ఒక్కరోజు చావు

24 Sep, 2018 03:06 IST|Sakshi

కథాసారం

ఛత్ర చామరాలతో అలంకరించిన ముఖద్వారం, కొబ్బరాకులతో అల్లిన పూజా మంటపం, రథం అగ్రభాగాన పరుగులు తీస్తున్న శ్వేతాశ్వాలు నేత్రానందకరంగా ఉన్నాయి. జనం గంపులు గుంపులుగా వస్తున్నారు జాతరని చూడ్డానికి.

గంగరాజు సిల్కు లాల్చీ తొడుక్కుని పట్టు పంచ కట్టుకున్నాడు. బొద్దు మీసాలతో, సన్నంగా, పొడవుగా, వెండి తీగెలా ఉన్నాడు. రథయాత్రా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.
‘‘టైమయింది, గంగరాజుగారూ’’ అని పూజారి మంత్రజలం చల్లి గంగరాజు మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ చేతికి అందించేడు. రాజు ‘‘జై జగన్నాథ్‌!’’ అని టెంకాయని మూడు సార్లు దిష్టి తీసి బలంపూర్తిగా కొట్టేడు. కుర్రాళ్లు కొబ్బరి ముక్కల కోసం ఎగబడిపోతున్నారు.

‘‘జగన్నాథ మహాప్రభూకి జై’’ ‘‘గంగరాజు బాబుకీ జై’’. రథం బయలుదేరింది. నీలమాధవుడు జగన్నాథరూపంలో బలరామదేవునితోనూ, చెల్లెలు సుభద్రాదేవితోనూ విజయుని సారథ్యంలో ఊరేగుతున్నాడు. ప్రతి ఏటా ఆషాఢంలో నిజమందిరాన్ని విడిచి, విడిది మందిరం ‘‘గుడిసెన్న గుడికి’’ రథయాత్ర సాగిస్తాడు.

ధర్మకర్తృత్వం వంశ పారంపర్యంగా గంగరాజుకి సంక్రమించింది. ఆ అధికారాన్ని సవాల్‌ చేస్తూ ప్రత్యర్థి వెంకు నాయుడు కోర్టులో కేసు పెట్టేడు. రెండేళ్లుగా రథయాత్ర జరక్కుండా కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డరు తెప్పించి ఆపుచేస్తూ వచ్చాడు. చివరికి గంగరాజే గెలిచాడు. కోర్టులో గెలిచిన విజయోత్సాహంతోనూ, వెంకునాయుడి మీద కసితోనూ భోగరాగాలు అన్నీ గంగరాజే చూసుకుంటున్నాడు. ఎలక్షన్లు అతి దగ్గరలో ఉన్నాయి.

రథం మీద పూజారులు జనం అందిస్తున్న కొబ్బరికాయలు కొడుతున్నారు. పూలమాలల్ని విగ్రహాల పాదాల దగ్గరికి విసురుతున్నారు.
‘‘గంగరాజు బాబూ, మనం కాస్త జాగ్రత్తగా వుండాలి. ఎగస్పార్టీ వోళ్లు మనలో కలిసే తిరుగుతున్నారు. చూశారా ఆ గళ్ల చొక్కావోడు.’’
‘‘ఒరే సాంబా! కొండంత మనిషివి నువ్వుండగా, జగన్నాథుడు మన పార్టీ అయివుండగా ఎంకునాయుడు ఎవడ్రా? ఝూటాగాడు.’’

‘‘తగవుకి దిగితే తల తీసేస్తాను గాని, రాజుబాబు, రెండు రోజుల్నించి ఎంకునాయుడు ఇటు ఢిల్లీకి అటు హైదరాబాదుకి తెగ ఫోన్లు కొడుతున్నాడట. ఎవడో నాయకుణ్ని తెప్పించి మీటింగు పెడతాడట’’.
‘‘పెట్టనీరా, జనం బఠానీలు నవులుతూ వింటారు. తరువాత ఇళ్లకి పోతారు. మనం కూడా మలి రథయాత్ర నాడు అన్న సంతర్పణ చేయిస్తున్నాం. ఊరు ఊరంతా రావాలి. పూరీ నుంచి జగన్నాథ ప్రసాదాన్ని కుండల్లో తెప్పించి అందులో కలిపాం అందాం. వస్త్రదానం కూడా చేద్దాం. మరో రెండు వేలు ఖర్చు అవనీ. ప్రసాదం తిని మోసం చేస్తే కళ్లు పోవూ?’’

సాంబడు వెనకాల రథం దగ్గర గోలగా వుంటే అక్కడికి పరుగున వెళ్లేడు. ‘‘తొయ్యండ్రా, తొయ్యండెహే. జోర్సే.’’ రథచక్రాలు క్రీచుక్రీచుమంటూ నేలని రాసుకుంటూ కదలడం లేదు. అప్పటికే వడ్రంగి యినప చట్రాల్ని సుత్తితో కొడుతూ సరిచేస్తున్నాడు. ‘‘ఆవదం బాగా పొయ్యండ్రా’’ సాంబడు. ‘‘ఆదిలోనే ఏమిటీ అవాంతరం?’’ గంగరాజు.

‘‘నాయనా, రాజుబాబూ! ఢక్కువాడు రథం మీద కనిపించడం లేదు. దేవుడికి దిష్టి తగిలిందేమో’’ పక్కనే నిల్చున్న ముసలాయన. ఢక్కువాడి పేరు వినగానే చిన్న సంచలనం బయలుదేరింది. రథం మీద బూతు పాటలు పాడేవాణ్ని ఢక్కువాడు అంటారు. ఆ పాటలన్నీ ఒరియా భాషలో ఉంటాయి. రెండేళ్లుగా జాతర లేకపోవడంతో ఢక్కువాడి సంగతే మరిచిపోయాడు పూజారి. వెంటనే ఒక కుర్రాడు ఢక్కువాడి కోసం గాలిలా పరుగెత్తాడు.

‘‘బాబూ, ఢక్కువాడు రానంటున్నాడు. బ్లడీ భంచోత్‌. దేవుడి తరఫున నువ్వు వస్తావుట్రా, లింగులింగుమంటూ అని గసిరేశాడండి.’’
‘‘ఈ జాతి తక్కువ నా కొడుకుని నేను వెళ్లి బ్రతిమాలాలి కాబోలు’’ గంగరాజు.
‘‘వాళ్లు అలగడం, ధర్మకర్తలు వెళ్లి బ్రతిమాలి తీసుకురావడం ఆచారం’’ అన్నాడు పూజారి.
‘‘ఢక్కువాడికి కొత్తబట్టలు కుర్రాడిని పంపించి తెప్పించండి’’ జేబులో డబ్బు తీసి ఇచ్చాడు గంగరాజు.
∙∙l
ఢక్కువాడి పూరి గుడిసె ఊరవతల ఉంది. ఇంటి చుట్టూ కుళ్లు కాలవల కంపు. వైద్య విద్యార్థుల ముందు శవం ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు, ఏడాదికొకసారి ఢక్కువాడికి ప్రాముఖ్యం లభిస్తుంది. 
‘‘ఢక్కువా ఢక్కువా, పద పదరా రథం ఆగిపోయింది’’ హెచ్చరించేడు గంగరాజు. ఈ అలికిడికి పెరట్లో పనిచేసుకుంటున్న ఢక్కువాడి పెళ్లాం ఆదెమ్మ గబగబ వచ్చి ‘‘దండాలు బాబుగారు, ప్రొద్దుట్నుంచీ తెగ తాగేసి తిరుగుతున్నాడు. తిండి మానేసి కొడుకుని తల్చుకుంటూ తిరుగుతున్నాడు. ఇదిగో ఇనుకో, బాబులొచ్చారు, జాతరకెళ్లెల్లు’’ మొగుడ్ని కుదుపుతూ అంది.

‘‘జాత్తర? నెల రోజుల క్రితం నా కొడుక్కి శ్మశానంలో పెద్ద జాతర చేశాను. ఈ రోజు దేవుడికి జాతర పట్టిస్తాను’’
‘‘ఏటి బాబులొస్తే మరియాద లేకుండా?’’
‘‘రెండేళ్ల నించి నేను సచ్చానో వున్నానో పట్టించుకోని బాబులు ఈయేళ ఎందుకొచ్చారే?’’
‘‘ఒరే ఢక్కువా, కొత్తబట్టలు తెచ్చేడు. కట్టుకొని బయలుదేర్రా’’ పూజారి గర్జించేడు.

