ధర్మ సంస్థాపనార్థం...

29 Sep, 2017 03:06 IST|Sakshi

సందర్భం

అక్టోబర్, 1 ఆదివారం ముహర్రం

‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. రమజాన్‌ రోజాల తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించబడే రోజా అన్నమాట. రమజాన్‌ రోజాలు విధిగా (ఫర్జ్‌ గా) నిర్ణయించబడక పూర్వం ఆషూరా రోజాయే ఫర్జ్‌ రోజా. రమజాన్‌ రోజాలు నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌ గా మారిపోయింది. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ప్రకారం, ఒకసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. ఆరోజు అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. అది ముహర్రం పదవ తేదీ. వారిని ప్రవక్త అడిగారు ఏమిటి ఈరోజు విశేషం? అని.దానికి వారు,‘ఇదిచాలా గొప్పరోజు. ఈరోజే అల్లాహ్‌ మూసా(అ)ను,ఆయన జాతిని ఫిరౌన్‌ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచిపారేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దేవునికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక ఆయన అనుసరణలో ఈరోజు రోజా పాటిస్తాం’ అని చెప్పారు.

అప్పుడు ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులమని చెప్పి, రోజా పాటించమని అనుచరులకు ఉపదేశించారు. ఆషూరా రోజా యూదులే కాదు క్రైస్తవులూ పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9,10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి.

ముహర్రం మాసమంతా శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. సత్యం, న్యాయం, ధర్మం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర)అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం విషాదం కాదు. ‘ఎవరైతే అల్లాహ్‌ మార్గంలో అమరులయ్యారో వారిని మృతులు అనకండి. వారు సజీవంగా ఉన్నారు. తమ ప్రభువువద్ద ఆహారం కూడా పొందుతున్నారు.’ అంటోంది పవిత్రఖురాన్‌. అమరులు అల్లాహ్‌కు సన్నిహితులు. ఇదీ షహీదుల స్థాయి, వారి గౌరవం. వారి ఘనత.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు