మౌంట్‌ ఎస్‌పీ

6 Jan, 2019 23:33 IST|Sakshi

రెండేళ్ల క్రితం రెండు శిఖరాలు, రెండువేల పదిహేడులో మూడు, రెండువేల పద్దెనిమిదిలో రెండు శిఖరాలు.. పద్ధతిగా పాఠాలు విని పరీక్షలు రాసినట్లు, ఒద్దిగ్గా దేశ పతాకాన్ని ఆరుచోట్ల ఆవిష్కరించారు ఆక్టోపస్‌ ఎస్పీ రాధిక. శిఖరాలను అధిరోహించిన రికార్డులతోపాటు ఆక్టోపస్‌ ఉద్యోగమూ ఓ రికార్డే. ఆక్టోపస్‌ విభాగంలో తొలి మహిళా పోలీస్‌ అధికారి ఆమె.పర్వతారోహణల్లోనూకొన్ని తొలి రికార్డులు సాధించిన రాధిక... ఈ శిఖరాలన్నింటికంటే తండ్రి కోరుకున్న శిఖరాన్ని చేరుకున్నప్పుడే ఎక్కువ సంతోషాన్ని పొందానంటారు! 

ఏపీ ‘ఆక్టోపస్‌’ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాధిక పుట్టింది అనంతపూర్, పెరిగింది కడప. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో. తండ్రి కోరిక ప్రకారం ఎం.ఎ. ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివారు. ఐదున్నరేళ్లు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. తండ్రి కోరిక ప్రకారమే గ్రూప్‌ వన్‌ అధికారి కావాలనుకున్నారు, పోలీసు అధికారి అయ్యారు. బంగారంలాంటి లెక్చరర్‌ ఉద్యోగం వదులుకుని పోలీసు ఉద్యోగానికి వెళ్తానంటావా!, ఆడపిల్లకు అంత రిస్క్‌ ఎందుకు, పైగా మంచి ఉద్యోగం వదులుకుని మరీ రిస్క్‌ ఎక్కువగా ఉండే ప్రొఫెషన్‌లోకి పోతారా ఎవరైనా!.. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు ఇవన్నీ. ‘‘నాన్నకు నేను గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌ని కావడం ఇష్టం.

లైఫ్‌ చాలెంజింగ్‌గా ఉండటం నాకిష్టం. పోలీస్‌ ఉద్యోగంతో ఇద్దరి ఇష్టాలు నెరవేరుతాయి’ ఇదీ రాధిక సమాధానం. మౌంటనియరింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గుర్తు చేసుకుంటూ.. ‘ఎన్ని శిఖరాగ్రాలు చేరినా నేలకు దిగాల్సిందే, ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాల్సిందే’ అన్నారు రాధిక. అన్నింటికంటే నాన్న కోరుకున్నట్లు గ్రూప్‌ వన్‌కి సెలెక్ట్‌ అయినప్పుడు నిజంగా  శిఖరాన్నధిరోహించిన సంతోషాన్ని పొందాను. నాన్నయితే తాను ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషపడ్డారు. ఆయనకు అంత సంతోషాన్నిచ్చిన దేవుడు.. నన్ను యూనిఫామ్‌లో చూసే వరకు ఆయన్ని ఉంచలేదు. నా అచీవ్‌మెంట్స్‌ను చూస్తున్న అమ్మ... తాను సంతోష పడుతూ నాన్న చూడలేకపోయాడని బాధ పడుతుంటుంది’’ అని ఉద్వేగంగా చెప్పారు రాధిక. 

భక్తిగా తొలి పర్వతం
రాధిక తొలి పర్వతారోహణ హిమాలయాల్లో మానస సరోవర్‌ యాత్ర. హిమాలయాల మీద ఇష్టంతో ఒక భక్తురాలిగా మాత్రమే మానస సరోవర్‌ పరిక్రమ చేశానన్నారు. ఆ పరిక్రమకు చాలా మంది పోనీ (పొట్టి గుర్రాలు), పోర్టర్ల సహాయం తీసుకుంటారు. రాధిక తన సామాను తానే మోసుకుంటూ కాలి నడకన పరిక్రమ పూర్తి చేయడం చూసిన తోటి ప్రయాణికురాలు దీప్తి (ముంబయిలో అడ్వొకేట్‌) ‘ఫిట్‌నెస్‌ బాగుంది, మౌంటనియరింగ్‌ కోర్సు చేయవచ్చు కదా’ అన్న మాటలే రాధికను పర్వతాల బాట పట్టించాయి. మానస సరోవర్‌ యాత్ర పూర్తి చేసుకుని డ్యూటీకి వచ్చిన తర్వాత రాధిక తన పై అధికారులను పర్వతారోహణకు అనుమతి అడిగినప్పుడు వాళ్లు సంతోషంగా అంగీకరించారు. ‘డిపార్ట్‌మెంట్‌ నుంచి స్పోర్ట్స్‌ పర్సన్స్‌ను ఎంకరేజ్‌ చేస్తుంటాం. అడ్వెంచర్‌ స్పోర్ట్‌ అయిన మౌంటనియరింగ్‌లోనూ రాణించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నో అంటాం’ అని తెలంగాణ హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాజీవ్‌ త్రివేది ప్రోత్సహించారు.

అలా 2013లో కశ్మీర్‌ రాష్ట్రం, పెహల్గామ్‌లో మౌంటనియరింగ్‌ కోర్సులు చేశారు రాధిక. శిక్షణలో భాగంగా గోలప్‌ కాంగ్రి శిఖరాన్నీ అధిరోహించారు. ఎవరెస్టు అధిరోహణకు ముందు ఐఎమ్‌ఎఫ్‌ ఆల్‌ ఉమెన్‌ ఎక్స్‌పెడిషన్‌లో మౌంట్‌ మెంటోసా శిఖరాన్ని చేరుకున్నారు. ఆ శిఖారోహణ చేసిన తొలి దక్షిణ భారత మహిళ రాధిక. తర్వాత కార్గిల్‌లో మౌంట్‌ కున్‌ శిఖరాన్ని చేరారు. ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఆమె. ఇవన్నీ ఎవరెస్టు అధిరోహణ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తనకు తాను పెట్టుకున్న పరీక్షలు. ఇక నెక్స్‌›్ట గోల్‌ ఎవరెస్టే! హిమాలయాల్లో తరచూ మారే వాతావరణానికి అనుగుణంగా బాడీ తట్టుకోవడం కోసం స్కీయింగ్‌ కోర్సు కూడా చేశారామె. ‘‘మూడు దశల కోర్సు(బేసిక్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్‌డ్‌) కోసం ఆరు వారాల పాటు గడ్డకట్టే చలిలో ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ప్రాక్టీస్‌ చేయడంతో ఎవరెస్ట్‌ను ఎక్కగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’’ అన్నారు రాధిక.

అమ్మా.. నీ కేదయినా అయితే!
‘‘ఎవరెస్టు అధిరోహణకు అవసరమైన ఫైనాన్షియల్‌ సపోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుంటున్నప్పుడు మా చిన్నవాడు నా దగ్గరగా వచ్చి ‘‘అమ్మా! నీకేదైనా అయితే’’ అన్నాడు. అప్పటికేదో సర్ది చెప్పాను. ఎవరెస్టు ఎక్కే వరకు కూడా ఆ మాట గుర్తు రాలేదు. దిగి వచ్చేటప్పుడు మృతదేహాలు కనిపిస్తాయి. అప్పుడు మా చిన్నవాడి మాటలు గుర్తొచ్చాయి. నిజానికి యుద్ధం ఎలాంటిదో మౌంటనియరింగ్‌ కూడా అలాంటిదే. యుద్ధరంగంలో అడుగు పెట్టే వరకే ఆలోచించాల్సింది. ఆ తర్వాత యుద్ధం చేయడం ఒక్కటే మన ముందుండే ఆప్షన్‌. చిన్నప్పటి నుంచి ఆటలు, సైక్లింగ్, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం ఇష్టం. ప్రతి రోజూ చాలెంజింగ్‌గానే ఉండాలి. అందుకే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని, మౌంటనియరింగ్‌నీ అంతగా ఎంజాయ్‌ చేయగలుగుతున్నాను. 