‘‘ఓల్‌రైట్‌’’ కుర్రాడు తెచ్చిన బట్టల్ని అందుకున్నాడు. ‘‘మరి కట్నం?’’
‘‘ఇదుగో ఇరవై’’ చేతిలో పెట్టబోయాడు గంగరాజు.
‘‘నో నో ఫిఫ్టీ డాలర్స్‌. ఏభై లేకపోతే నేను రానెహోయ్‌’’ 
మిగతా ముప్పై కలిపి చేతిలో పెట్టాడు గంగరాజు. తూలుతున్న ఢక్కువాడి జబ్బ పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లింది ఆదెమ్మ. గిన్నెడు తరవాణి తాగించింది. ఆ పులుపుకి మొగమంతా వికృతంగా చిట్లించుకుంటూ బ్రేవ్‌మని తేన్చాడు. ‘‘ఇక్కడ కాదు, నా కొడుకు శవాన్ని స్నానం చేయించిన దగ్గరే నాకూ నీళ్లు పొయ్యి’’ తడబడుతూ వెళ్లి కూర్చున్నాడు.
‘‘ఏభై రూపాయలు ఇలా తే. మనం తిన్నా తినకపోయినా ముందు అప్పులోళ్ల సంగతి చూడు, బజార్లో పట్టుకుని నానా తిట్లు తిడతన్నారు’’

‘‘అప్పులు చెయ్యడం, తిట్లు తినడం, పస్తులుండటం మనకలవాటేనే. ఈ అప్పు తీరిస్తే మళ్లీ మరో అప్పు. అప్పుడెక్కడ్నుంచి వస్తయి పైసలు. ఈరోజు నేను రాజా. ఈరోజు పోతే రేపు మరి నాకు లేదు. ఫుల్‌గా పఠాసు కొట్తేస్తాను’’
‘‘తిండికి లేక సస్తుంటే తాగుతానంటా వేంటీ?’’

దూరంగా బాజాల మ్రోత. సన్నాయి మేళం, జేగంటలు దగ్గరవుతూ ఢక్కువాడి ఇంటి ముందర ఆగాయి. ఆదెమ్మ ఒళ్లంతా తుడిచి కొత్తబట్టలు కట్టించింది. కొత్త పంచ, కొత్త తలపాగా. కండువా నడుంకి. చేతి కర్రకి రంగు గావంచ యెత్తి పట్టుకుని వాకిట్లో నిల్చున్నాడు ఢక్కువాడు. గంగరాజు స్వయంగా కాళ్లు కడిగి పూలదండ వేసి నమస్కరించాడు. ఢక్కువాడు రథయాత్రకిS బయలుదేరాడు.
‘‘ఢక్కువాడొచ్చేడు! ఢక్కువాడొచ్చేడు’’ అంటూ జనం చుట్టుముట్టేరు. వాళ్లందర్నీ పక్కుకు నెడుతూ నిచ్చెన వేసి వాడ్ని రథం మీదకు ఎక్కించేరు. తండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని ఢక్కువాడ్ని చూపిస్తున్నారు.

‘‘తైతైతైతై తైతైతైతై’’ అంటూ సంకీర్తన మేలగాళ్లని గొడుగు కర్రని ఆడిస్తూ హెచ్చరించేడు. ‘‘ఢింఢిం తకఢింఢిం’’ ‘‘ఢైంయ్‌ ఢైంయ్‌’’ ‘‘రొధొ ఢీకొ ఢీకొయిలా! మహాప్రాంకొరొ కొండియా నపాయిలా తైతైతై’’ వలయాకారంగా నడ్డి తిప్పుకుంటూ రథం మీద గెంతుతున్నాడు ఢక్కువాడు. బూతు పేలింది. రథచక్రాలు కదిలేయి. ఆ పాటకి అర్థం యేమిటన్నట్లు పూజారికి సంజ్ఞ చేశాడు గంగరాజు. ఒరియా తెలిసిన పూజారి గంగరాజు చెవిలో గొణిగాడు. ముసిముసి నవ్వుకుంటూ సంబరంతో పాటు నడుస్తున్నాడు గంగరాజు. ఢక్కువాడు మరో పాట అందుకున్నాడు. రకరకాలుగా గెంతుతున్నాడు. కోతిలా యెగురుతున్నాడు.

రథం దగ్గర చిన్న గందరగోళం మొదలైంది. గళ్లచొక్కావాడు ‘‘కొబ్బరికాయలు అందిస్తున్న ఆడవాళ్ల చేతులు పట్టుకుంటావా?’’ అని పూజారి పెద్దకొడుకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘రౌడీవెధవ, నువ్వు చూశావురా?’’
సాంబడు రథస్తంభం పట్టుకుని ఎగిరి గళ్ల చొక్కావాణ్ని జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ‘‘సంబరం భగ్నం చేయడానికి పితూరీ లేవదీస్తున్నావా? ఎంకునాయుడు ఎంగిలి కూడు కతికి జగడానికి వస్తావా?’’ క్రిందపడేసి ఈడ్చి ఈడ్చి తంతున్నారు. వాడి పార్టీ వాళ్లు బలం చాలక జారుకున్నారు.

