ ఉద్యోగం వరకు మాత్రమే ఆలోచిస్తాం. వ్యాపారం అలా కాదు. అనేక రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధపడ్డాను’’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు ఇస్లామ్. ‘‘నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. సౌకర్యాలు కూడా లేవు. ఆత్మవిశ్వాసం ఉంది. భవిష్యత్తు ఉంది’’ అని గట్టిగా అనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని ముందుకు కదిలారు ఇస్లామ్.
 
కంపెనీ ప్రారంభించినప్పుడు... ఒకే ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి తానే!
‘సవాలును ఆహ్వానించేవాడే, విజయాన్ని ఆస్వాదించగలడు’ అనేది ఇస్లామ్ నమ్మిన సిద్ధాంతం. అదే ఆయన్ను విజేతను చేసింది. ఒక్కడితో ప్రారంభమైన కంపెనీ పదమూడు సంవత్సరాల తరువాత వేలాది ఉద్యోగుల స్థాయికి చేరుకుంది. వ్యాపారంలో భారీ విజయం సాధించిన ఇస్లామ్, ఆ స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి మరింత ధనం గడించే అవకాశం ఉన్నా...‘ ఇక చాలు’ అనుకున్నారు. ‘ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా దానికి తిరిగి ఇవ్వాలి’ అనుకున్నారు.
 
విజయవంతంగా నడుస్తున్న తన కంపెనీని 2007లో అమ్మేసి అమెరికా, భారత్‌లలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారు ఇస్లాం. తాను స్థాపించిన ‘ఫ్రాంక్ ఇస్లాం అండ్ డెబ్బి డ్రైస్‌మెన్ ఛారిటబుల్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు సహాయపడడం ప్రారంభించారు. రాజప్రాసాదాన్ని తలపించే ఇంటిని ఉద్దేశించి ‘‘ఇంత ఆడంబరం అవసరమా?’’ అని ఎవరైన ఇస్లామ్‌ని అడిగితే ఆయన మాత్రం తడుముకోకుండా-

‘‘వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వాడు, నల్లచర్మం ఉన్నవాడు కూడా భారీ విజయాలు సాధించగలడు అని చెప్పడానికి నా భవంతి ఒక ప్రతీక’’ అంటారు నవ్వుతూ. చదువు గురించి ఆయన ఎప్పుడూ గొప్పగా చెబుతారు. అందరినీ సమానీకరించే శక్తి చదువుకు ఉందంటారు.
 
‘‘విద్య అనేది ఇరవై ఒకటవ శతాబ్దపు కరెన్సీ’’ అంటూ ఒబామా చెప్పే మాటను తరచుగా ఉటంకిస్తారు. అజామ్‌గఢ్ నుంచి అమెరికా యూనివర్శిటీలలో చేరే ఎందరో విద్యార్థులకు ఇస్లామ్ అండగా నిలుస్తున్నారు. అజామ్‌గఢ్‌లో ఒక హైస్కూల్, కాలేజి నిర్మాణానికి ప్రణాళిక వేశారు. చదువులో ప్రతిభ చూపుతున్న ఆలీగఢ్ యూనివర్శిటీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నారు.
 
కేవలం విద్యకు సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం కాకుండా కళా, సాంస్కృతిక రంగాలలో కూడా ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలను చేస్తున్నారు. మహిళలకు సంబంధించిన రకరకాల సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అజామ్‌గఢ్ చుట్టుపక్కల జిల్లాలలో ఎక్కడా ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన ‘ఐటిఐ’లు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకొని అజామ్‌గఢ్‌లో ‘ఖమ్రూన్ నిస మెమోరియల్ గర్ల్స్ టెక్నికల్ కాలేజీ’’కి శంకుస్థాపన చేశారు.

‘‘అమెరికా సంపన్నుడు ఇస్లామ్   మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. తన దేశానికి సంబంధించిన అభిమానాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా... చేతల రూపంలోనూ చూపుతున్నారు’’ అంటారు ఇస్లామ్ సన్నిహితులు మెచ్చుకోలుగా.
 
ఒక కుర్రాడు అమెరికాలో చదవడానికి వెళుతుంటే ‘‘ఇస్లామ్‌లా పెద్ద పేరు తెచ్చుకోవాలి’’ అని దీవించే తల్లిదండ్రులు, ‘‘మనలో పట్టుదల ఉండాలేగానీ... ఏదైనా సాధించవచ్చు’’ అని పిల్లలకు ఇస్లామ్ జీవితాన్ని వ్యకిత్వ వికాస పాఠంగా చెప్పే ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు.

మరిన్ని వార్తలు