ఏడు శిఖరాల కోరిక
ఆదిలాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్‌సూచనతో మౌంట్‌ కిలిమంజారోకి వెళ్లాను. అది పూర్తయిన తర్వాత ఏడు ఖండాలు, ఏడు శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలిగింది. ఆస్ట్రేలియాలో ఎల్తైన శిఖరం కోసియోస్కోతో కలిపి ‘టెన్‌ అస్సీ పీక్‌ చాలెంజ్‌’కి తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫండింగ్‌ ఇచ్చింది. తర్వాత విభజన క్రమంలో ఏపీకి మారాను. చిత్తూరు అడిషనల్‌ ఎస్పీగా ఉన్నప్పుడు ఓఎన్‌జీసీ సహకారంతో యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అంకాకాగువాకి వెళ్లాను. మిగిలిన రెండింటికీ ఏపీ ప్రభుత్వం సహకరించింది. 

ప్రకృతిదే పై చేయి
అలాస్కాలో మౌంట్‌ దేనాలి పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ప్రకృతి విషమ పరీక్ష పెట్టింది. ఇరవై రోజుల పాటు పాతిక కేజీల బ్యాగ్‌ మోసుకుంటూ, తాడు పట్టుకుని అరవై డిగ్రీల కోణంలో పర్వతాన్ని ఎక్కిన తర్వాత, ఇక కేవలం 338 మీటర్లు ఎక్కితే సమ్మిట్‌ పూర్తవుతుందనగా విధిలేక ఆపేయాల్సి వచ్చింది. రాళ్లతో చాచి ముఖం మీద కొట్టినట్లు చిమ్ముతోంది మంచు. వాతావరణం సహకరించే వరకు ఆగక తప్పని స్థితి అది. అప్పుడు కలిగింది మాటల్లో చెప్పలేనంత బాధ. రెండున్నర గంటలు వెదర్‌ సహకరిస్తే ఆరోహణ పూర్తయ్యేది. మేము విరామం తీసుకున్నప్పుడు మంచు తుపాను రాలేదు. మళ్లీ కదిలిన రోజు వెదర్‌ వికటించింది. రెండు రోజులు ఉండి ప్రయత్నిద్దామా అంటే... మమ్మల్ని పికప్‌ చేసుకోవాల్సిన ఫ్లయిట్‌ వచ్చేసింది. ప్రైవేట్‌ ఎక్స్‌పెడిషన్‌ అయితే మరొక చాన్స్‌ కోసం ఎదురు చూడవచ్చు. కానీ అది చాలా ఖరీదవుతుంది. మాకున్న ఫండింగ్‌ సరిపోదు. ప్రకృతి నిర్ణయానికి తలవంచాల్సిన పరిస్థితి అది. అప్పుడు వెళ్లిన టీమ్‌లన్నీ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది.

మనమెంత చిన్నవాళ్లమో 
‘మౌంటనియరింగ్‌ వల్ల ఏం సాధిస్తారు’ అనే ప్రాథమిక ప్రశ్న దాదాపుగా ప్రతి మౌంటనియర్‌కీ ఎదురవుతుంది. పర్వతాన్ని అధిరోహించినప్పుడు మనం ఎంత చిన్న వాళ్లమో తెలుస్తుంది. ఇంత పెద్ద చరాచర జగత్తులో మనం పిపీలికంతో సమానమనే వాస్తవాన్ని తెలుసుకుంటాం. అన్నింటికంటే ప్రధానంగా మనలోని ఇగో తొలగిపోతుంది. మనం ఎందులోనూ అధికులం కాదని తెలుసుకుంటాం. ఇది సమ్మిట్‌ విఫలమైనప్పుడు కలిగే భావన కాదు, సక్సెస్‌ అయినప్పుడు కూడా నేర్చుకునే పాఠం ఇదే. ఇలాంటి ప్రతికూల పరిస్థితి గత నెలలో చేసిన ఆరవ ఎక్స్‌పెడిషన్‌ అంటార్కిటికా విన్‌సన్‌లోనూ జరిగింది. అయితే పీక్‌ను చేరుకుని తిరిగి బేస్‌ క్యాంపుకి వచ్చిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో ఫ్లయిట్‌ రాలేదు. మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది రోజులు ఎదురుచూశాం. మాతో తీసుకెళ్లిన రేషన్‌.. మరో రెండు మూడు రోజులకే వస్తుంది. పది రోజులు రావాలంటే ఉన్నదే సర్దుకుంటూ తిన్నాం. నీటి కోసం మంచు కరిగించుకున్నాం. ఆ ఫ్యూయెల్‌ కూడా మరీ ఎక్కువేమీ ఉండదు. రోజుకు ఒకటిన్నర– రెండు లీటర్ల నీటితో సరిపెట్టుకున్నాం. 