బాజాలు మ్రోగుతున్నాయి. ఈ సందడిలో ఢక్కువాడు దిగిపోయేడు. సీసా తీసి డగ్‌ డగ్‌ మని గుటకలు వేసి మూతి తుడుచుకున్నాడు. ‘‘నేను దరిద్రపు నా కొడుకుని. నా బాబూ తాతలందరూ దరిద్రంతో బతికి ఆకలితో సచ్చారు. తరతరాల నుంచి మా బూతులు యింటూ కులాసా పడిపోతున్న దేవుడు మా ఆకలి తీర్చాడా? నా కొడుకును రచ్చించాడా?’’ ఢక్కువాడి కంఠం రుద్దం అవుతోంది. ‘‘నా కొడుకు పోయాడు నాయనా, ఆరు నెలలు రోగంతో తీసుకుని మందుల్లేక తిండిలేక తడపలా అయిపోయి, బిళ్ల బిళ్లలు రకతం కక్కుకుంటూ సచ్చిపోయేడు. నా పద్దెనిమిదేళ్ల కొడుకు ఎలిపోయాడు నాయనా’’ గొల్లున ఏడుస్తూ కూలిపోయాడు. సాంబడు వాడ్ని ఓదారుస్తూ రథం యెక్కించి వెనకాల ఎవరికీ కనబడకుండా పడుకోబెట్టాడు.

చీకటి పడింది. గేస్‌లైట్లు, దివిటీలు వెలిగించారు. గుడిసెన్న గుడి దగ్గర పడుతుందనగా ధన్‌మని సోడాబుడ్డి పేలింది. నలువైపుల నుంచి రాళ్లవర్షం. జనంలో గోల. గళ్ల చొక్కావాడు సైకిల్‌ చెయిన్‌తో సాంబడ్ని కొట్టాడు. చెట్టులా పడిపోయేడు సాంబడు. పూజారులు గెంతేసి పరుగు లంకించుకున్నారు. ‘‘ఎలక్షన్‌ కార్యాలయానికి నిప్పంటించేరు’’ అరిచేడు జనంలోంచి వెంకునాయుడు పార్టీవాడు. క్షణంలా వూరంతా పాకిపోయింది వార్త. కొన్ని యిళ్లు తగలబడుతున్నాయి. గళ్లచొక్కావాడిని ఎవరో కత్తితో పొడిచేరు. ధన్‌ ధన్‌ ధన్‌– గాలిలో తుపాకుల కాల్పులు. పోలీసులు పోలీసులు. అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గంగరాజునీ, వెంకునాయుణ్నీ అరెస్టు చేశారు. కరెంట్‌ కట్‌ చేశారు. కర్ఫ్యూ విధించారు. 

రథాన్ని గుడిసెన్న గుడికి తీసుకురావడానికి పోలీసుల బలగం బయలుదేరింది. పోలీసుల్ని పురమాయిస్తూ ఇన్‌స్పెక్టరు రథం మీదికి టార్చిలైటు వేశాడు. ఒక మానవ కళేబరం రథానికి వేలాడుతోంది. ఢక్కువాడు కొత్త కండువాతో ఉరిపోసుకున్నాడు.
∙∙l
తరువాతి కథ: గంగరాజు, వెంకునాయుడు తిరిగి జనాల్లోకి వచ్చారు. ప్రతీ సంవత్సరం వైభవంగా రథయాత్ర జరుగుతూనే ఉంది. వెంకునాయుడు, గంగరాజు రొటేషన్‌ పద్ధతిలో ఎంఎల్‌ఏలు అవుతూనే ఉన్నారు. పాత రథం స్థానే కొత్త రథం వచ్చింది. ఢక్కువాడి పీనుగుతో మైలపడిన పాత రథాన్ని ఊరవతల పడేశారు. చుట్టుపక్కల వాళ్లకి అప్పుడప్పుడూ ఊరవతల నించి అర్ధరాత్రివేళ స్పష్టాస్పష్టంగా ఏవో పాటలు, ఏడుపులు వినిపిస్తుంటాయట! 


అల్లం శేషగిరిరావు
(1934–2000) ‘నరమేధం’ సంక్షిప్తరూపం ఇది. 1979లో ప్రచురితమైంది. ఒరిస్సాలో జన్మించి, రైల్వేలో పనిచేసిన శేషగిరిరావు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ కథాసంకలనాలు వెలువరించారు.

 

మరిన్ని వార్తలు