పాఠాల పడవ

13 Sep, 2019 00:09 IST|Sakshi

టీచరమ్మ

నిండుగా పారుతున్న నదిలోంచి ఆవలి ఒడ్డుకు చేరాలని ప్రయత్నిస్తున్న ఈమె ఓ టీచర్‌. ఈ ఫోటో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతోంది.  ఒడిషాలోని «ఢెంకనల్‌ జిల్లా, హిందోళ్‌ బ్లాక్‌లోని జరిపాల్‌ గ్రామానికి చెందిన ఈ టీచర్‌ పేరు బినోదిని సామల్‌. ఆ ఊరికి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న సపురా నది ఆవలి తీరంలోని రతియాపల్‌ గ్రామం పాఠశాలలో కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు బినోదిని. ఆ ఊరెళ్లి పాఠాలు చెప్పాలంటే ప్రతి వానాకాలం సపురాను ఈదాల్సిందే. వానలు మొదలైనప్పటి నుంచి చలికాలం వెళ్లేదాకా ఈ నది  దాదాపు ఇదే ప్రవాహంతో ఉంటుంది. అయినా బినోదిని బెదరరు. అలా ఆమె ఎప్పటిలాగే మొన్న కూడా నది ఈదుతూ కెమెరా కంట పడ్డారు. వార్తా విశేషం అయ్యారు.

రతియాపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి మూడు వరకు తరగతులున్నాయి. మొత్తం 53 మంది విద్యార్థులు. బినోదిని మూడు తరగతుల పిల్లలకు బోధిస్తారు. పందొమ్మిదేళ్ల కిందట ఆమెకు ఆ బడిలో ఉద్యోగం వచ్చింది. ఆనాటి నుంచి ఈ ఫోటో క్లిక్‌మన్న దాకా .. వానలు పడ్తున్నాయని, నది పొంగుతోందని.. ఏ ఒక్క రోజూ బడికి సెలవు పెట్టలేదు ఆమె. వృత్తిపట్ల ఆమెకున్న నిబద్ధత అలాంటిది. ముఖ్యమైన కాగితాలు, సెల్‌ఫోన్, డబ్బులు ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో దాచి.. బ్యాగ్‌లో పెడ్తారు. ఆ బ్యాగ్‌ను ఇలా చేతులతో పైకి పట్టుకొని నది ఈదుతారు.  ప్రవాహం మరీ ఉధృతంగా ఉన్నప్పుడు బ్యాగ్‌ను తలకు కట్టుకొని నది దాటుతారు. స్కూల్లోని స్టాఫ్‌రూమ్‌ అలమారాలో అదనంగా ఎప్పుడూ ఒక చీరను భద్రపర్చుకుంటారట. ఇలా తడిసిపోయి వెళ్లినప్పుడు ఆ చీరను మార్చుకుంటారు.

మళ్లీ ఇంటికి వెళ్లేప్పుడు నది దాటాలి కాబట్టి ఈ చీరను అలాగే అల్మారాలో భద్రపరిచి.. తడి చీరను కట్టుకుని ఇంటికి వెళ్తారట. ఒకటిరెండు సార్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారట కూడా. ‘‘ఈత వచ్చు కాబట్టి.. గట్టి నేల దొరకిన చోట నిలదొక్కుకొని ఒడ్డుకు చేరాను. లేకపోతే అంతే సంగతులయ్యేవి. రోజూ తడవడం వల్ల చాలాసార్లు జబ్బు పడ్డాను కూడా. అయినా బడి మానలేదు. ‘‘ఎందుకు అలా వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకుంటావ్‌? హాయిగా సెలవు తీసుకోవచ్చు కదా?’’ అని మా ఇంట్లో వాళ్లు కోప్పడ్తారు. కాని బడి మానలేను. టీచర్లు క్రమం తప్పకుండా వెళితేనే కదా పిల్లలకూ బడి అంటే భక్తి కలిగేది? క్రమశిక్షణ పెరిగేది?’’ అంటారు బినోదిని.  ‘‘మగవాళ్లు చేయని సాహసం బినోదిని టీచర్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె సెలవు పెట్టినట్టు వినలేదు.. చూడలేదు.

  ఆమె పెడ్తున్న శ్రద్ధకు అవార్డ్‌ ఇవ్వాలి’’ అంటారు రతియాపల్‌ గ్రామవాసులు. నిజానికి  ఎనిమిదేళ్ల కిందటే  ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్‌ చేయాల్సి ఉండిందట. కాని ఇంతవరకు కాలేదు. ‘‘పదిహేడు వందల రూపాయల జీతంతో చేరాను. ఇప్పుడు ఏడువేల రూపాయలు అయింది. పర్మినెంట్‌ అయి ఉంటే 27 వేల రూపాయలు అందుకునేదాన్ని’’ అంటారు కాంట్రాక్ట్‌ టీచర్‌ అయిన బినోదిని.  సపురా నది విషయానికి వస్తే కొన్నేళ్ల కిందటే నది మీద బ్రిడ్జి కట్టాలనే ప్రపోజల్‌ పెట్టారట. కాని ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ నది వల్ల స్కూల్‌ పిల్లలు, టీచర్లకు ఇబ్బంది అవుతున్న విషయం ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదని.. ఇప్పుడే తెలిసింది కాబట్టి పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలుపెడతామని అంటున్నారు ఢెంకనల్‌ జిల్లా కలెక్టర్‌ భూమేశ్‌ బెహెరా.

మరిన్ని వార్తలు