వయసు అడ్డంకి కాదు
నాతోపాటు అంటార్కిటికాలో విన్‌సన్‌ పర్వతారోహణకు వచ్చిన వారిలో నార్వే నుంచి వచ్చిన లీస్‌జెత్‌కి 61 ఏళ్లు. కెనడా సిల్వీకి 54, మొరాకో బుష్షాకు 48. మా టీమ్‌లో నేనే చిన్నదాన్ని. నన్ను నలభై దాటాక, ఈ వయసులో  పర్వతాలెక్కడానికి వెళ్లడమా అన్న వాళ్లున్నారు. తీరా దేశం బయట అడుగు పెడితే నేను పెద్దదాన్ని కాదు చిన్నదాన్ని అనిపించింది. ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేసుకోవడం చాలా అవసరం. ‘ఎ సౌండ్‌ మైండ్‌ ఈజ్‌ ఇన్‌ సౌండ్‌ బాడీ’ అనేది అన్ని కాలాలకూ అన్ని ప్రదేశాలకూ వర్తిస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి, జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని నమ్ముతాను. ఇక నా ఫ్యామిలీ అంటారా.. మాది లవ్‌ కమ్‌ ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌. కాబట్టి మా వారు (వేణుగోపాల్‌రెడ్డి) దేనికీ అడ్డు చెప్పరు. అన్నింటిలోనూ మంచి సపోర్టును ఇస్తారు’’ 
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటో : వి. రూబిన్‌ బెసాలియల్‌

పెద్ద గీత ముందు అన్నీ చిన్న గీతలే
ప్రకృతి పెట్టే పరీక్షలకు ఓర్చి పర్వతాలెక్కి సాధించేదేమిటంటే... మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని, చీర కొనివ్వలేదని, లవ్‌ బ్రేకప్‌ అయిందని ఆత్మహత్యకు పాల్పడే వాళ్లకు, అది ఎంత అవివేకమైన పనో తెలియజెప్పాలనిపిస్తుంది. జీవితాన్ని ఉపయుక్తంగా మలచుకోవాలి. సాధించగలిగిన గోల్స్‌ను నిర్దేశించుకోవాలి, వాటిని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమ అవసరమో అంతగా శ్రమించాలని అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలకు పరిధులు గీయవద్దని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడానికి నన్ను నేను ఉదాహరణగా చూపించుకోగలుగుతున్నాను.
– జి.ఆర్‌. రాధిక, ఎస్‌.పి, ఆక్టోపస్‌ విభాగం, ఆంధ్రప్రదేశ్‌


సప్త పర్వత ఆరోహణ
►మౌంట్‌ ఎవరెస్ట్‌ 2016 మే 20 
►మౌంట్‌ కిలిమంజారో 2016 ఆగస్టు 14
►మౌంట్‌ కోసియోస్కో 2017 మార్చి 17
►మౌంట్‌ ఎల్‌బ్రస్‌ 2017 సెప్టెంబర్‌ 8
►మౌంట్‌ అకాంకాగువా 2017 డిసెంబర్‌ 30
►మౌంట్‌ దేనాలి 2018 జూలై 4 
(వాతావరణం సహకరించక శిఖరాన్ని చేరలేదు)
►మౌంట్‌ విన్‌సన్‌ 2018 డిసెంబర్‌ 16 

మరిన్ని వార్తలు