ఒబెసిటీతో కిడ్నీలకు ప్రమాదమే

9 Mar, 2019 12:09 IST|Sakshi

మారుతున్న జీవన విధానం, ఫ్లోరైడ్‌ నీరు, రసాయన ఆహార పదార్థాలతో జన్యు సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి.  ప్రధానంగా కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 2 నుంచి 3 లక్షల మంది వరకు వివిధ రకాల కిడ్నీ వ్యాధులకు గురైన వారు ఉన్నారు.

వీరిలో కిడ్నీ వ్యాధి ముదిరిపోయి చివరి దశలో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు నెలకు 1,500 నుంచి 2 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అధిక బరువుతో అనర్థాలు తప్పడం లేదు. ప్రధానంగా ఊబకాయం(అధిక బరువు)తో మూత్ర పిండాలకు చేటు తప్పదని వైద్యులు అంటున్నారు. శనివారం వరల్డ్‌ కిడ్నీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

నెల్లూరు(బారకాసు): ఊబకాయం కిడ్నీ ఆర్యోగాన్ని దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నచిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. బీపీ, షుగర్‌ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరగడం వల్ల కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా కనిగిరి, వింజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, కొండాపురం, పొదలకూరు, వెంకటగిరి, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో ఫ్లోరైడ్‌ నీరు లభ్యతతో ఆ నీటిని తాగినవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నందున ఇతర చుట్టు పక్కల జిల్లాల కంటే జిల్లాలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

- షుగర్‌ (డయాబెటీస్‌) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం.

- మూత్రంలో ప్రొటీన్‌ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది.

- ఫ్లోరైడ్‌ నీరు తాగడం వల్ల  కిడ్నీ వ్యాధుల బారిన పడతారు.

- నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.

- వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.

- కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం,    రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.

- షుగర (డయాబెటీస్‌) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.

- వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి.

- ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి.

- అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి.

- పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్‌ వెజిటేరియన్‌ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది.


కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు
లక్షణాలు 

– డాక్టర్‌ మాధవ్‌దేశాయి, చీఫ్‌ నెఫ్రాలజిస్ట్, సింహపురి హాస్పిటల్‌ 

ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు. కిడ్ని వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తిస్తే ఎంతో మేలు. లేకుంటే చాలా ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధి ముదిరితే గుండెపోటు లేక, పక్షవాతంతో మరణించే ప్రమాదం ఉంది. జిల్లాలోని 2 నుంచి 3లక్షల మందికి వివిధ రకాల కిడ్నీ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అయితే వీరిలో కేవలం 20 వేల మంది మాత్రమే ముందస్తుగా సంబంధిత వైద్యుడిని కలిసి తగిన వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారంతా  కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత చివరి దశలో మాత్రమే వైద్యుడిని కలవడం జరుగుతోంది.

>
మరిన్ని వార్తలు