అవునట!

8 Feb, 2018 00:09 IST|Sakshi

ఆఫీస్‌ 

వాలెంటైన్స్‌ డే దగ్గరికి వస్తోంది. అన్ని చోట్లా రొమాన్స్‌ విరబోసే కాలం ఇది. అయితే ఈ ఏడాది ‘ఆఫీస్‌ రొమాన్స్‌’ బాగా తగ్గిపోయిందని రిలేషన్‌షిప్‌ ఎక్స్‌పర్ట్‌లు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు! అంత దిగ్భ్రాంతి అవసరం లేదు కానీ, ‘యంగ్‌ వాయిసెస్‌’ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ లిజ్‌ వోల్ఫ్‌ ఆ ఎక్స్‌పర్ట్‌ల చేత చిన్న సర్వే చేయిస్తే.. ఈ విషయం బయటపడింది! ‘మీ టూ’ ఎఫెక్ట్‌తో యు.ఎస్‌.లోని చాలా ఆఫీస్‌లలో మగాళ్లు తమ ఫిమేల్‌ కొలీగ్స్‌తో అంటీముట్టనట్లు ఉంటున్నారట. దాంతో పలకరింపులు తగ్గి, కనికరం కూడా లేకుండా బిహేవ్‌ చేస్తున్నారట. కనికరం ఏంటి? పనిఒత్తిడితో ఆడవాళ్లు అవస్థలు పడుతుంటే, మగవాళ్లు ఆ ఒత్తిడిని కొంత షేర్‌ చేసుకోవడం ఏ ఆఫీస్‌లోనైనా సహజమే. ఇప్పుడు అదీ లేకుండా పోయిందట.

హాయ్‌లు చెప్పుకోవడం, బాయ్‌లు చెప్పుకోవడం వరకే ఆడామగ రిలేషన్స్‌ పరిమితం అయిపోయి, కలిసి బ్రేక్‌ తీసుకోడానికి కూడా మగవాళ్లు సంశయిస్తున్నారని ఎక్స్‌పర్ట్‌లు ‘యంగ్‌ వాయిసెస్‌’ ఎడిటర్‌కి నివేదిక ఇచ్చారు. ఎంతోకాలంగా పరిచయం ఉన్న కొలీగ్‌తో కూడా జోక్‌లు వేయడానికి, హ్యాండ్‌ షేక్‌ ఇవ్వడానికి, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడ్డానికి పురుష ఉద్యోగులు సంశయించడంతో.. ఆఫీస్‌లలో ఒకలాటి ‘జెండర్‌ వార్‌’ పరిస్థితులు ఏర్పడ్డాయని కొంతకాలంగా అమెరికన్‌ మీడియా కూడా అంటోంది. దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది? హెరాస్‌మెంట్‌ కొత్త పుంతలు తొక్కిందని!
 

మరిన్ని వార్తలు